_కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతా గంట నిలిపివేత!
కేంద్రం, ట్విట్టర్ మధ్య మరోసారి అగ్గిరజుకుంది. దీనికి కారణం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను సామాజిక మాధ్యమ సంస్థ గంట పాటు నిలిపివేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి వెల్లడించడం గమనార్హం. గత కొంతకాలంగా ట్విటర్, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న సమయంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయానికి సంబంధించి ట్వీట్ చేస్తూ.. మిత్రులారా ఈ రోజు ఓ విచిత్రం జరిగింది. దాదాపు గంట పాటు నా ఖాతాను ట్విట్టర్ యాక్సిస్ చేసుకోనివ్వలేదు. అమెరికా డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం నిబంధనలను ఉల్లంఘించిందని చెప్పి నా ఖాతాను కొంతసేపు బ్లాక్ సామాజిక మాధ్యమం నా ఖాతా ను నిలిపివేసింది. కొద్దిసేపటి తర్వాత యాక్సిస్‌ను పునరుద్ధరించింది’’ అని రవిశంకర్ ప్రసాద్ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ట్విటర్ ఐటీ నిబంధనలను ఉల్లంఘించిందని..నా ఖాతాను యాక్సిస్‌ను నిలిపివేసే ముందు తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.
‘ట్విట్టర్ లేవనెత్తిన అంశాన్ని కి వివరణ ఇస్తూ.. నేను పోస్ట్ చేసిన నా టీవీ ఇంటర్వ్యూ వీడియోలపై గత కొన్నేళ్లుగా ఏ టెలివిజన్ గానీ కాపీరైట్ ఫిర్యాదులు చేయలేదు. కానీ, ఫిర్యాదులు వచ్చినందువల్లే ఖాతాను నిలిపివేశామని ట్విటర్ చెబుతోంది. నిజానికి ట్విటర్ ధిక్కార చర్యలపై తాను మాట్లాడినందుకే తన ఖాతాను బ్లాక్ చేసి ఉంటార’’ని కేంద్రమంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కాగా నూతన ఐటీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించేందుకు ట్విటర్ ఎందుకు నిరాకరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ ట్విటర్ నూతన నిబంధనలను అమలు చేస్తే.. తమ ఎజెండాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల ఖాతాలను ఏకపక్షంగా బ్లాక్ చేసే అవకాశం ఉండదు కదా..అని చురకలంటించారు.
నూతన ఐటీ నిబంధనలపై తాము రాజీపడే ప్రసక్తే లేదని.. కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.