అభినవ సత్యభామ ఇక లేరు…

మాజీ ఎంపి, బిజెపి నాయకురాలు..తెలుగు చలనచిత్ర రంగంలో అభినవ సత్యభామగా పేరొందిన సీనియర్ నటి జమున ఇక లేరు. వయసు రీత్యా హైదరాబాద్ లోని ఆమె స్వగృహంలో  శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఆమె మృతి పట్ల.. అభిమానులు  ప్రముఖులు..నటులు..రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

స్వస్థలం..
అందం.. అభినయం..నటనతో జనహృదయాలను గెలుచుకున్న జమున స్వస్థలం కర్ణాటక. ఆమె 1936 ఆగష్టు 30న హంపీలో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. సినిమాల్లోకి రాకముందు..గుంటూరు జిల్లా దుగ్గిరాలకు సమీపంలోని మోరంపూడి ఆమె నివాసం. చిన్నతనం నుంచే జమున నాటకాలలో నటించేవారు. తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు.జగ్గయ్య గారిది కూడా అదే గ్రామం కావడంతో.. ‘ఖిల్జీ రాజ్య పతనం’అనే నాటిక ప్రదర్శన కోసం.. ప్రత్యేకంగా జమునను తీసుకువెళ్ళాడని ఇప్పటికీ గ్రామస్థులు చెబుతుంటారు. ఇదే నాటికలో…..
మరో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వర
రావు నటించడం విశేషంగా చెప్పవచ్చు.

కాగా నాటక రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన జమున..తొలిసారిగా బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు చిత్రంలో నటించారు. తెలుగుతో పాటు
తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించారు.1967లో ఆమె హిందీలో చేసిన ….
మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు పొందారు.తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి దాదాపు 200 సినిమాలు చేశారు. తెలుగులో పండంటి కాపురంలోని రాణీ హేమమాలిని పాత్ర బాగా పేరుతెచ్చిపెట్టింది. సీనియర్ హీరోలు ఎన్టీఆర్,ఏ ఎన్నార్ ,శోభన్ బాబు,హరనాథ్,కృష్ణ, తదితర అగ్ర నటులతో కలిసి నటించారు.‌

సామాజిక సేవ..

తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ నెలకొల్పి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా సీనియర్ సినీనటులకు పెన్షన్ ఇప్పించిన ఘనత జమునగారిదే.ఇప్పటికీ వయసు పై బడిన సేవా కార్యక్రమలు చేస్తున్నారంటే .. ఆమె వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పవసరంలేదు.

మాజీ ప్రధాని ఇందిర  ప్రేరణతో రాజకీయాల్లోకి..

జమునకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంటే ఎనలేని అభిమానం. ఆమె ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చారు.
1980లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నుంచి 1989లో లోక్ సభకు ఎంపీగా
ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా..1990వ దశకంలో బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేశారు.కాంగ్రెస్ ఐ తరపున మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో కూడా…పోటీచేశారు.