విశీ: సాహిత్య సభల్లో టైమర్ పెట్టాలని, వాళ్లకి కేటాయించిన టైం రాగానే ఒక నిమిషం ముందు గంట మోగేలా ఏదైనా ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాను.(నేను చూసినంత వరకు ఖదీర్ గారు నిర్వహించే సమావేశాలు టైం ప్రకారం జరుగుతాయి. టైం కాగానే ఆయన లేచి వాచీ చూస్తారు. ప్రసంగం ముగించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది). TED Talksలో 18 నిమిషాలలోపు ప్రసంగం ముగించాలి. ఎంత ఘనులైనా అదే నిబంధన! మన దగ్గర మాత్రం కొందరు గంటలకు గంటలకు తీసుకుంటారు. వచ్చినవారు రచయితను పొగడ్డంతోపాటు తమనుతాము బాగా పొగుడుకొని మురిసిపోవడం కూడా చేస్తూ ఉంటారు. మళ్లీ మళ్లీ మైక్ దొరకదన్న గట్టి నమ్మకంతో తమ జీవిత చరిత్ర, తమకు వచ్చిన అవార్డులు.. అన్నీ కంఠోపాఠంగా చెప్తారు.
… పైగా ఒక్కో కార్యక్రమానికి ఆరుగురు ముఖ్య అతిథులు, పన్నెండు మంది విశిష్ట అతిథులు, పదహారు మంది ఆత్మీయ అతిథులు.. ఇంకా కుదిరితే పద్నాలుగు మంది విలక్షణ అతిథులు ఉంటారు(అందులో అగ్రభాగం మగవాళ్లదే!) సొంత బంధువులైనా అంతమంది ఉంటారో, లేదో తెలియదు కానీ, సాహిత్య కార్యక్రమాలకు ఎక్కడలేని అతిథులు పుట్టుకొస్తారు. ఆఫీసులో వారి బాసులు, వారు పని చేసే శాఖలో ఉన్నతోద్యోగులు కూడా ఈ జాబితాలో కనిపిస్తారు. అందర్నీ గౌరవించాలన్న కోరిక ఉండొచ్చు కానీ, వచ్చినవారి కాలం కూడా ముఖ్యమే కదా! ఒక మనిషికి 15 నిమిషాలు లెక్కేసినా నాలుగైదు గంటలు. అంతంతసేపు జనాలు ఏంగానూ? రచయిత మీద ఎంత ఇష్టం ఉన్నా అంత ఓపిగ్గా ఎలా వింటారు? మళ్లీ మధ్యలో ఎవరో వచ్చి మేం మాట్లాడాలని వేదిక ఎక్కుతారు. వాళ్లూ కాసేపు పొగడ్తల రామాయణం చెప్తూ ఉంటారు. మరో 10 నిమిషాలు పాయె! ఐదుగురికి మించి అతిథులు రాకూడదని ఎవరైనా రూల్ పాస్ చేస్తే బాగుండు!!
… కొద్దికాలం నుంచి పుస్తకాలు తీసుకొస్తున్న నా మిత్రుల్లో కొందరు ఆవిష్కరణ సభలు చేయడం లేదు. హమ్మా! ఎంత రిలీఫో! హాయిగా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టడం, పుస్తకం మార్కెట్‌లోకి తేవడం.. చక్కగా ఉంది కదా!