Kerala: 11 మంది కాంగ్రెస్‌ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం

Nancharaiah merugumala senior journalist:

రేవంత్ రెడ్డేమో మోదీని మొన్న పెద్దన్న అని పొగిడితే ఇప్పటికే 11 మంది కాంగ్రెస్‌ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం విజయన్ 

‘‘బీజేపీలోకి ఇప్పటి వరకూ 11 మంది కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రులు చేరిపోయారు. ఇంకెందరు హస్తం పార్టీ మాజీ సీఎంలు బీజేపీలో జొరబడతారు? ఎవ్వరూ ఈ విషయంపై జోస్యం చెప్పలేరు. మీరెవరైనా చెప్పగలరా? ఇదీ కాంగ్రెస్‌ పరిస్థితి. మరోపక్క మొన్నీమధ్య హైదరాబాద్ వచ్చిన బీజీపీ ప్రధాని నరేంద్రమోడీని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ‘ నాకు పెద్దన్న ‘ అని పొగిడారు. గుజరాత్ అభివృద్ధి నమూనాయే అన్ని రాష్ట్రాలకు ఆదర్శమని కూడా రేవంతయ్య నొక్కి చెప్పారు. కాంగ్రెస్ ఈ లెక్కన ఎటు పోతుందో! ” శుక్రవారం జరిగిన ఒక మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ కేరళ సీపీఎం–ఎల్డీఎఫ్‌ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పిన మాటలివి. 2012 నాటికే దేశంలోని 28 రాష్ట్రాల్లో మెజారిటీ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయింది. సంపూర్ణ మెజారిటీతో బీజేపీ 2014 మేలో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గేల నాయకత్వంలో మరి కొన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఈ రాష్ట్రాలు బీజేపీ లేదా ఆప్‌ వంటి ప్రాంతీయపక్షాల ఖాతాలో పడిపోయాయి. ఇప్పుడు ఉత్తరాదిన హిమాచల్‌ ప్రదేశ్, దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ మినహా మరెక్కడా కాంగ్రెస్‌ అధికారంలో లేదు. మరి దశాబ్దాలపాటు మెజారిటీ రాష్ట్రాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ (జీఓపీ)లో సహజంగానే మాజీ ముఖ్యమంత్రులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. తెలుగునాట కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రుల్లో ఇద్దరే నాదెండ్ల భాస్కరరావు, నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి బతికి ఉన్నారు. నాదెండ్ల వయోభారంతో (89 ఏళ్లకు దగ్గర్లో) ఇంట్లోంచి కదల్లేక పోతుండగా. ఆయన కన్నా దాదాపు పాతికేళ్ల చిన్నవాడైన కిరణ్‌ రెడ్డి ఏడాది క్రితం బీజేపీలో చేరారు. కేరళలో మార్క్సిస్టులకు బద్ధశత్రువైన కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎందరు సీఎంలు బీజేపీలో చేరారో లెక్కించే ఓపిక 79 ఏళ్ల కమ్యూనిస్టు విజయన్‌ కు ఉండడం నిజంగా గొప్ప విషయమే. కేరళకు చెందిన యువకులు, ఉపాధికి ఉపయోగపడే విద్య తెలిసిన పెద్దలు పశ్చిమాసియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు పెద్ద సంఖ్యలో పోతున్నారనేది తెలిసిన విషయమే. అలాగే ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన శ్రామికవర్గం ప్రజలు తమిళనాడులో చివరాఖర్న ఉన్న కన్యాకుమారి వరకూ వలసొచ్చి అన్ని రంగాల్లో పనిచేసుకుని బతుకుతున్నారు. అమేథీలో గెలవలేనని తెలిసి కేరళలో ముస్లిం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో ఒకటైన వయనాడ్‌ నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పోటీచేసి తమ సోదర పార్టీ సీపీఐ అభ్యర్థిని ఓడించడం (2019లో) విజయన్‌ గారికి చీకాకు పుట్టే విషయమేగా మరి.