Nancharaiah merugumala senior journalist:
‘బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం’ తేవాలన్న డిమాండుకు పెరుగుతున్న మద్దతు..గోదావరి జిల్లాల్లో పూజారులు, పురోహితులపై పెరుగుతున్న దాడులు…
సామాజిక భద్రత కోసం ఉత్తరాదిన (రాజస్తాన్, హరియాణా, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్) బ్రాహ్మణులు వీధుల్లో గొడ్డళ్లు చేతబూని ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. ఏడాది కాలంగా హిందీ రాష్ట్రాల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఈ జులూస్‌లు నిర్వహిస్తున్నారు. (బ్రామ్మల కులదేవత పరశురాముడి ఆయుధం గండ్ర గొడ్డలి) మరో పక్క తెలుగు బ్రాహ్మణులకు అనువైన నేలగా పరిగణించే గోదావరి జిల్లాల్లో పూజారులు, పురోహితులపై కొందరు హిందూ ఆకతాయిలు అకృత్యాలకు పాల్పడుతున్నారని ఇటీవల తరచు వార్తలొస్తున్నాయి. తెలుగు బ్రాహ్మణులు పెద్దగా అభిమానించని పత్రిక ‘ఈనాడు’లో ఈరోజు వచ్చిన వార్త ప్రజాస్వామ్యవాదులకు తీవ్ర ఆందోళన కలిగించింది. కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఓ హిందూ వివాహం చేయడానికి వెళ్లిన బ్రాహ్మణ పురోహితుడు ఆచెల్ల సూర్యనారాయణ మూర్తి పెళ్లి జరిపిస్తుండగా ఆయన తలకు కొందరు హిందూ ఆకతాయిలు సంచి తగిలించి, ఇంకా రకరకాలుగా అవమానించారు. విషయం వైరల్ కావడంతో బ్రాహ్మణ సంఘాలు ఆలస్యంగానైనా నిరసన తెలిపాయి.
ఇంకా కాకినాడ జిల్లాలోని కాకినాడ, బిక్కవోలు, పిఠాపురం ప్రాంతాల్లో ఈమధ్య బ్రాహ్మణులపై దాడులు జరిగాయంటూ ఈ సంఘాలు ఉద్యమిస్తున్నాయి. అంతేకాదు, బ్రాహ్మణులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చే పార్టీలకు, అభ్యర్ధులకు మాత్రమే ఓటేయాలని ఈ కుల సంఘాలు గట్టిగా తీర్మానించాయి. సమాజంలో బలహీన వర్గాలకు కాపు కాసేవారే ‘కాపులు’ అని బెజవాడ వంగవీటి రంగా 1989లోనే ప్రకటించిన కారణంగా కాపుల పక్షపాతులుగా కోస్తా బ్రామ్మణలు ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో, ఇతర సందర్భాల్లో వ్యవహరిస్తున్నారు. బ్రాహ్మణాధిపత్యానకి వ్యతిరేకంగా పుట్టిన జస్టిస్ పార్టీకి నూరేళ్ల క్రితమే మద్దతు పలికిన వెలమలు, రెడ్లు, కమ్మల ఆధిపత్యం ఉన్న జిల్లాల్లో బ్రాహ్మణులపై ఇంకా వ్యతిరేకత కనిపించినా అర్ధం చేసుకోవచ్చు. కాని బ్రాహ్మణుల ఆశీర్వాదాలతో మొదలైన జనసేనకు కొంత పట్టు కున్న కాకినాడ ప్రాంతలో ఇలా బ్రాహ్మణులపై దాడులు జరగడం సనాతన హిందూ సమాజంలో తీవ్ర సంక్షోభానికి అద్దం పడుతోంది. ఇకనైనా రాజమండ్రి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ మాజీ ఎంపీ, జగమెరిగిన బ్రాహ్మణ మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇంకా ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి భర్త, తెలుగు నియోగి బ్రాహ్మణ నేపథ్యం ఉన్న బ్రో. మొరుసుపల్లి అనిల్ కుమార్, అలాగే, విశాఖపట్నం పౌరులకు సేవచేయడానికి సదా సిద్ధమని ప్రకటించిన మరో బ్రాహ్మణ మేధావి, బీజేపీ రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు గోదావరి తీర ప్రాంతాల్లో సాధారణ బ్రామ్మల రక్షణకు, సామాజిక భద్రతకు నడుంకడితే తెలుగు సభ్య సమాజం హర్షిస్తుంది. లేకుంటే ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం మాదిరిగా బ్రాహ్మణ అట్రాసిటీస్ చట్టం తేవాలని ఇప్పుడిప్పుడే అక్కడక్కడా వినిపిస్తున్న డిమాండ్ చివరికి విపత్కర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది.
1980ల చివర్లోనే నేను ఉదయం దినపత్రిక విజయవాడ ఎడిషన్ లో పనిచేస్తుండగా, ‘‘ సిక్కు ఖలిస్తానీల మాదిరిగా, ముస్లిం జిహాదీల తరహాలో బ్రాహ్మణ యువకులు ఆయుధాలు పడితే తప్ప తెలుగు విప్ర సమాజానికి న్యాయం జరగదు,’’ అంటూ నాతో వాదించిన నా పాత్రికేయ బ్రాహ్మణ మిత్రుల మాటలు పై సంఘటన గురించి ఈనాడులో చదివాక గుర్తుకొచ్చాయి. ఏదేమైనా బ్రాహ్మణాధిపత్య భావజాలం ఉన్న రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్ కనుసనల్లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో గత పదేళ్లుగా నడుస్తున్నా ఇలాంటి దుర్భాగ్యపూర్వక ఘటనలు జరుగుతున్నాయంటే ఏమనుకోవాలి? నరేంద్ర మోదీ వంటి ఓబీసీ కుటుంబ నేపథ్యం ఉన్న నాయకుడికి ప్రధాని పదవి అప్పగిస్తే బ్రాహ్మణులకు ఒరిగేది ఇంతకన్నా ఏముంటుందని వాపోతున్న నా బ్రాహ్మణ మిత్రుల మాటల్లో నిజముందేమోననే అనుమానం కూడా వస్తోంది.