తమిళ గమళ్ల గవర్నర్‌ తో గొడవ తెలంగాణ వెలమ సమాజానికి అరిష్టమేమో!

Nancharaiah merugumala: (senior journalist)
…………………………………………………….
తమిళ గమళ్ల (నాడార్‌ లేదా ఈడిగ లేదా గౌడ) కుటుంబంలో జన్మించిన తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు పదే పదే ఘర్షణకు దిగుతున్నారు. కాంగ్రెస్‌ కుటుంబం నుంచి వచ్చిన బీజేపీ గవర్నర్‌ తమిళిసై. మొదటి నుంచీ కాషాయంతో సంబంధంలేకున్నా తర్వాత ఆ పార్టీలో చేరిన మంచి డాక్టర్‌ (గైనకాలజిస్ట్‌ ఆమె). ఆమె రాజ్యపాల్‌ గా హైదరాబాద్‌ వచ్చి మూడేళ్లు దాటుతున్నా– మహిళల విషయంలో చాలా పెద్ద మనసున్న పద్మనాయకుడిగా పేరుమోసిన కేసీఆర్‌ గారు ఆమెపై ఇంకా ప్రకటనల దాడులు చేయిస్తున్నారు. తన మంత్రులు, జెంటిల్మన్‌ తెలుగు రెడ్డి స్పీకర్‌ గా పేరు సంపాదించిన సీనియర్‌ నేత పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సహా చోటామోటా లీడర్లతో ఆమెను తెగ తిట్టిస్తున్నారు.

ఇక తనతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించిన తమిళ అయ్యంగార్‌ శ్రీవైష్ణవ మాజీ పెద్ద పోలీసు ఈఎస్‌ఎల్‌ నర సింహన్‌ తో కేసీఆర్‌ నిండు మర్యాదతో వ్యవహరించేవారు. తాను అభినయ పద్మనాయక ప్రభువుననే విషయం ఆయన అప్పుడు మరిచిపోయేవారు. 1980ల ద్వితీయార్ధంలో కాంగ్రెస్‌ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పంపిన దివంగత గుజరాతీ బ్రాహ్మణ మహిళ కుముద్‌ బెన్‌ జోషీ గారు ఎంత ‘రాజ్యాంగబద్ధంగా’ టీడీపీ సర్కారును సతాయించినా– తెలుగుదేశం ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఆమెను దూషించేవారు కాదు. కాంగ్రెస్‌ బ్రాహ్మణ గవర్నర్‌ తో గరిష్ఠ స్థాయిలో కమ్మ పౌర మర్యాదలు పాటించేవారు ఎన్టీఆర్‌. మంచి తెలుగు బ్రాహ్మణ బుద్ధిజీవులను సదా గౌరవించే రామారావు గారు కుముద్‌ బెన్‌ ఎదురైనప్పుడు ఆప్యాయంగా చేతిలో చేయివేసి పలకరించేవారు. ఎన్టీఆర్‌ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ గారికి ఈ విషయాలు సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు గారు వంటి సద్బ్రాహ్మణలు గర్తుచేస్తే తెలంగాణ సభ్యసమాజం సంతోషిస్తుంది.

ఇదిలా ఉంటే..ముదురు కాషాయ హిదుత్వ, బీజేపీ ఓబీసీ ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్ని రాజకీయ పేచీలున్నా తమిళ ఓబీసీ గవర్నర్‌ తమిళిసైతో నిరంతరం గిల్లి కజ్జాలు పెట్టుకోవడం తెలంగాణ పద్మనాయక వెలమ సమాజానికి, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబానికి అరిష్టమని, అశుభకరమని ఎవరైనా కేసీఆర్‌ గారికి చెబితో బాగుంటుంది. ఈ పనిని కల్వకుంట్ల వారు బహిరంగంగా గౌరవించే తెలుగు పండితుడు వి.మృత్యుంజయ శర్మ వంటి సకల తెలంగాణ, తెలుగు సమాజం హితం కోరే మంచి బ్రాహ్మణ మేధావులు చేస్తే సత్ఫలితాలు వస్తాయి. అప్పుడు నాడారు (తమిళ కల్లుగీత వృత్తివారి పేరు) డాక్టరు తమిళిసై ప్రశాంతంగా చెన్నయి వెళ్లిపోతారు. నియంతృత్వ పోకడలతో భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాపరంగా కుళ్లబొడిచిన నాటి ప్రియతమ ప్రధాని ఇందిరాగాంధీనే ఎదురొడ్డి నిలిచిన గొప్ప తమిళ నేత, మాజీ ముఖ్యమంత్రి కె.కామరాజ్‌ నాడార్‌ పుట్టిన సామాజికవర్గంలో జన్మించినందుకైనా తమిళసైకి కేసీఆర్‌ గారు తగిన గౌరవ మర్యాదలు ఇస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది కోట్లకు పైగా తెలుగోళ్లు ఆనందిస్తారు. ఈ విషయాలు కొన్ని కిందటేడాది చెప్పినవే కాని మరోసారి చెప్పాల్సిన సందర్భం వచ్చిందని మళ్లీ రాశాను.