ట్విట్టర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి ధర్మేంద్ర చాతుర్ తన పదవి నుంచి తప్పుకున్నారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఇటీవలే నియమితులైన ధర్మేంద్ర చాతుర్.. పదవికి నుంచి తప్పుకోవడానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్ సైతం నిరాకరించింది.
గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్‌కు మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ధర్మేంద్ర రాజీనామ పరిణామం మరో చర్చకు దారితీసింది.
వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల అమలుతో ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. 50 లక్షల యూజర్లను కలిగిన సోషల్‌మీడియా కంపెనీలు భారత్‌కు చెందిన ముగ్గురు అధికారులను నియమించుకోవాలని, వారి వివరాలను పొందుపరచాలని నూతన ఐటీ నిబంధనలు చెబుతున్నాయి. ఆ మేరకు మిగిలిన సోషల్‌మీడియా కంపెనీలు గ్రీవెన్స్ అధికారులతో పాటు ఇతర అధికారులను నియమించుకున్నాయి. ట్విట్టర్ మాత్రం ఈ విషయంలో ఆలస్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం చివరి నోటీసుకు స్పందిస్తూ చీఫ్ కాంప్లియన్స్ అధికారిని నియమిస్తామని, అదే సమయంలో చాతుర్‌ను తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిగా నియమిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. కొద్దిరోజులకే ఆయన వైదొలగడంతో గ్రీవెన్స్ అధికారి స్థానంలో ఆయన పేరును తొలగించింది. ప్రస్తుతం అమెరికా అడ్రస్, ఈ-మెయిల్ ఐడీతో కూడి మరొకరి పేరు చూపుతోంది.
మరోవైపు ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్ పోలీసులు. ఎండీని దర్యాప్తు చేసేందుకు కర్ణాటక హైకోర్టు అనుమతి కోరనున్నారు.
ఓ మతానికి చెందిన వృద్ధుడిపై దాడి చేసిన కేసులో దర్యాప్తునకు హాజరుకావాలని ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి యూపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్‌లో వివరణను రికార్డు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్పి.. జూన్ 24న ఈ దర్యాప్తునకు హాజరుకాలేదు మనీష్. దీని వలన ట్విట్టర్ ఎండీకి సమస్యలు మరింత కఠినమవుతాయని ఓ న్యాయ నిపుణుడు అభిప్రాయపడ్డారు.