9.5 C
London
Wednesday, January 15, 2025
HomeLatestsupremecourt: చట్టం మార్పో? కొత్త చట్టమో..!

supremecourt: చట్టం మార్పో? కొత్త చట్టమో..!

Date:

Related stories

literature: కులం అనే ఆలోచనకు ప్రేమే పరిష్కారం..!

విశి: కుట్టి రేవతి తమిళ కవయిత్రి & సినీ గీతరచయిత్రి. అసలు పేరు...

sankranti2025: 3 డీ టైప్స్ ముగ్గులు..ప్రత్యేకం..!

సాహితీ, ప్రసిద్ధ, మౌక్తిక: ...

literature: ఎరుకే జ్ఞానం నీవే దైవం..!

Teluguliterature: ఆ.వె : శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మముండుట...

BJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?

BJP: బీజేపీ మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల...

vaikuntaekadashi: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత..!

Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం...
spot_imgspot_img

AntiDefectionAct:

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించడమో, మారిన పరిస్థితుల్లో మరో పకడ్బందీ చట్టం తెచ్చుకోవడమో అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న చట్టం, ఇదే రూపంలో… ఆశించిన ఫలితాలిచ్చే జాడ కనిపించట్లేదు. నిర్ణయాధికారం స్పీకర్దేనని, దానికి గడువు విధించలేమని న్యాయస్థానం తేల్చడంతో… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి-బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. పిటిషన్లపై నిర్ణయం ఎప్పటిలోపు తీసుకోవాలన్నది స్పీకర్ నిర్ణయాదికార పరిధి అంశమని, అంతకు ముందే సమీక్షకై జోక్యం చేసుకోజాలమని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘పిటిషన్లపై నిర్ణయానికి షెడ్యూల్ ఖరారు చేయండం’టూ అంతకుముందు సింగిల్జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ‘తగిన సమయంలోగా నిర్ణయించండంటూ’ స్పీకర్కు ధర్మాసనమిచ్చిన తాజా ఆదేశాల దరిమిళా.. ఈ అనిశ్చితి ఉత్పన్నమౌతోంది.

‘‘నైతిక విలువల్లో/ వీడు ఉక్కూ కాదు/ వాడు కంచూ కాదు/ ఇద్దరూ/చెదలెక్కిన చెక్కలే……!’’ అంటాడు అలిశెట్టి ప్రభాకర్.

ఎన్నికల్లో ఒక పార్టీ తరపున ఎన్నికై మరో పార్టీలోకి మారటం చట్టవిరుద్దం. అలా మారొద్దని, మారితే అనర్హులవుతారని ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’ (1985) చెబుతోంది. రాజ్యాంగ పరిధిలో, రాజ్యాంగ (52వ) సవరణతో, 10వ షెడ్యూల్లో చేర్పులతో ఏర్పడ్డ చట్టమిది. కానీ, ఆ చట్టానికి వీసమెత్తు విలువివ్వని పలువురు ప్రజాప్రతినిధులు యధేచ్చగా పార్టీలు మారుతున్నారు. స్పీకర్ల ‘నిర్ణయ తాత్సారం’ నీడలో ఆశ్రయం పొందుతున్నారు. అనర్హత వేటు పడకుండా పదవీకాలం పూర్తి చేస్తున్నారు. ఎన్నికల ముంగిట్లో సరేసరి, ఎన్నికల్లో ఒక పార్టీ టిక్కెట్టుపై, ఆ పార్టీ జెండాతో, ఎజెండాతో ప్రచారం చేసి, ఎన్నికయ్యాక… నిస్సిగ్గుగా ప్రత్యర్థి పార్టీలోకి మారిపోతున్నారు. అంటే, ఎవరికి వ్యతిరేకంగా, ఎవరి రాజకీయ విధానాలను విమర్శించి జనామోదంతో గెలుస్తారో అది మరిచి, అదే ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లి చేరడమన్నమాట! ఓటేసిన సగటు మనిషి వేలిపై సిరా తడి ఆరక ముందే, ఓటరు నిర్ణయానికి విరుద్దంగా పార్టీ మారుతున్న ప్రబుద్దులు కూడా దేశంలో ఉన్నారు. ఓటరు తీర్పునే వంచిస్తున్నారు. ఇది తప్పని ప్రత్యర్థి పార్టీలు మొత్తుకున్నా ప్రయోజనం ఉండట్లేదు. ఎందుకంటే, అలా పార్టీ మారిన వారిపై ఫిర్యాదు అందినపుడు, చట్టప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించే అధికారాన్ని సభాపతులైన స్పీకర్లకు చట్టం కట్టబెట్టింది. సహజంగా ఈ పార్టీ మార్పిళ్లు విపక్షాల నుంచి పాలకపక్షాలవైపు సాగుతున్న దరిమిళా… నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ల తాత్సారం వారికి లాభిస్తోంది. వేటు పడట్లేదు. ఇది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పాలకపక్షమైన కాంగ్రెస్ వైపు సాగుతుంటే, గడచిన పదేళ్ల కాలంలో కాంగ్రెస్, ఇతర విపక్షాల నుంచి నాటి పాలకపక్షం బీఆర్ఎస్ వైపు సాగింది. ఈ విషయంలో ‘దొందు దొందే’ అన్నది ప్రజలకూ తెలుసు. మెజారిటీకి సరిపడే సంఖ్యాబలం ఉన్నప్పటికీ, ‘ఏమో? రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో! పార్టీ మార్పిళ్లను ప్రోత్సహించి ముందుగానే తగిన సంఖ్యాబలాన్ని సమకూర్చుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు’ అన్నది పాలకపక్షాల యోచన. తాయిలాలకో, బెదిరింపులకో లంగి ఈ ‘గొడ దూకుళ్లకు’ సిద్దపడే వారు, వారికి రక్షగా నిలిచే అ‘వ్యవస్థ’లూ ఉన్నంత కాలం ఈ చట్టోల్లంఘణ యధేచ్చగా జరిగే ప్రమాదం పొంచే ఉంటుంది. చట్టం మారితే తప్ప ఉపశమనం లభించేలా లేదు.

విషయం- వివాదం..

చట్టసభకు సంబంధించినంత వరకు సభాపతిగా స్పీకర్ కి విస్తృతాధికారాలుంటాయి. సభా వ్యవహారాల్లో ఆయనకు ఆదేశాలిచ్చే అధికారం న్యాయస్థానాలకుండదు. అది, రాజ్యాంగపు ముఖ్య అంగాలైన శాసనాన్యాయ వ్యవస్థల మధ్య పరిధుల ఉల్లంఘన -అనుచిత జోక్యమే అవుతుంది. కానీ, స్పీకర్ల నిర్ణయాల చట్ట, రాజ్యాంగ బద్దతని సమీక్షించే అధికారం కోర్టులకుంది. నిర్ణయమే జరుగనప్పుడు ఇక సమీక్ష ఎక్కడిది? అనే ప్రశ్న తలెత్తుతోంది. బీఆర్ఎస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (స్టేషన్ఘన్పూర్), తెర్లాం వెంకట్రావ్ (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్) లు కాంగ్రెస్ పార్టీలోకి మారడాన్ని తప్పుబడుతూ, ఫిర్యాదిచ్చినా వారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించ లేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి (హుజూరాబాద్), కే.పీ.వివేకానంద (కుత్బుల్లాపూర్) లు కోర్టుకెక్కారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచి, పార్టీకి-పదవికి రాజీనామా చేయకుండా నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం వివాదాస్పదమైంది. నాగేందర్ అనర్హత విషయమై బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి కోర్టులో విడిగా పిటిషన్ వేశారు. విచిత్రమేమంటే ఈ ముగ్గురు పిటిషనర్లూ ఇతర పార్టీల నుంచి, వేర్వేరు సమయాల్లో ఆయా పార్టీల్లోకి వచ్చిన వారే! పిటిషన్లపై విచారణ జరిపి, ‘‘అనర్హత తేల్చే నిర్ణయానికి గాను నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాల‘ని హైకోర్టు (సింగిల్ జడ్జి) సెప్టెంబరు 8న తీర్పిచ్చింది. దీన్ని అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేయడంతో ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరాధే, జస్టిస్ జే.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం ఇరుపక్ష వాదనలు విని, కేసును సమగ్రంగా విచారించింది. ‘తగిన సమయం’లోగా నిర్ణయించే అధికారాన్ని స్పీకర్కే వదిలేసింది.

సహేతుక సమయం ఎంత?

పార్టీ మార్పిళ్లపై ఫిర్యాదు అందినపుడు స్పీకర్ ఎంత కాలవ్యవధిలో తేల్చాలి అన్నది చట్టంలో లేదు. సభాకాలం ముగిసే వరకూ తేల్చని సందర్భాలున్నాయి. ఇలా సాగతీత కాలంలోనే ఇంకొందరి మార్పిళ్లు జరుగుతున్నాయి. మారిన ఎమ్మెల్యేల సంఖ్య సదరు పార్టీ మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట రెండొంతులు (టూథర్డ్) ఉంటే, దాన్ని ఒక పార్టీలో మరో పార్టీ ‘విలీనం’ (మెర్జర్) గా పరిగణిస్తారు కనుక అనర్హత వర్తించదు. అంతకు ముందు చట్టంలో ఇంకో వెసలుబాటుండేది. మూడింట ఒక వంతు (వన్థర్డ్)ని ‘చీలిక’ (స్ప్లిట్) వర్గంగా గుర్తించి, అనర్హత నుంచి మినహాయించారు. కానీ, రాజ్యాంగ సవరణ (2003) ద్వారా ‘చీలిక’ను తొలగించి, విలీనాన్నే కొనసాగించారు. అప్పుడొకరు, ఇప్పుడొకరుగా ఎమ్మెల్యేలు మారుతూ టూథర్డ్ కి చేరి, అనర్హత వర్తించని సురక్షిత స్థితిని తెచ్చుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మారిన ఎమ్మెల్యేల విషయంలో ఇదే జరిగింది. ‘సహేతుక సమయం’లో స్పీకర్ నిర్ణయం తీసుకొని, ఎప్పటికప్పుడు అనర్హులుగా ప్రకటించి ఉంటే, టూథర్డ్కు చేరేదే కాదు. అందుకేనేమో, మార్పిళ్ల సంఖ్య టూథర్డ్ చేరనీకుండా, వెంటపడి, పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటింప జేయాలని బీఆర్ఎస్ కోర్టుకెక్కింది. ఉప ఎన్నికలు తీసుకురావాలనేది వారి వ్యూహం. నిర్ణయానికి ‘షెడ్యూల్’ ఖరారు చేయండని తొలుత కోర్టు చెప్పడంతో, చాన్నాళ్లకు ఈ ‘శాసనప్రతిష్టంభన’కు కదలిక వచ్చిందనుకున్నారు. కానీ, పలు కోర్టులు లోగడ చెప్పినట్టే, ఇది స్పీకర్ నిర్ణయాధికార పరిథిలోని అంశమన్న ధర్మాసనం తీర్పుతో వివాదం మొదటికొచ్చింది. తీర్పు సమయంలో… కిహొటో హోలోహాన్, రాజేంద్రసింగ్ రాణా, కేశం మెగాచంద్రసింగ్, సుభాష్ దేశాయ్.. తదితర కేసుల్ని-సుప్రీంకోర్టు పరిశీలనల్ని ధర్మాసనం ప్రస్తావించింది.

భిన్నాభిప్రాయాలు

పాలకపక్ష ప్రలోభాలకో, బెదిరింపులకో లంగి ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని, ఇది సర్కారు నిర్వాకమేనని విపక్షాల విమర్శ. ప్రభుత్వ పనితీరుకి ఆకర్శితులమై, నియోజకవర్గ అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నామని సదరు ఎమ్మెల్యేలు చెబుతుంటారు. అందరు స్పీకర్లు మావలంకర్లో, అనంతశయనం అయ్యంగార్లో అయి ‘నిష్పాక్షికత’ అనే విలువలకు కట్టుబడి ఉంటారనే ఆలోచనతో చట్టం చేసి ఉంటారేమో! కానీ, కాలక్రమంలో సదరు ‘స్పీకర్’ సంస్థ… పాలకపక్ష అనుకూల వైఖరినే ప్రదర్శించడం వివాదాస్పదమౌతోంది. చట్ట స్ఫూర్తి నిలబడాలంటే, అనర్హత ఫిర్యాదులపై నిర్ణయాధికారాన్ని స్పీకర్ల నుంచి తప్పించి ఎన్నికల సంఘానికో, న్యాయస్థానాలకో అప్పగించాలనే అభిప్రాయం లోగడ కొన్ని పార్టీలు వ్యక్తం చేశాయి. ఆ మేర రాష్ట్రపతికి, ఎన్నికల సంఘానికీ వినతులిచ్చాయి. అలా కాకుండా, స్పీకర్కే అధికారం ఉంచి, నిర్ణయానికొక సమయపరిమితి విధించేలా చట్ట సవరణ చేయాలని జస్టిస్ సుదర్శన్రెడ్డి వంటి న్యాయకోవిదులు అభిప్రాయపడతారు. హైదరాబాద్లోనే ఒక సభలో జస్టిస్ జీవన్రెడ్డి మాట్లాడుతూ, ‘…. పిటిషన్లు పరిష్కరించే క్రమంలో, సకాలంలో ఏదీ నిర్ణయించని స్పీకర్ల తాత్సారాన్నీ ఒక నిర్ణయంగా పరిగణించి న్యాయస్థానాలు సమీక్షించవచ్చేమో చూడాల’న్నారు. వ్యక్తులు పార్టీలకు కట్టుబడనట్టే, పార్టీలు కూటములకు కట్టుబడకపోవడాన్ని మనం బిహార్ (నితీశ్), మహారాష్ట్ర (ఉద్దవ్) లలో చూశాం.రాజకీయాల ప్రతిష్ట సగటు పౌరుల దృష్టిలో ఇప్పటికే మసకబారింది. ఈ యధేచ్చా పార్టీ మార్పిళ్లు ఇలాగే సాగితే… ప్రజాతీర్పు మరింత వంచనకు గురై, ప్రజాస్వామ్యానికే హాని కలిగే ప్రమాదముంది.అదే అలిశెట్టి ప్రభాకర్ నుడివినట్టు

‘‘పుచ్చుకున్న/ రాజీనామా లేఖలే/ ఇంకొకరి చేతిలో/ విచ్చుకున్న/ సరికొత్త పదవీరేకులైతే/ నువ్వు క్షణికమైన పరిమళమే/ రాజకీయమా…!’’ అనిపిస్తుంది.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

Optimized by Optimole