నల్లగొండ బీజేపీలో రెండు వర్గాల గ్రూపు తగాదా రచ్చకెక్కిందా? రెండు వర్గాల తీరుతో కార్యకర్తల్లో అయోమయం నెలకొందా? తెరపై కొత్త నేతలు ప్రోజెక్ట్ అవుతున్న నేపథ్యంలో సీనియర్ నాయకులు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారా? క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని అధినాయకత్వం పిలుపునిచ్చినా నేతలు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారా? అసలు నల్లగొండ కాషాయం పార్టీలో ఏంజరుగుతుంది?
నల్లగొండ జిల్లా బీజేపీ నేతల తీరుపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు రెండు వర్గాలుగా విడిపోవడంతో పార్టీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పార్టీ సీనియర్ నేతలు మాకెందుకు వచ్చిన గొడవ అన్నట్లు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి పోటిచేసిన నేతలు తమకేమి పట్టనట్లు మౌనం వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారే యమునా తీరే తరహాలో నిర్వహించడం.. కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తుంది.
నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. పార్టీకి డిపాజిట్ కూడ రాదన్నది కాదనలేని వాస్తవం. రాష్ట్ర నాయకత్వం పార్టీ బలోపేతంపై..ముఖ్య నేతలను పలుమార్లు హెచ్చరించిన ఎలాంటి మార్పు లేదు. ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు నేతల తీరు ఉందని కార్యకర్తలు చెబుతున్న తీరు విస్మయ పరుస్తుంది.
ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పాత వారితో పాటు కొత్త వారు సీటు ఆశిస్తున్నారు. పార్లమెంట్ సీటుకోసం గత ఎన్నికల్లో పోటిచేసిన గార్లపాటి జితేందర్ , జిల్లా కోశాధికారి బండారు ప్రసాద్, కొత్తగా పార్టీలోకి వచ్చిన నాగం వర్షిత్ రెడ్డి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వీరితో పాటు కన్మంత ఫౌండేషన్ ఛైర్మన్ కన్మంత శ్రీదేవి రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది.
మొత్తంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న కాషాయం పార్టీకి.. నల్లగొండ జిల్లా రాజకీయం తలనొప్పిగా మారిందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.