త్రివేణీ సంగమం (కన్నీటి నివాళి)..

త్రివేణీ సంగమం (కన్నీటి నివాళి)..

నిబద్ధతకు… శ్రమ, నైపుణ్యం తోడు…

సీహెచ్‌ వీ ఎమ్‌ కృష్ణారావు గారు చాలా పెద్ద పేరున్నజర్నలిస్టు. సౌమ్యుడు, మాకు ఇష్టుడు కూడా! మృత్యువు క్యాన్సర్‌ రూపంలో వెంటబడి తరమకుంటే ఇంకొన్ని సంవత్సరాలు తన మేధ, విచక్షణ, తార్కిక జ్ఙానంతో మంచి మంచి రాజకీయ విశ్లేషణలు చేసుండేవారు. మనం విని ఉండేవారమే! మనకా భాగ్యం లేకుండా పోయింది. ఓవరాల్‌గా ఆయనొక సమగ్ర జర్నలిస్టు కావడం వల్లే ఆయనకింత ఆదరణ, ఆయన వ్యాఖ్యలకు, సంభాషణలకు, చర్చలకు, విశ్లేషణలకు ఇంతటి ప్రాధాన్యత లభించింది. సమాచారం, సమయస్ఫూర్తి, స్పష్టత, నిర్మొహమాటం, నిక్కచ్చితనం వల్ల సమకాలీన టీవీ చర్చల్లో ఆయన బాగా రాణించారు. ఆరంభంలో దీర్ఘకాలం పాటు ఈనాడులో పనిచేశారు. వయసు పైబడ్డాక కూడా…. విషయ సేకరణపై ఎంత ఆసక్తో  సత్యశోధనపై అంతే నిబద్దత. వృత్తిలో ఆయన కీలకంగా ఉన్నపుడు నేనా వృత్తిని ఎంచుకొని, ఆయన పనిచేస్తున్న ఈనాడు నుంచే ప్రారంభించా. అప్పటికి నేనాయనను ఎరుగను. అక్కడే పరిచయం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. పెద్ద ఈవెంటయినా, చిన్న ‌ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ అయినా…. అది పూర్తి చేసుకొని వచ్చిన వెంటనే, జాప్యం లేకుండా రాసి, కాపీ డెస్క్‌పైన వేసేయడం రిపోర్టర్‌గా ఓ గొప్ప లక్షణం. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటి వారిని పేరుపెట్టి పిలిచినా, ఆయనచే ‘కృష్ణా’ అనిపించుకునే చనువున్నా, ఆయన తండ్రి రాజారెడ్డితో కలిసి కూర్చొని చదరంగమాడినా, వారి వ్యక్తిగత సహాయకుడు సూర్యుడితో పరాచికాలాడినా…. దేనికదే! వృత్తిపరంగా ఆయనెప్పుడూ తామరాకుపై నీటి బొట్టే! ఆయన దాదాపు నాలుగున్నర దశాబ్దాలపైనే జర్నలిజంలో, అదీ ప్రధానంగా రిపోర్టింగ్‌… ఆ తర్వాత తెలుగు, ఇంగ్లీష్‌ సంపాదకత్వంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఈనాడు, ఆంధ్రప్రభ-ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌, ఆంధ్రభూమి-డక్కన్‌ క్రానికల్‌ సంస్థలు, న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లలో పనిచేసి విశేషానుభవం గడించారు. సుదీర్ఘకాలం పాటు తెలుగు నేల రాజకీయాలను అత్యంత సమీపంగా, ఆసక్తిగా గమనిస్తూ వ్యాఖ్యానం చేసిన అనుభవం తాలూకు ఆయన సమ్యక్‌ దృష్టి తన వ్యక్తీకరణల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మూఢంగా ఒక వైపు మొగ్గి మొండివాదనలు చేసేవారు కాదు. అదే సమయంలో, ఎవరో నొచ్చుకుంటారేమో అనే తలంపుతో మాటల్ని మింగడం, భావాల్ని అదిమిపెట్టుకోవడం కూడా ఉండేది కాదు. ఏది అనదలచుకుంటే అది, నిర్మొహమాటంగా, అక్కడికక్కడ, అప్పటికప్పుడు అనేయటమే! ఎవరితో ఎంత సన్నిహితంగా ఉన్నా….. రాజకీయ పక్షాలు, వ్యక్తుల విషయంలో రాజీ ఉండేది కాదు. అభిప్రాయాల వెల్లడిలో తటస్థంగా, పక్షపాత రహితంగా ఉండేవారు. రాజకీయ, పాలనా వ్యవస్థలతో వృత్తిపరమైన సాన్నిహిత్యం వల్ల లభించే అవకాశాల్ని జర్నలిస్టులు స్వప్రయోజనాలకు వాడుకుంటున్న కాలంలో… అందుకు తలొగ్గక నికార్సుగా ఉన్న స్వాతిశయమో, మోరల్‌ ఆరగెన్సో…. కొంత ఆయనలో కనిపించేది. యెడనెడ… ఎవర్నీ లెక్కజేయనితనం కూడా ఉండేది. జూనియర్లతో మాట్లాడేప్పుడు, పెలుసుతనం కాదు గానీ, మాటల్లో గోదావరి వెటకారం ధ్వనించేది. కొందరు అర్థం చేసుకునేవారు, ఇంకొందరు నొచ్చుకునేవారు. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వంటి వారైతే ముఖమ్మీదే కడిగేసిన సందర్భాలున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చి ఇంట్లో విలేకరుల సమావేశం పెట్టారు. వనసంరక్షణ సమితుల ఏర్పాటు, గిరిజనులకు స్థానం, అటవీ ఉత్పత్తుల సంపదలో వారికి భాగస్వామ్యం… ఇలా కేంద్ర ప్రభుత్వ కొత్త నిర్ణయాలకు సంబంధించి సీఎం ఏదేదో చెబుతున్నారు. ‘అది సరే గాని బాబాయ్‌…. రాజీవ్‌ నీకు దొబ్బులు పెట్టాడటగా, ఆ వివరాలు చెప్పండి’ అని కృష్ణారావ్‌ అడిగితే, “ఏం…. కృష్ణారావ్‌, రాత్రి తాగింది దిగలే?” అనే దాకా వెళ్లింది వ్యవహారం. ఈనాడు ప్రస్తుత (ఏపీ) ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు, కృష్ణారావు కొంత కాలం ఈనాడులో కలిసే పనిచేశారు. తర్వాత కృష్ణారావు పలు పత్రికలు మారారు. బూదరాజు రాధాకృష్ణ గారి తర్వాత ‘ఈనాడు జర్నలిజం స్కూల్‌’ (ఈజేఎస్‌) ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన నుంచి సుదీర్ఘకాలం పాటు ఎమ్మెన్నార్‌ (ఇప్పటికీ అనుకుంటా) ఆ హోదాలో ఉన్నారు. పెద్ద పేరు కూడా ఉంది. రామోజీరావు గారికి విశ్వాసపాత్రులు కనుక, ఏకకాలంలో  ఆయన ఇతర బాధ్యతలూ నిర్వహిస్తుంటారు. మాసబ్‌ట్యాంక్‌ దగ్గర్లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఒక పెళ్లి వేడుకలో కలిసినపుడు పిచ్చాపాటి మాటల్లో…. కృష్ణారావు అన్నారు “ఏం నాగేశ్వరర్రావ్…. డీనో, రిజిస్ట్రారో, వీసీనో అయ్యావా? ఇన్నేళ్లయినా ఇంకా ప్రిన్సిపాల్‌గానే ఉన్నావా?” అని! ఆ వెటకారం అర్థం కాదా? ఇక, ఆయన దోరణే అంత అనుకున్నారేమో, ఎమ్మెన్నార్‌ నవ్వి ఊరకున్నారు. నాకు ఎదురైన ఇంకో సందర్భం చెబుతా! అక్కడున్న వయో పరిమితి విధానం వల్ల నేను సాక్షి నుంచి రిటైరైన నెల లోపలే ఓ రోజు కృష్ణారావు గారు ఫోన్‌ చేశారు. “ఏరా దిలీపా…. అదేదో సాక్షీ టీవీ ప్రోగ్రామ్‌లో నీ డిజిగ్నేషన్‌ ఇవ్వకుండా, సీనియర్‌ జర్నలిస్టు అని పెడుతున్నారు, నువ్విప్పుడు అక్కడ లేవా?” అనడిగారు. 58 చేరడం, రిటైర్మెంట్‌, అంతకు ముందునుంచీ కొనసాగుతున్న ఓ ప్రోగ్రామ్‌ కంటిన్యుటీ… ‘ ఇలా నేనేదో చెబుతున్నాను. ‘అదంతా కాదు, నువ్విపుడు సాక్షితో లేవు, అంతేగా!’ అంటూ నేను ‘అవును’ అనీ అనకముందే ఆయన ఫోన్‌ పెట్టేశారు. మొహమాటాలు, లౌక్యాలు, ఇచ్చకాలు…. పట్టని ఆయన తత్వం, ‘అప్పుడే రిటైరైపోతే ఎలా! మరేం చేస్తున్నావిపుడు?’ వంటి కనీసపు మర్యాద మాటలు కూడా లేవు! అదీ ఆయన తీరు!!  2013 మార్చిలో ఏబీసీ (Almond Board of California) వారి ఆహ్వానంపై అమెరికాలో పర్యటించిన అరడజన్ మంది భారత జర్నలిస్టుల్లో… కృష్ణారావు గారితో పాటు నేనొకన్ని.

నిజాయితీ, నిబద్ధతకు శ్రమ, నైపుణ్యం తోడైన తీరే కృష్ణారావు గారంటే, ఇదేం అతిశయోక్తి కాదు. ఎడిటర్‌గా కన్నా రిపోర్టర్‌గానే మొనగాడాయన. మా తరంలో దమ్మున్న పొలికల్‌ రిపోర్టర్‌. దటీజ్‌ కృష్ణారావు.

==============

ఆర్.దిలీప్ రెడ్డి( సీనియర్ జర్నలిస్ట్)