మనుషులుగా గెలుద్దాం….
నాతో ఉన్న ఈ చిన్నారులు ఇద్దరు నా దగ్గర చదువుతున్న ఏడవ తరగతి విద్యార్థులు. కళ్యాణి, భార్గవి. ఈరోజు కళ్యాణి పుట్టినరోజు. సరిగ్గా నెలరోజుల క్రితం ఈ ఇద్దరు పిల్లల తల్లి చిన్న కలతకు పెద్ద శిక్ష వేసుకుని హార్పిక్ బాటిల్ తాగేసి ఆత్మహత్య చేసుకుంది. వారం రోజులు ఆసుపత్రిలో పోరాడి మృత్యువు ఒడిలోకి జారుకుంది. ఆగస్టు 15 ఆజాదీకా అమృతోత్సవం రోజున ఈ పిల్లలిద్దరికీ క్రమశిక్షణలో ఉత్తమ బహుమతి సర్టిఫికెట్ తో సహా బహూకరించాము. తరగతిలో ఏ కోశానా అల్లరి గానీ, ఒకరితో గొడవ గానీ, కనీసం ఫిర్యాదు గానీ వీరిద్దరి నుంచి గానీ వీరిద్దరి పైన గానీ రాలేదు. చక్కగా స్కూల్ డ్రెస్ లో పొందికగా వస్తారు. పద్ధతిగా కూర్చుంటారు. చాలా బాగా చదువుతారు. ఒక్క రోజు కూడా ఇచ్చిన హోం వర్క్ తప్పరు. మళ్ళీ ఇంట్లో అన్ని పనులు చేస్తారు. చాలా నెమ్మదైన మంచి ప్రతిభావంతులు. వీళ్ళను అంత చక్కగా పెంచిన తల్లిదండ్రులు ధన్యులు అనుకున్నాం. కానీ సెల్ ఫోన్ వల్ల ఏర్పడిన చిన్న కలత ఈ పిల్లలకు తల్లిని దూరం చేసేసింది. ఏమిటీ దారుణం.
నేనైతే ఆమె మరణవార్త విన్న రోజు ఈ పిల్లల భవిష్యత్తును తలుచుకుని తల్లడిల్లి పోయాను. భోజనం కూడా ఎక్కలేదు. మా ఉపాధ్యాయులు ఎందుకు సార్ అలా ఉన్నారు అని పదే పదే అడిగితే….ఏమిటమ్మా ఈ విషాదం. ఎంతో బంగారం లాంటి ఈ పిల్లలు కూడా గుర్తు రాలేదా ఆ తల్లికి ?… ఆడపిల్లలకు తల్లి రక్షణ ఎంత కావాలి. వేరే స్త్రీ తల్లి లాగా కాచగలదా?…
ఎందుకు మనుషులకు అంతటి కోపం. ప్రాణాలు పోయేంత కోపం అవసరమా…లేక ఆదర్శమా….
ఈ మాయ అంతా చేసేది …ఆ మనసే కదా…
మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు….. కల్లలు కాగానే కన్నీరు అవుతావు
చీకటి గుహ నీవు
చింతల చెలి నీవు
నాటక రంగానివే…మనసా
తెగిన పతంగానివే…
ఎందుకు వలచేవో…
ఎందుకు వగచేవో..
ఎందుకు రగలేవో… ఏమై మిగిలేవో..
ఎందుకు రగలేవో… ఏమై మిగిలేవో..
మౌనమే నీ భాష!!
కోర్కెల సెలనీవు
కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా
మాయల దెయ్యానివే
లేనిది కోరేవు... ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు..యుగములు కుమిలేవు…
ఒక పొరపాటుకు..యుగములు కుమిలేవు…
మౌనమె నీ భాష ఓ మూగ మనసా….
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు..
కల్లలు కాగానే కన్నీరౌతావు….
గుప్పెడు మనసు…లో ఇంత కల్లోలం… నూరేళ్ళ మనిషి ఆయువును నిలువునా బలి చేయడం దారుణాతి దారుణం…
ఈ మనసుపై తిరగబడాలి….
ఈ మనిషి తనం వెల్లువవ్వాలి…
సమస్త మానవాళి ఇది ఆలోచించాలి…
ఆ లెక్కన అనునిత్యం నరకం అనుభవిస్తున్న ఎందరో మనుషులు ఉన్నారు.. వారంతా నిజంగా విజేతలు..
భార్య భర్తలు అహం విడనాడితే
బిడ్డల కోసం పొగరు దింపుకుంటే…
అనుమానాలతో మనసు ఊగకుంటే…
అనుబంధం ఆత్మీయత కలబోసుకుంటే..
ముందుగా మనసు విరిచే మాటలు నాలుక దాటకుంటే…ఆలూమగలకు మించిన స్నేహితులు లేరు…ఉండరు…
మన చిరాకులు, రుసరుసలు, తప్పులు, చవటపనులు, నిర్లక్ష్యాలు, లోభి బుద్ధులు… భరించేందుకు.. హీరోల్లాగా మనం చూపించే తెంపరి తనానికి…భార్యే గనుక మన పక్కన లేకుంటే…నీ కుక్క తోక వంకర పనులు క్షమించి…ఏ పూటకాపూట వండి వడ్డించక పోతే….అదీ నరకమంటే…ఆమె లేని రోజు…జీవితమే బూజు…నువ్వు అందరికీ లూజు…నీ లోపలికి పోయిన బుగ్గలు నిమురుతూ తినిపించే ఏ అంగనా దొరకదు…రంభలు ఊరికే దొరకరు….
భర్త ను అర్థం చేసుకునే క్రమంలో పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లికి ఆమె తల్లి చెప్పిన మాట మీకు చెబుతాను
“”అందంతో ఎల్లకాలం భర్తను కొంగున కొట్టుకోవడం సాధ్యపడదమ్మా…కేవలం నీ సేవలతోనే భర్తను మెప్పించగలవని నమ్ము తల్లీ…పెడసరి మాట భర్త పలికినా…గడసరి జవాబు చెప్పకు… మౌనంగానే ఉంటూ చిరునవ్వుతో అతని అమాయకత్వాన్ని గుర్తుచేయి…నిన్ను ఎన్నటికీ వీడడు””
లయగా నడుచుకోవడం.. ఒకరికి కోపం వేస్తే ఒకరు తలవంచటం మౌనం పాటించటం.. బంగారు కాపురం…
_________________
డాక్టర్ ఎమ్మెస్వీ సత్యనారాయణ బాబు (కపర్ది)