Cinima:
విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ ఆయన..! వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటుడు..! మరోవైపు రైతుల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి..! నిరాడంబర జీవనశైలితో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్..!
కానీ ఆయన జీవితంలో వివాదాలకూ చోటుంది..! ముఖ్యంగా బాలీవుడ్లో మీటూ ఉద్యమం సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు మరోసారి అవే అంశాలు తెరపైకి వస్తున్నాయి.
ఇంతకీ నానా పటేకర్ జీవితంలోని మరో కోణం ఏమిటి? తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యల వెనుక కథేంటి?
నానా పటేకర్..! పరిచయం అక్కర్లేని పేరు. విలక్షణమైన నటన, గంభీరమైన స్వరం, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ప్రతిభ.. ఇవన్నీ ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.
దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. క్రాంతివీర్, పరిందా, సలామ్ బాంబే, అబ్ తక్ ఛప్పన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. జాతీయ చలనచిత్ర అవార్డులు, పద్మశ్రీ వంటి గౌరవాలు ఆయన ప్రతిభకు గుర్తింపుగా నిలిచాయి.
అయితే ఆయన జీవితం కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రైతుల సమస్యలపై స్పందించడం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడటం వంటి కార్యక్రమాలతోనూ తనదైన ముద్ర వేశారు.
రైతుల ఆత్మహత్యలతో ప్రభావితమైన కుటుంబాలకు సహాయం చేయాలనే లక్ష్యంతో నటుడు మకరంద్ అనస్పురేతో కలిసి నానా పటేకర్ నామ్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు.
నీటి సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, రైతులకు సహాయం, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ఈ సంస్థ పనిచేస్తోంది.మరోవైపు, వ్యవసాయంపై ఆసక్తితో తన ఫామ్హౌస్లోనూ పంటలు పండిస్తూ సాధారణ జీవనశైలికి ప్రాధాన్యమిచ్చిన వ్యక్తిగా ఆయన గురించి కథనాలు వెలువడ్డాయి.
ఒకవైపు స్టార్డమ్.. మరోవైపు సామాజిక సేవ..! ఈ రెండు కోణాలూ నానా పటేకర్ వ్యక్తిత్వంపై చర్చకు కారణమయ్యాయి.
అయితే నానా పటేకర్ జీవితంలో మరో ముఖ్యమైన అధ్యాయం ఉంది. అదే 2018లో బాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీసిన మీటూ వివాదం.
2008లో హార్న్ ఓకే ప్లీజ్ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనతో అనుచితంగా ప్రవర్తించారని నటి తనుశ్రీ దత్తా ఆరోపించారు. ఈ విషయంపై అప్పట్లోనే ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు.
అయితే ఆ వ్యవహారం పదేళ్ల తర్వాత, 2018లో మళ్లీ తెరపైకి రావడంతో బాలీవుడ్లో పెద్ద చర్చ మొదలైంది.
తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలను నానా పటేకర్ ఖండించారు. అనంతరం ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తు వరకు వెళ్లింది.
ఇప్పుడు మరోసారి ఈ వివాదం చర్చకు రావడానికి కారణం తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలే.
నానా పటేకర్ మరణవార్తపై స్పందిస్తూ, ఆయన పేరును నేరుగా ప్రస్తావించకుండా ‘ఈవిల్ డెడ్’ అనే పదాలను ఉపయోగించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూనే, తన వ్యాఖ్యల్లో నర్మగర్భమైన విమర్శను వ్యక్తం చేశారు. ఇప్పుడు
ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లోనూ చర్చకు దారితీశాయి.
వెండితెరపై చెరగని ముద్ర వేసిన నటుడు నానా పటేకర్..! రైతులకు అండగా నిలిచిన సేవాభావం..! మరోవైపు ఆయన పేరును చుట్టుముట్టిన వివాదాలు..!
వెలుగుకు నీడ ఉన్నట్టే, ప్రముఖుల జీవితాల్లోనూ అనేక కోణాలు ఉంటాయి. అయితే ఏది నిజం, ఏది ఆరోపణ, ఏది నిర్ధారిత వాస్తవం అనేది స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యతా మీడియా పై ఉంది.
ఇదీ నానా పటేకర్ జీవితంలోని మరో కోణం..!
