దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో డెల్టా, డెల్టాప్లస్, వంటి వేరియంట్లు భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో కొత్తరకం వేరియంట్ ‘లాంబ్డా’ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ ఇప్పటివరకు 29 దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. బ్రిటన్లో ఇప్పటివరకు ఆరు లాంబ్డా కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది.
లాంబ్డా వేరియంట్ తొలుత గతేడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఏప్రిల్ నుంచి పెరూలో బయటపడిన కొవిడ్ కేసుల్లో ఈ వేరియంట్ వాటా 81శాతం ఉన్నట్లు తెలిసింది. గత 60 రోజుల్లో ఇది చిలీలో 32శాతానికి పెరిగింది. ఈ వేరియంట్ వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందనడానికి గానీ, ప్రస్తుత టీకాలను ఏమారుస్తుందనడానికి గానీ ఎలాంటి ఆధారాల్లేవని డబ్లూహెచ్ ఓ పేర్కొంది.
అయితే దీని స్పైక్ ప్రోటీన్లోని కొన్ని ఉత్పరివర్తనలు వల్ల ఇది త్వరగా వ్యాపించే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. ఈ వేరియంట్ గురించి ఇంకా పరిశోధనలు జరుగుతున్నట్లు డబ్లూహెచ్ వెల్లడించింది.