కేరళలోని త్రిసూర్ లో అరుదైన ఘటన జరిగింది . ఓ యువతి నిశ్చితార్థం చేసుకోబోయే యువకుడ్ని లారీ నడుపుకుంటూ చర్చికి తీసుకెళ్లింది. ఈ ఘటన చూసి నిశ్చితార్థ వేడుకకు వచ్చిన అతిథులందరూ ఆశ్యర్యపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. త్రిసూర్ జిల్లాలోని మానలూరుకు చెందిన దలీషా అనే యువతికి చిన్నప్పుటి నుంచి లారీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రి డేవిస్ కూడా లారీ డ్రైవర్ కావడం వల్ల తన ఇష్టాన్ని మరింత పెంచుకుంది. కొన్నిసార్లు తండ్రి లేకుండానే లారీ నడిపి.. కొచ్చి నుంచి పెట్రోల్ తెచ్చి మలప్పురం బంక్ కు సరఫరా చేసింది. ఆ సమయంలో ఆమె ట్యాంకర్ లారీ నడుపుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే దలీషా ప్రతిభను గుర్తించిన.. గల్ఫ్ కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చింది. గల్ఫ్ లో ట్యాంకర్ డ్రైవర్ గా చేరిన సమయంలో జిల్లాలోని కంజిరాపల్లికి చెందిన డ్రైవర్ హాన్సన్ తో యువతికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఇరువురు కుటుంబసభ్యులు వారి పెళ్లికి అంగీకరించారు. ఈనేపథ్యంలోనే సెయింట్ ఆంథోనీ చర్చిలో నిశ్చితార్థానికి పెద్దలు ఏర్పాటు చేశారు. దీంతో దలీషా..హాన్సన్ ను కల్యాణమండపానికి లారీలో తీసుకెళ్లింది.ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.