SanatanDharma: సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం: పవన్

PawanKalyan: ‘పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో అపవిత్రం జరిగితే వైసీపీ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నా’రని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  మండిపడ్డారు. జగన్ నియమించిన టీటీడీ బోర్డులో తప్పు జరిగిందని ల్యాబ్ రిపోర్టులతో సహా విషయం బయటకు వచ్చినా దబాయింపు చేయడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. తప్పు జరిగినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని మాట్లాడాలి లేదా అప్పటి బోర్డులో ఉన్న అధికారులు, బోర్డు సభ్యులు ప్రమేయం మీద మాట్లాడాలి.. అంతేగాని ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా కలసికట్టుగా మాట్లాడాలని.. మౌనం వహిస్తే … ఆ మౌనం మన భవిష్యత్తు తరాలను నాశనం చేస్తుందని హెచ్చరించారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం మెట్లను కడిగి శుభ్రం చేశారు. పసుపు రాశారు. కనక దుర్గమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “అన్ని మతాలు, అన్ని ధర్మాలు, అన్ని విశ్వాసాలను సమానంగా గౌరవించే నేల మనది. కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ అపవిత్రం అయితే వైసీపీ నాయకులు బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారు. గతంలో దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైన సందర్భంగా ఆ విషయాన్ని అప్పటి వైసీపీ నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడారు. ఆ వెండి సింహాలతో మేడలు, మిద్దెలు కట్టుకుంటామా అంటూ మాట్లాడడం చాలా బాధ కలిగించింది. ఆ రోజు మాట్లాడింది క్రైస్తవులో, మరొకరో కాదు. చేతులకు తాళ్ళు కట్టుకొని, బొట్లు పెట్టుకొనే హిందువులే. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకోండి. లేకపోతే సంబంధం లేదని చెప్పండి. అంతే తప్ప సనాతన ధర్మంపై ఇష్టానికి మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు.