తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి!

ఊహాగానాలకు తెరదించుతూ.. ముందునుంచి అనుకున్నట్లే తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ(అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) ప్రకటించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని ఏఐసిసి నియమించింది. సీనియర్ నేతలు టి.జగ్గారెడ్డి, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లతో పాటు అజారుద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, రమేశ్‌ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌ రావు, జావేద్‌ ఆమీర్‌ లను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్‌ సి.రాజ నర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డిలు నియమితులయ్యారు.

కాగా పీసీసీ రేసులో ఉన్నటువంటి మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోపాటు పలువురు సీనియర్ నేతలతో చర్చించిన తరువాతే అధిష్టానం పీసీసీ అధ్యక్షుడుని ప్రకటించినట్లు సమాచారం. పది రోజుల ముందే రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ప్రకటిస్తారని వార్తలొచ్చిన.. విహెచ్ లాంటి సీనియర్ నేతలు రేవంత్ అభ్యర్థిత్వాన్ని బాహాటంగా వ్యతిరేకించడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. దీంతో మరోసారి సీనియర్ నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ టాగూర్ చర్చించి.. నివేదికను అధిష్టానానికి అందజేశారు. అంతేకాక ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితుల సైతం పరిగణలోకి తీసుకొని రేవంత్ ఎంపిక జరిగినట్లు సమాచారం.

ఇక పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డికి .. సీనియర్ నేతలు సహకరిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వరుస ఎన్నికల్లో ఓటమితో కోమాలో ఉన్న పార్టీని రేవంతుడు ఎలా నడిపిస్తాడన్నది పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.