మీడియా మొగల్ రామోజీతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ.. సర్వత్రా చర్చ..!!

తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు కేంద్రంగా నడుస్తోంది. పోలింగ్ తేది దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు.. ఈనాడు సంస్థల అధినేత  రామోజీరావును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ పక్క ఉప ఎన్నిక ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో టి కాంగ్రెస్ నేతలు   మీడియా మొగల్ తో భేటీ కావడం రాజకీయా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఇక అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం గా భావిస్తున్న మునుగోడు ఎన్నికను బీజేపీ , కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలిచి మూడో సారి అధికారంలోకి రావాలని కారు పార్టీ భావిస్తుండగా.. హస్తం పార్టీ మరోసారి మునుగోడు లో గెలిచి సత్తా చాటాలని శతవిధాల ప్రయత్నిస్తుడంగా..ఇటు కమలం పార్టీ  మాత్రం ముచ్చటగా మూడో ఉప ఎన్నికలో గెలిచి  తెలంగాణా గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే  పార్టీ నేతలు  ప్రజలకు  మరింత చేరువయ్యేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలు మీడియా సంస్థల అధినేతలను ప్రసన్నం చేసుకునేందుకు వారితో చర్చలు జరుపుతున్న  వైనాన్ని చూస్తూనే ఉన్నాం. తాజాగా టి కాంగ్రెస్ నేతలు మీడియా మొగల్ రామోజీ రావు భేటీ కూడా ఇదే కోవకు చెందిన్నదన్న ప్రచారం వినిపిస్తుంది.హస్తం పార్టీకి సొంత మీడియా సంస్థ లేకపోవడం.. ఉప ఎన్నిక ప్రచారంతో పాటు మరీ కొద్ది రోజుల్లో రాష్ట్రములో రాహుల్ గాంధీ జోడో యాత్ర సాగనున్న నేపథ్యంలో.. వారితో ప్రత్యేకంగా సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీ లో ప్రధానంగా జోడో యాత్ర కవరేజ్  చర్చకు వచ్చినట్లు వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. బీజేపీ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మునుగోడు  బహిరంగ సభలో భాగంగా రామోజీ రావుతో ఏకాంతంగా భేటీ అయిన విషయం తెలిసిందే. వీరి భేటీ పై అనేక ఊహాగానాలు వినిపించినప్పటికీ.. కేవలం మర్యాద పూర్వకం భేటీ అంటూ కమలం పార్టీ స్పష్టతనిచ్చింది.

అటు  టిఆర్ఎస్ కు సొంత ఛానల్ పత్రిక ఉండడంతో ఎటువంటి డోకాలేదు.  ఇది చాలదన్నట్లు  రామోజీరావు.. ఛాన్స్ దొరికితే చాలు సీఎం కేసిఆర్ కుటుంబంపై ఎనలేని ప్రేమను కురిపిస్తున్న  విషయం అందరికి విదితమే. ఇక తన సంస్ధలో ప్రచారం సంగతి సరే సరి.

మొత్తంమీద చరిత్రలో ఎన్నడూ లేనంతగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న హస్తం పార్టీ.. ప్రజలకు చేరువయ్యేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు.

 

Optimized by Optimole