Ambedkar: అంబేడ్కర్‌ కనిపించే హాలీవుడ్‌ సినిమా ‘ఆరిజిన్‌’ అమెరికాలో విడుదలవుతోంది..

Nancharaiah merugumala senior journalist:

” అంబేడ్కర్‌ కనిపించే హాలీవుడ్‌ సినిమా ‘ఆరిజిన్‌’ ఈరోజే అమెరికాలో విడుదలవుతోంది! అన్ని వివక్షలకూ కులమే మూలమని చెప్పిన అమెరికా రచయిత్రి ఈసబెల్‌ విల్కిర్సన్‌ గ్రంథం ‘కాస్ట్‌: ద ఆరిజిన్స్‌ ఆఫ్‌ అవర్‌ డిస్కంటెంట్స్‌’ ఈ చిత్రానికి ఆధారం “

ఇండియాలో కుల వివక్ష, అమెరికాలో జాతిపరమైన వర్ణ వివక్ష, జర్మనీలో యూదుల అణచివేతకు సంబంధం ఉందని నిరూపించే అమెరికన్‌ జర్నలిస్టు, రచయిత ఈసబెల్‌ విల్కిర్సన్‌ రాసిన ‘కాస్ట్‌: ద ఆరిజిన్స్‌ ఆఫ్‌  అవర్‌ డిస్కంటెంట్స్‌’ పుస్తకం ఆధారంగా నిర్మించిన హాలీవుడ్‌ చలనచిత్రం ‘ఆరిజిన్‌’ సోమవారం అమెరికాలో విడుదలవుతోంది. ఈసబెల్‌ జీవనయానం ఎలా సాగిందో చూపించే ఈ సినిమాకు ఆవా డూ వర్నే దర్శకత్వం వహించారు. ఇదివరకు దర్శకురాలు ఆవా డూ వర్నే రూపుదిద్దిన సెల్మా (2014)లో ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయింది. వాస్తవానికి ప్రపంచంలో అన్ని రకాల వివక్షలకూ స్కెలిటన్‌ మాదిరిగా ఊతం ఇచ్చేది జాతి (రేస్‌) కాదని, కులమే సకల వివక్షలకూ దండలో దారంలా కీలకపాత్ర పోషిస్తోందనేది ఈ ‘ఆరిజిన్‌’ సినిమా చూపించే అభిప్రాయం. ఈ చిత్రంలో భీమా అనే అస్పృశ్యుడైన బాలుడు ఒక పాఠశాల బయటి కూర్చుని ఉండగా కనిపిస్తాడు. అలాగే అమెరికా మెగా సిటీ న్యూయార్క్‌ నగరంలోని ప్రపంచ ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ విద్యార్థిగా అంబేడ్కర్‌ పుస్తకాలు చదువుతూ ఈ సినిమాలో దర్శనమిస్తారు. రెండున్నర గంటల పాటు సాగే ఈ సినిమాలో వివక్ష ఎలాంటిదో చెప్పడానికి జర్మనీ, ఇండియా, అమెరికా చరిత్రను చూపించే ప్రయత్నం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కనిపించే వివక్షకు ఉమ్మడి ఆధారం ఏమిటో కనుక్కునే ప్రయత్నమే ‘ఆరిజిన్‌’. అమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఈస్టర్‌ మెనోనైట్‌ యూనివర్సిటీ సోషియాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గౌరవ్‌ పఠానియా ఈ చిత్రంలో బాబాసాహబ్‌ పాత్రలో కనిపిస్తారు. ‘కాస్ట్‌: ద ఆరిజిన్స్‌ ఆఫ్‌  అవర్‌ డిస్కంటెట్స్‌’ రచయిత్రి ఈసబెల్‌ విల్కిర్సన్‌ పాత్రలో అవున్యానూ ఎలిస్‌–టేలర్‌ నటించారు. ఈ చిత్రంలోని ఒక సందర్భంలో–భీంరావ్‌ రాసిన ‘ద యానిహిలేషన్‌ ఆఫ్‌ కాస్ట్‌’ పుస్తకం తెరచి ఈసబెల్‌ విల్కిర్కన్‌ చదువుతూ కనిపిస్తారు. 2012లో అమెరికాలో తెల్లజాతివారు నివసించే వాడలో ట్రెవాన్‌ మార్టిన్‌ అనే నల్లజాతి కుర్రాడు హత్యకు గురయ్యాక ఈ వివక్ష మూలాలు కనుక్కునే పనిలో పడ్డారు ఈసబెల్‌ విల్కిర్సన్‌. ఈ క్రమంలో తలెత్తిన ప్రశ్నలకు జవాబుల కోసం ఆమె అంబేడ్కర్‌ 1930ల్లో రాసిన కుల నిర్మూలన అనే పుస్తకం చదువుతారు. జాత్యహంకారానికి ఆధారం ఏమిటో అన్వేషించే ప్రయత్నంలో ఈసబెల్‌ జర్మనీ, ఇండియా వెళ్లగా, అన్ని వివక్షలకూ తల్లి కులమే అనే అవగాహన ఆమెకు కలిగింది. 

(ద వైర్‌ అనే న్యూజ్‌ వెబ్సైట్‌ లో ఈరోజు వచ్చిన వార్తావ్యాసం ఆధారంగా)ఫోటోలు..1) ఆరిజిన్ సినిమాలో అంబేడ్కర్..2) ఈసబెల్ విల్కిర్సన్)