LoveDrama : ప్రేమించి పెళ్లి చేసుకోవడమే మంచిదని కొందరి అభిప్రాయం. పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకోవడం ఉత్తమం అని మరికొందరి ఉద్దేశం. ప్రేమంటూ ఉంటే చాలు, పెళ్లికి ముందైనా, తర్వాతైనా హాయిగా జీవించొచ్చు అనేది అందరి అభిప్రాయం. వాదోపవాదాలు ఎలా ఉన్నా, ప్రపంచంలో ప్రేమ అనేది చాలామంది ఒప్పుకునే విలువైన సాధనం. చాలా ప్రేమకథలు పెళ్లితో పూర్తయితే, కొన్ని ప్రేమకథలు పెళ్లి తర్వాతే మొదలవుతుంటాయి. అలాంటి కథ ఒకటి ఇది.
2024లో పాకిస్థానీ దర్శకుడు బదర్ మెహమూద్ తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా టెలివిజన్ సిరీస్ ‘కభీ మై.. కమీ తుమ్’(కొన్నిసార్లు నేను.. కొన్నిసార్లు నువ్వు). మొత్తం 34 ఎపిసోడ్ల ఈ సిరీస్‌ని Big Bang Entertainment సంస్థ నిర్మించింది. కథ చాలా సింపుల్. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్దకొడుకు స్వార్థపరుడు. జీవితంలోని ప్రతి అవకాశాన్ని తను ఎదగడానికే వాడుకుని, ఇతరులను తొక్కేసే రకం. చిన్నవాడు అల్లరివాడు. ఇంటి బాధ్యతలు పట్టవు. ఏ ఉద్యోగమూ చేయడు. డిగ్రీ పూర్తి చేయలేదు. చివరకు తన గదికి కూడా తాను శుభ్రంగా ఉంచుకోలేడు.
పెద్దవాడికి ఒక అమ్మాయితో పెళ్లి కుదిరింది. మరో ఐదు రోజుల్లో పెళ్లి ఉందనగా, అతని బాస్ కూతురు అతనికో ఆఫర్ ఇస్తుంది. తనను పెళ్లి చేసుకుంటే కంపెనీకి సీవోవోని చేస్తానని చెప్పింది. అంత పెద్ద అవకాశం వస్తే కాదంటాడా? ఓకే అనేశాడు. వెంటనే వెళ్లి, ఆ పెళ్లి కూతురితో ‘నాకు నువ్వు నచ్చలేదు. మన పెళ్లి జరగదు’ అని చెప్పేశాడు.
ఆ అమ్మాయి షాక్ అయ్యింది. మరో ఐదు రోజుల్లో పెళ్లి. ఇప్పుడు కాదంటే ఎలా? పైగా అదే సమయానికి తనతోపాటు తన చెల్లెలికి కూడా పెళ్లి జరగబోతోంది. ఇప్పుడు తన పెళ్లి ఆగిపోతే అవతల తన చెల్లి పెళ్లి కూడా ఆగిపోతుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? ఆమె ఈ సందిగ్ధంలో ఉండగా, పెళ్లి కాదన్న వ్యక్తి తమ్ముడు, అంటే ఇంట్లో చిన్నవాడు ఈమెకు అండగా నిలబడతాడు. తన అన్న చేసిన పనిని తప్పుబడతాడు. ఈమె అతని గురించి ఆలోచిస్తుంది. తనెవరో తెలియకపోయినా తన మీద శ్రద్ధ చూపించే ఇతణ్ని పెళ్లి చేసుకోవడం ఒక్కటే ఇప్పుడు పరిష్కారం అని నిశ్చయించుకుంటుంది.
అటువారికి, ఇటువారికి ఈ నిర్ణయం ఆశ్చర్యంగా ఉంటుంది. పద్ధతిగా పెరిగి, చదువులో ముందుండే ఈ అమ్మాయి, చదువు పెద్దగా ఎక్కని, అల్లరిచిల్లరగా తిరిగే అతణ్ని ఎలా పెళ్లి చేసుకుంటుందని, జీవితాన్ని ఎలా గడుపుతుందని ఆలోచిస్తారు. ఇద్దరికీ ఏమాత్రం సరిపడదంటారు. కానీ ఆమె తన పట్టు వీడదు. పెళ్లి జరిగిపోతుంది. రెండు భిన్నధ్రువాల్లాంటి మనుషులు ఒక ఇంట్లో ఒక గదిలో భార్యాభర్తల్లా బతకాల్సిన సమయం వస్తుంది. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఏమీ చేతకానివాడు, ఏ బాధ్యతా లేనివాడు అని అనిపించుకుంటున్న భర్తను ఆ అమ్మాయి ఎలా మార్చుకుంది, ఇద్దరూ కలిసి తమకొచ్చిన సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారు, ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారనేది మిగిలిన కథ.
తమిళంలో ‘అలెపాయుతే’(తెలుగులో ‘సఖి’) సినిమాలో ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకున్న తర్వాత వారి మధ్య ఎలాంటి సమస్యలు వస్తాయని చూపించారు మణిరత్నం. ఈ సినిమా అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎక్కువగా పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకొని, ఒకరి మీద ఒకరు ఎలా ప్రేమను పెంచుకున్నారనేది ఇందులో కథ. రొమాంటిక్ నవలలు రాయడంలో ప్రసిద్ధి చెందిన పాకిస్థానీ రచయిత్రి ఫర్హత్ ఇస్తిహక్ ఈ సిరీస్‌కి సంభాషణలు రాయడం విశేషం. ఆ కారణం వల్ల ఈ సిరీస్‌లో మాటలు సహజంగా, ఆకట్టుకునేలా ఉంటాయి. భాషంతా ఉర్దూ అయినా, మనకు సులభంగానే అర్థమవుతాయి.
ఇందులో భార్య ‘షర్జీనా’గా నటి హనియా ఆమిర్, భర్త ‘ముస్తఫా’గా నటుడు, నిర్మాత ఫహద్ ముస్తఫా నటించారు. 40 ఏళ్ల ఫహద్ ముస్తఫా పాతికేళ్ల కుర్రాడి పాత్రలో ఒదిగిపోవడం చూస్తే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ‘జీతో పాకిస్థాన్’ అని ఆ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన గేమ్‌షోకు అతను హోస్ట్. ఈ సిరీస్‌లో ‘ముస్తఫా’ అనే పాత్రలో అతను నటించిన తీరు చాలా బాగుంటుంది. హనియా ఆమిర్ సైతం అతనికి సమానమైన స్థాయిలో నటించి మెప్పించింది. భార్యభర్తల మధ్య ప్రేమలు, గిల్లికజ్జాలు, మనస్పర్థలు, సరదాలు, సంతోషాలు, కష్టకాలాల్లో ఒకరికొకరు అండగా నిలవడాలు.. అన్నీ వారిద్దరూ అద్భుతంగా తెరపై చూపించారు. ఒక్కసారి చూస్తే మర్చిపోలేనంత బాగా వారి నటన ఉంటుంది. తీరైన ఫొటోగ్రఫీ, చక్కని సంగీతం వారి నటనకు నిండుతనాన్ని తెచ్చాయి.
పెళ్లయిన తర్వాత ఎలా ప్రేమించుకోవచ్చనే విషయానికి ఈ సిరీస్ చాలా విలక్షమైన అర్థాన్ని చూపించింది. ఒకరి లోపాలు ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకోవడం, ఒకరి మనసు తెలుసుకొని మరొకరు ప్రవర్తించడం.. ఇవే ప్రేమకు మూలాలని తెలుస్తుంది. ఇవి ఉన్నప్పుడు ప్రేమికులు పేదరికంలో కూడా స్వర్గం చూడగలరని వివరించింది. ప్రేమకథల్ని ఇష్టపడేవారు చూడదగ్గ సిరీస్ ఇది. ఈ సిరీస్ యూట్యూబ్‌లో English Subtitlesతో అందుబాటులో ఉంది. పాకిస్థాన్‌లో చాలా ప్రఖ్యాతి పొందిన ఈ సిరీస్‌కి దాదాపు 35 మిలియన్ల వ్యూస్ ఉండటం విశేషం.
PS: అంతా చదివాక కొందరు పెట్టే రొటీన్ కామెంట్.. ‘తెలుగులో ఉందా?’ అని. లేదు. అన్నీ మన భాషలో ఉండాలంటే ఎట్లా! కొన్ని ఒరిజినల్ భాషలో చూస్తేనే అందం. హిందీ వచ్చినవారికి ఉర్దూ అర్థం చేసుకోవడం సులభమే!
_విశీ(వి.సాయివంశీ):