చదువు ఎంత ముఖ్యమో తెలిసిన ఒక తండ్రి. ఆ చదువు కూడా ఏ ఉన్నత ప్రమాణాలతో ఉండాలో తెలిసి, అందుకు సిద్దపడ్డ సాహసి! రాజస్థాన్ రాజధాని జైపూర్ లో, రాజకుటుంబీకులు, ఇతర సంపన్నుల పిల్లలు చదువుకునే (సెయింట్ గ్జేవియర్ అనుకుంటా, పేరు సరిగా గుర్తులేదు) కాన్వెంట్ స్కూల్లో చేర్పించాడు తన కొడుకుని. జోద్పూర్ ప్రాంతంలో రెవెన్యూలో ఓ సాధారణ ఉద్యోగిగా తనకొచ్చే 60 రూపాయల నెల జీతంలో, 50 రూపాయల నెలసరి ఫీజు కట్టి కాన్వెంట్ స్కూల్లో కొడుకుని చదివించిన నిజమైన యో(త్యా)గి సుఖ్ చరణ్ అర్హ! ఇప్పుడాయనది నిండా 102 ఏళ్ల వయసు. తనకు ఆ రోజుల్లో వచ్చే జీతంలో, కొడుకు స్కూల్ ఫీజు పోను మిగిలే 10 రూపాయలకు, తాను ట్యూషన్లు చెప్పగా వచ్చే మరికొంత కలిపితే కుటుంబం గడిచేది. అయినా, అలా ఆనందంగా చదివించిన తండ్రి ఆశల్ని, ఆశయాల్ని ఎక్కడా భంగపోనీకుండా చదువుపై శ్రద్ద చూపించిన తనయుడు, చరణ్ దాస్ అర్హ…. 1968 బ్యాచ్ IAS ఆఫీసర్ గా ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కే వచ్చారు. 80 లలో ముఖ్యమంత్రి NTR కిలో బియ్యం 2 రూపాయలకే ఇచ్చి, పేద వాడి ముఖంలో ఆనందం చూస్తున్నప్పుడు, అర్హ పౌరసరఫరాల కమిషనర్! తర్వాత… రాష్ట్రంలో, డిల్లీలో పలు హోదాల్లో (కేంద్ర హోమ్ శాఖ, కోల్ శాఖ, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్) పని చేసి, 2005 లో రిటైరయ్యారు. ఆ వెంటనే, నాటి సీఎం డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి చొరవతో ఏపీ కి, సమాచార హక్కు చట్టం (RTI Act) మొట్టమొదటి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (CIC) గా నియమితులయ్యారు. నేనొక కమిషనర్ గా దాదాపు అయిదేళ్లు, ఆయనతో కలిసి పనిచేశాను.
(ఫైల్ ఫోటో )
తను 65 ఏళ్లు నిండి, కమిషనర్ గా రిటైరయినా… ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలకు డైరెక్టరుగా, చైర్మన్ గా సేవలందించారు, 74 వయసులో ఇంకా అందిస్తూనే ఉన్నారు. పెద్ద కొడుకు అమెరికా లా ఫర్మ్ లో, చిన్న కుమారుడు ముంబాయిలో ఓ పెద్ద కార్పొరేట్ సంస్థ కీలక స్థానంలో, కూతురు ఇంటీరియర్ రంగంలో గోవాలో ఉంటున్న… బహుకుటుంబీకుడు ఇప్పుడాయన! కుటుంబం పట్ల ఎంతో శ్రద్ద చూపే ‘రిలీజియస్ మైండ్’ ఆయనది. దీర్ఘకాలిక వ్యాధితో తల్లి మంచం పట్టిన నెలల కాలం (2008-9 అనుకుంటా) తుఫాన్లో అల్లల్లాడే తమలపాకులా ఛలించిన మనసాయనది. కార్యదక్షతలో మాత్రం ‘ఘటనాఘటన (can do and undo) సమర్థుడు C.D.Arha.
మనవలు, మనవరాలు ఎంతో సంపాదిస్తున్నా, స్వయంగా కొడుకు పెద్ద హోదాలో ఉండి, సర్కారు వారి ఓ పెద్ద బంగళాలో కాపురమైనా, అతి నిరాడంబర జీవితం గడిపిన సుఖ్ చరణ్ అర్హ… అన్ని విధాలా ఆదర్శప్రాయుడు. తన తనయుని కన్నా పదమూడేళ్లు చిన్నవాడినైన నన్ను కూడా, అత్యంత మర్యాదగా, గౌరవభావంతో ‘రెడ్డీ సాబ్’ అంటూ పలుకరించిన ఉన్నత సంస్కారి ఆయన. కమిషనర్ గా నేను సీ.డీ.ఆర్హ వాళ్ల ఇంటికి వెళ్లిన అరుదైన సందర్భాల్లో… గాంధీ టోపి, ఖాకీ నెక్కరు, నిమస్తీ బనియన్ తో పెరట్లో మొక్కలకు నీరు పట్టిస్తూ దర్శనమిచ్చేది. ఎంత నిగర్వి, ఎంత సౌమ్యుడు, నిరాడంబరుడో…! ఆశ్చర్యమనిపించేది. నాది మెదక్ అని తెలిసి, “త్రిపుర, సిక్కిం, గోవా, డిల్లీ, పుదుచ్చేరి వంటి చిన్న చిన్న రాష్ట్రాలే బేషుగ్గా మనగలుగుతున్నపుడు ‘తెలంగాణ’ డిమాండ్ లో తప్పులేదు, రాష్ట్రం ఇవ్వడంలో పొరపాటు లేదు, కనుక, జాప్యం చేయకుండా వెంటనే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటమే సమంజసం’ (2006, 07 ప్రాంతంలో) అని నాతో చెప్పిన విశాల హృదయుడాయన. కమిషన్ నుంచి 2010 లో రిటైరైన నుంచి ఢిల్లీలో ఉంటున్న అర్హ కుటుంబం, ఇపుడు జోద్ పూర్ (రాజస్థాన్) షిఫ్ట్ అవుతున్న సందర్భంగా, నాకు వాళ్లు పంపిన ముచ్చటైన చిత్రమిది. చిత్రంలో…. సుఖ్ చరణ్ అర్హ, చరణ్ దాస్ అర్హ, అతని సతీమణి సన్నిధి, తనయ సునయన , చిన్న కొడుకు కర్ణిసింగ్ అర్హ, ఆయన సతీమణి, చిన్న పిల్లల్లూ ఉన్నారు. పక్క చిత్రం, నేను కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు (16.11.2005), రాజ్ భవన్ దర్బార్ హాల్ లో సి.డి.అర్హ గారితో…..
==================
ఆర్. దిలీప్ రెడ్డి
పీపుల్స్ పల్స్ డైరెక్టర్