దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట అల్లర్లకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్ సిద్దూను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా ఎర్రకోట వద్ద రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా అల్లర్లకు ప్రేరేపించిన కేసులో సిద్దు ప్రధాన నిందితుడిగా ఉన్నారని పోలీసులు మేజిస్ట్రేట్ కి తెలిపారు. దీంతో ఆయనను వారంరోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.ఈ విషయమై సిద్దూ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోపణలతో సిద్దూకు ఎలాంటి సంబంధం లేదని, ఉండకూడని చోట ఉన్నారనేది వాస్తవం అని న్యాయవాది పేర్కొన్నారు. ఇక సిద్దూ ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు లక్ష రివార్డు ప్రకటించిన 24 గంటల లోపే సిద్దూ అరెస్ట్ కావడం గమనార్హం.
ఇక రిపబ్లిక్ డే రోజు రైతుల ఆంక్షలు నడుమ తలపెట్టిన శాంతియుత ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులుకు ,రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.