Shailakhan : పాకిస్తాన్ లో విప్లవం పుడుతోంది..!

విశీ( సాయి వంశీ):RESPECT TO YOU SHAILA KHAN..

పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబర్ షైలా ఖాన్ చేసిన పని మనమంతా తెలుసుకొని మెచ్చుకోవాల్సిన విషయం.

‘Naila Pakistani Reaction’ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకురాలు షైలా ఖాన్. ఆమెది పాకిస్థాన్‌లోని లాహోర్. సామాజిక మాధ్యమాల్లో ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే వ్యక్తి. తన అక్క నైలా ఖాన్‌తో కలిసి మూడేళ్ల క్రితం యూట్యూబ్ చానెల్‌‌ మొదలుపెట్టింది. ఆమె ఛానెల్‌కు దాదాపు 6.06 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లి, వారిని వివిధ అంశాలపై ప్రశ్నలు, అభిప్రాయాలు అడగటం, పలు వీడియోలు చేయడం ఆమె పని. తాజాగా వీధుల్లో ఒక వ్యక్తిని ప్రశ్న అడుగుతున్న సమయంలో ఆమెతో అతను ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ‘నా ఎదుటకొచ్చి మాట్లాడే స్త్రీ తలపై దుప్పట్టా కప్పుకొని రావాలని, అది అల్లా ఆదేశమని’ అంటూ అతను తన శాలువాను ఆమె తలపై కప్పబోయాడు. వెంటనే ఆమె తీవ్రంగా స్పందించింది.

‘తన దగ్గర దుప్పట్టాలు ఉన్నాయని, ఇంకా ఎంతకాలం మతాన్ని ఇలా దుప్పట్టాలకు పరిమితం చేస్తారని’ ప్రశ్నించింది. అతను తన వాదనను మరింత ముందుకు తీసుకెళ్లడంతో ‘అనుమతి లేకుండా తనను తాకడం నేరమని, మతం అదేనా మీకు నేర్పిందని?’ ధైర్యంగా ప్రశ్నించింది. ‘చెల్లిగా భావించి అలా చేశానని’ అతనంటే, ‘అదేమీ నాకు అక్కర్లేదు. నేనెలా ఉండాలనేది నా ఛాయిస్. నా అనుమతి లేకుండా నన్ను తాకడం నేరమని’ గట్టిగా మాట్లాడింది. పక్కనే ఉన్న మరో మహిళ కూడా తనకు మద్దతు ఇచ్చి, ‘ఆమెకు నచ్చినట్లు ఆమె ఉంటుంది. మీరెవరు ఆమెను డిసైడ్ చేయడానికి?’ అని అనడం చాలా గొప్ప పరిణామం. నెటిజన్లు ఆమె తీరుపై రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. 

పాకిస్తాన్ అంటే మతఛాందసం మాత్రమే అనుకునే కాలం చెల్లిపోయింది. అక్కడా విప్లవం పుడుతోంది. కొత్తగా రూపుదిద్దుకుంటోంది. గళం విప్పుతోంది. దాన్ని వినలేకపోతే, ఆ పరిణామాన్ని చూడకపోతే అది మన తప్పు.

పూర్తి వార్త & వీడియో లింక్ ( https://www.ndtv.com/feature/video-pak-man-tries-to-cover-youtubers-head-with-shawl-this-happens-next-5482434)