విశీ(వి.సాయివంశీ): అవును! పెరియార్ పుట్టిన కర్మభూమిలోనే ఈ ఘటన జరిగింది. సుబ్రహ్మణ్య భారతి పాటలు రాసిన నేల మీదే ఈ కళంకం జరిగింది. రాష్ట్రాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నాం అని గొప్పలు చెప్పే కరుణానిధి కుటుంబం పాలిస్తున్న రాజ్యంలోనే ఈ అమానుషం జరిగింది.
కోయంబత్తూరులో 8వ తరగతి చదువుతోంది ఆ దళిత విద్యార్థిని. ఏప్రిల్ 5న తొలిసారి తనకు పీరియడ్స్ వచ్చాయి. ఇలా జరిగినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టే తమిళనాడులో కూడా వేడుకలు చేస్తారు. దాన్ని రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. కొన్ని రోజుల పాటు పిల్లను బయటకు పంపరు. అయితే బాలిక తల్లిదండ్రులు అవేమీ ఆలోచించకుండా తనను బడికి పంపారు. ఏప్రిల్ 7న, అంటే తొలి పీరియడ్స్ వచ్చిన రెండు రోజుల తర్వాత, ఆ బాలిక ఫైనల్ ఎగ్జామ్స్ రాద్దామని స్వామి చిన్మయానంద మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కి వెళ్లింది. అప్పటికే తన విషయం బడిలో టీచర్లకు తెలిసింది కాబట్టి, తనను లోపలికి రానివ్వకుండా బయటే ఉంచేశారు. మొట్టమొదటి పీరియడ్స్ కాబట్టి, ‘తీట్టు’(తెలుగులో ‘ముట్టు’) అని, లోపలికి వస్తే ఇబ్బంది అవుతుందని బయట మెట్ల మీద కూర్చోబెట్టి పరీక్ష రాయించారు.
పాపం! అమాయక పిల్ల. తనతోటి వారంతా లోపల పరీక్ష రాస్తుంటే తను మాత్రం బయట కూర్చోవడం ఎంత బాధ! పైగా పీరియడ్స్ ఉన్నాయని చెప్పి బయటకు పంపడం ఎంత అమానుషం! పరీక్ష కాగానే ఇంటికి వెళ్లి ఈ విషయం చెప్పింది. ఇలాంటి విషయాలను ఆధారసహితంగా నిరూపించాలని తల్లి అనుకుంది. తర్వాత రోజు పాపను బడికి వెళ్లి, వెనక తనూ వెళ్లింది. పరీక్ష మొదలైన కాసేపటికి తన ఫోన్ కెమెరాలో వీడియో ఆన్ చేసుకొని వెళ్లగా, కూతురు బయట కూర్చుని పరీక్ష రాస్తోంది. ఆ దృశ్యాన్ని రికార్డు చేసిన ఆమె విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
వీడియో సోషల్‌మీడియాలో రావడంతో అందరూ ఆ స్కూల్ యాజమాన్యం మీద విమర్శలు చేస్తున్నారు. చదువుకున్న టీచర్లు విద్యార్థినిపై ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని మండిపడుతున్నారు. కానీ కొందరు మాత్రం ‘విద్యాలయాలు దేవాలయాల్లాంటివే, ముట్టులో ఉండి గుడికి వెళ్తారా? ఇది కూడా అంతే! పరీక్షకు వెళ్లకపోతే ఏమైంది? కావాలంటే మళ్లీ పరీక్షలు రాసుకునేది’ అంటున్నారు. లోకో భిన్న రుచి: కాదు, మూర్ఖో భిన్న రుచి:.
ఇక కామెంట్ బాక్సులో మొదలుపెడతారు చూడండి, రుతుస్రావం, స్త్రీ ప్రాధాన్యత, ఆ రోజుల్లో ఎందుకు ఇలాంటి కట్టుబాట్లు పెట్టారు, అవి ఎందుకు పాటించాలి అనే వాట్సప్ అంకుల్స్. వాళ్ల లుంగీలు వాళ్లు ఉతుక్కోవడం బద్దకమైన ప్రతి పురుషుడూ స్త్రీలు పాటించే కట్టుబాట్ల గురించి చెప్తుంటే భలే నవ్వొస్తుంది.
PS: ఈ వీడియోలో పాప రాస్తోంది సైన్స్ పరీక్ష. కానీ తన పరిస్థితి మాత్రం మత ధర్మానికి లోబడి ఉంది. అదీ వైచిత్రి.