కేసిఆర్ కు దళిత నేతలంటే ఎందుకు పడదు : బండి సంజయ్

సీఎం కేసీఆర్ కు దళిత నాయకులంటే ఎందుకు పడదని ? బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి , వర్ధంతి కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. దళిత నేతల కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం పై ఆ పార్టీ దళిత నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ అవకాశవాద రాజకీయాల చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని సంజయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నేతలు వెంకటస్వామి, మోత్కుపల్లి నర్సింహులతో పాటు తదితరులు పాల్గొన్నారు. బిజెపి పార్టీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. దళితున్ని సిఎం చేస్తానన్న కెసిఆర్ దాన్ని విస్మరించారన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్, ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించాలని డిమాండ్ చేశారు.