TDP: కోటరీ వలయంలో యువనేత..!

TDP : రాజకీయాల్లో దూకుడుతోపాటు అనుభవానికి కూడా పెద్దపీట వేస్తేనే రాణించగలుగుతారు. సీనియర్లు పాత చింతకాయ పచ్చడి లాంటి వారని పక్కనపెడుతూ పూర్తిగా యువతకే ప్రాధాన్యతిస్తే కొత్త చింతకాయ పచ్చడితో ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. ఈ పచ్చడి ఉదాహరణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరిపోతుంది. తనది నలభై ఏండ్ల రాజకీయ అనుభవమని నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారు, అయితే టీడీపీలో మాత్రం ప్రస్తుతం అనుభవం కన్నా యువనేత నారా లోకేశ్‌ పెత్తనమే సాగుతోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

తెలుగుదేశం ఆవిర్భావం నుండి పార్టీలోనే ఉంటూ కష్టకాలంలోనూ చేదోడుగా ఉన్న సీనియర్లను కొత్త రక్తం పేరుతో యువనేత లోకేశ్‌ పక్కన పెడుతున్నారు. పార్టీ అభ్యర్థుల బయోడేటా కంటే వారి ఆర్థిక బ్యాలెన్స్‌ షీట్లకే లోకేశ్‌ అధిక ప్రాధాన్యతిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డవారిని విస్మరిస్తూ డబ్బు సంచులతో వచ్చే ప్యారాచూట్లనే బరిలోకి దింపుతున్నారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు టికెట్ల కేటాయింపులో విద్యావంతులకు, సామాజికవేత్తలకు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతిస్తే అదే పార్టీలో ఇప్పుడు దానికి భిన్నంగా ప్రస్తుతం ఆయన మనుమడు నారా లోకేశ్‌ మాత్రం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ సీనియర్లే చెబుతున్నారు. పార్టీకి నాయకులు చేసిన సేవ, ప్రజసేవ కంటే ఎన్నికల్లో వారెంత ఖర్చు పెట్టగలరు..? పార్టీకి వారు ఎన్ని నిధులు ఇవ్వగలరు..? అనే ఆర్థికాంశాలకే లోకేశ్‌ కోటరీ పెద్దపీట వేస్తోంది.

తెలుగుదేశం వ్యవహారాలన్నీ ఇప్పుడు లోకేశ్‌ చుట్టే తిరుగుతున్న దశలో యువనేత అరంగేట్రమే ఆసక్తికరం.   2014 ఎన్నికల ముందు తెరవెనుక ఉన్న నారా లోకేశ్‌ టీడీపీ అధికార పగ్గాలు చేపట్టాక తెర ముందుకు వచ్చారు. లోకేశ్‌ సొంత సామాజిక వర్గం వారితో కూడిన భజనపరులను తన చుట్టూ చేర్చుకొని ఒక కోటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టాక ప్రభుత్వంలో, పార్టీలో కోటరీ జోక్యం పెరిగిపోయింది. ఆ కోటరీ వ్యవహారంతో పార్టీ అభివృద్ధి కంటే పతనావస్థకి దిగజారుతోంది.  క్షేత్రస్థాయిలో పరిస్థితులను విస్మరించి లోకేశ్‌ అండ్‌ కో ‘ఏకోఛాంబర్‌’ కే పరిమితమై నిర్ణయాలను తీసుకుంటోంది.

రాజకీయాల్లో ఓనామాలు కూడా తెలియని వారు ల్యాప్‌టాప్‌లు పెట్టుకొని వ్యూహకర్తలు అనే పేరుతో సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నేతలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులు కూడా తెలియని వారు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఏ మండలం ఏ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందో, ఏ నియోజకవర్గం ఏ జిల్లాలోకి వస్తుందో కూడా తెలియని వ్యూహకర్తల కబంధహస్తాల్లో పార్టీ చిక్కుకుంది. కనీసం విద్యార్థి సంఘం నాయకులుగా కూడా పనిచేయని వారు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌ పదవుల మధ్య తేడాలు కూడా తెలియని వారు, పూర్తిగా రాజకీయ అనుభవరాహిత్యం వారితో ఉన్న ఈ కోటరీ సలహాలు తీసుకోవాల్సిన దుస్థితి పార్టీ సీనియర్లకు ఏర్పడింది. 

నారా లోకేశ్‌పై ఈ ‘ల్యాప్‌టాప్‌ బాయ్స్‌’ కోటరీ ప్రభావం ఎంతుందో చెప్పడానికి యువనేత చేసిన యువగళం పాదయాత్రే నిదర్శనం. లోకేశ్‌ పాదయాత్రతో ప్రజల మనస్సులను గెల్చుకోవడం కంటే దీన్ని ఒక ఈవెంట్‌  మేనేజ్‌మెంట్‌లా నిర్వహించడానికే ఈ కోటరీ అధిక ప్రాధాన్యతిచ్చింది. పాదయాత్రలో ప్రజలను నేరుగా కలుసుకొని వారి కష్టాలను తెలుసుకునే అవకాశాలుంటే, అందుకు భిన్నంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యువగళాన్ని ఒక సినిమా కార్యక్రమంలా  నిర్వహించారు. సెల్ఫీలు, డ్రోన్‌లకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఇవ్వలేదు. ఈ కోటరీ ఆర్భాటంతో యువగళం ఆయా నియోజకవర్గాల్లో ప్రవేశిస్తున్న సమయంలో నిజమైన పార్టీ కార్యకర్తలకు, నేతలకు గుర్తింపు లభించలేదు. పాదయాత్ర సందర్భంగా భారీగా ఖర్చు పెట్టిన వారికే లోకేశ్‌  కోటరీ  ప్రాధాన్యత ఇవ్వడంతో తెలుగుదేశం టికెట్ల కోసం వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు క్యూ కట్టారు.

తెలుగునాట గతంలో నిర్వహించిన రాజకీయ నేతల పాదయాత్రలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. వైఎస్‌.రాజశేఖర రెడ్డి ‘ప్రజా ప్రస్థానం’, నారా చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీ కోసం’, వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ‘ప్రజా సంకల్ప’ పాదయాత్రలతో వారు అధికారం చేపట్టడమే కాకుండా, దీన్ని  వారు రాజకీయ భవిష్యత్తుకు మార్గదర్శకంగా  మల్చుకున్నారు. విజయవంతమైన ఈ పాదయాత్రలను స్ఫూర్తిగా తీసుకున్న లోకేశ్‌ తన రాజకీయ భవిష్యత్తు కోసం 400 రోజులు నడిచి 4 వేల కి.మీలు పూర్తిచేయాలని ‘యువగళం’ పాదయాత్రను 2023 జనవరి 27న కుప్పంలో ప్రాంభించారు. అయితే ఆయన పెట్టుకున్న లక్ష్యానికి భిన్నంగా 227 రోజులలో 3132 కి.మీలు నడిచి ఇచ్చాపురంలో ముగించాల్సిన పాదయాత్రను భోగాపురంలో భారీ సభ నిర్వహించి మమ అనిపించారు. పార్టీకి మొదటి నుండి పట్టున్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అడుగుపెట్టకుండానే యువగళం పూర్తి కావడంతో అక్కడి పార్టీ కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహపడ్డారు.

యువగళం పాదయాత్రతో వచ్చిన రాజకీయ ఎదుగుదల సువర్ణావకాశాన్ని యువనేత లోకేశ్‌ చేజార్చుకున్నారు.  పాదయాత్రతో లోకేశ్‌ రాజకీయ పరిపక్వత సాధిస్తున్నారని తొలుత వచ్చిన అంచనాలు చంద్రబాబు అరెస్టుతో పటాపంచలయ్యాయి. తండ్రి అరెస్టుతో స్థైర్యాన్ని కోల్పోయిన లోకేశ్‌ చంద్రబాబు జైలుపాలు కావడాన్ని పార్టీ తరఫున ఎండగట్టాలనే విషయాన్ని విస్మరించి దాన్ని పార్టీ సమస్యగా కాకుండా, ఒక కుటుంబ సమస్యగానే భావించారు. రాష్ట్రంలో ఉండి చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు మార్గదర్శకంగా ఉంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన లోకేశ్‌ తండ్రి విడుదల కోసం న్యాయ సలహా పేరుతో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలకు మంగళం పాడి ఢిల్లీ లోనే రోజుల తరబడి కూర్చున్నారు. లోకేశ్‌ ఢిల్లీ లో ఉన్నంత కాలం చంద్రబాబుకు బెయిల్‌ రాలేదు, తనను కూడా అరెస్టు చేస్తారనే భయంతో ఆయన రాష్ట్రంలో లేరనే వ్యాఖ్యలు పార్టీలోనే వినిపించాయి. 

చంద్రబాబు అరెస్టుకు ముందు లోకేశ్‌ నిర్వహించిన మొదటి విడత పాదయాత్రకు, అరెస్టు అనంతరం నిర్వహించిన రెండో విడత పాదయాత్ర మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. మొదటి విడతలో పార్టీ బలం పెరగడానికి పాదయాత్ర చేస్తున్నట్టు కనిపించగా, రెండో విడతలో మొక్కుబడిగా చేపట్టి హడావుడిగా ముగించారు. మొదటి విడతలో ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం దృష్టి పెట్టిన ఆయన రెండో విడత అనంతరం అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక బ్యాలన్స్‌ షీట్లకే ప్రాధాన్యతిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల కంటే వ్యాపారవేత్తలను, ఎన్‌ఆర్‌ఐలను కలుసుకోవాడానికే లోకేశ్‌ ప్రాముఖ్యతిస్తున్నారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బాగోగులను పట్టించుకోవాల్సిన ఆయన మంగళగిరికే పరిమితమయ్యారు.

రాజకీయాల్లో ప్రవేశించక ముందు సొంత వ్యాపారాలను నిర్వహించిన లోకేశ్‌కు బిజినెస్‌ వాసన పోలేదు.  యువకుడైన లోకేశ్‌ కార్పొరేట్‌ స్టైల్‌లో వారంలో ఐదు రోజులే పనిచేస్తుండగా, చంద్రబాబు 72 ఏళ్ల వయస్సులో కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. లోకేశ్‌ రాజకీయాలను, ఎన్నికలను ఒక మనీ మైండెడ్‌గానే చూస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక లోకేశ్‌  కోటరీకి  ప్రాధాన్యత అధికమైంది. కోటరీ సలహాలు, సూచనలతో క్షేత్రస్థాయిలోని వాస్తవాలను విస్మరించిన తెలుగుదేశం 2019లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 

వాస్తవాలకు భిన్నంగా సోషల్‌ మీడియా, ట్వీట్‌లకే పరిమితమవుతూ, అనుకూల మీడియాలోని వార్తలను చూస్తూ అంతా అనుకూలంగానే ఉందని భ్రమల్లో తేలుతున్న లోకేశ్‌ కోటరీకి చంద్రబాబు అరెస్టుతో దిమ్మతిరిగింది. ఆ ఘటనతో ఏమి చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశానికి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పొత్తు ప్రకటన భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. 2014లో పవన్‌ మద్దతుతో అధికారానికి వచ్చిన తర్వాత ప్రధానంగా లోకేశ్‌ బృందం వ్యవహారశైలితో జనసేనను దూరం చేసుకున్న టీడీపీ 2019లో తగిన మ్యూలం చెల్లించుకుంది. 

నేలవిడిచి సాము చేయడం అలవాటైన లోకేశ్‌  ప్రజల ఆకాంక్షలను, నాడిని తెలుసుకోకుండా కోటరీ మాటలనే నమ్ముకుంటే మరోసారి 2019 ఫలితాలు పునరావృత్తం కావడం ఖాయం. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజల మధ్య ఉండే పార్టీ నేతలు, కార్యకర్తల నుండి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుంటే పార్టీకి ఈ కోటరీ వ్యూహకర్తల అవసరమే ఉండదు. దొంగ సర్వేలు చేస్తూ కోటరీ సూచనలను అనుసరిస్తే పార్టీకి ఎన్నికల్లో మరోసారి భంగపాటు తప్పదు. జగన్‌ జనంతో కలవరని విమర్శించే లోకేశ్‌ తాను కూడా ‘ఏకోఛాంబర్‌’ నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాను అనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేకతతో ఆంధ్రప్రదేశ్‌లో అందలం ఖాయమనే అతి విశ్వాసంతో లోకేశ్‌ కోటరీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్ల ఆధారంగా టికెట్ల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ మితిమీరిన విశ్వాసం మొదటికే మోసం కావచ్చనే ప్రాథమిక సూత్రాని లోకేశ్‌ అండ్‌ కో విస్మరిస్తోంది. 

బాబు భవిష్యత్తు గ్యారెంటీ అని ప్రచారం చేసుకుంటున్న టీడీపీకి అధికారం గ్యారెంటీ కావాలంటే పార్టీ వ్యవహారాలకు లోకేశ్‌ కోటరీని దూరంగా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. 2024లో సానుకూల ఫలితాలు రాకుంటే లోకేశ్‌తో పాటు ఆయన కోటరీ తిరిగి తమ సొంత వ్యాపారాలు చేసుకుంటారు. మొదటి నుండి పార్టీనే నమ్ముకున్న పార్టీ నేతలు, కార్యకర్తల పరిస్థితి ఏమిటి..? 2019 అనుభవాల నుండి గుణపాఠాలు నేర్చుకోకుండా ఈ ల్యాప్‌టాప్‌ కోటరీని, అనుకూల మీడియా వార్తలనే నమ్ముకుంటే తెలుగుదేశం మరోసారి పుట్టమునగడం ఖాయం. 

==================

జి.మురళికృష్ణ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,