Nancharaiah merugumala senior journalist:
ఇండియాలో విశ్వవిద్యాలయాల పేర్ల మార్పిడికి వివాదాలు లేదా గొడవలు పూర్వపు హైదరాబాద్ స్టేట్, ప్రస్తుత మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలోని ఔరంగాబాద్ మరాఠ్వాడా యూనివర్సిటీతో మొదలు కాలేదు, దానితోనే ముగియడం లేదు. ఈ యూనివర్సిటీకి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాని దళితులు ఆందోళన చేయడం, ససేమిరా అలా చేయోద్దంటూ శివసేన, మరాఠా కులాల సంస్థలు పోటీ ఉద్యమాలు నడపడం, ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు చరిత్రలో భాగం. చివరికి రాజీమార్గంగా ఈ ఔరంగాబాద్ నగరంలో విశ్వవిద్యాలయం పేరును డా.బీ.ఆర్.అంబేడ్కర్ మరాఠా యూనిర్సిటీగా మార్చడంతో ఇరు వర్గాలూ శాంతించాయి. పేరు మార్పిడి కోసం ఇంతటి మహోద్యమాలు మళ్లీ జరగలేదు గాని ఈ మధ్య హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును తెలుగు చారిత్రక పరిశోధకుడు, ప్రసిద్ధ సాహితీవేత్త, పాత్రికేయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాలని ఎనుముల రేవంత్‌రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (మంత్రివర్గం) నిర్ణయించింది.
అంతకు ముందు తెలంగాణ శాసనసభలో ఒక పార్టీ ఎమ్మెల్యే (పేరు గుర్తులేదు) నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని కోరడంతో రేవంత్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతాపరెడ్డి గారు రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు గ్రంథం. అయితే, పేరు మార్పు నిర్ణయం జరిగినప్పటి నుంచీ హైదరాబాద్, మిగిలిన తెలంగాణ ప్రాంతంలోని ఆర్యవైశ్యలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం ప్రారంభించారు. ఇప్పుడైతే రోజూ హైదరాబాద్‌లో వైశ్య సంఘాల వారు ప్రదర్శనలు, ఊరేగింపులు సహా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలుగు పత్రికల్లో ప్రధానంగా ‘ఈనాడు’లో వార్తలొస్తున్నాయి.
‘తొలి భాషాప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన నేతగా శ్రీరాములును గుర్తించాలి’
అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ౖÐð శ్య కుటుంబంలో పుట్టారు కాబట్టి ఆయన పేరు తెలుగు వర్సిటీకి కొనసాగించాలని తాము కోరడం లేదనీ, ఇండియాలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రం కోసం ఇంకా చెప్పాలంటే ప్రత్యేకించి తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన నేతగా పరిగణిస్తున్నామని, అందరూ ఆయనను అలాగే గౌరవించి తెలంగాణ రాజధానిలో నడిబొడ్డున ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన పేరు అలాగే ఉంచాలని తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్ తదితర జిల్లాల వైశ్య సంఘాలు గట్టిగా కోరుతున్నాయి. అమరజీవిని ఒక్క ఆంధ్రా వ్యక్తిగా చూడడం తగదని, ఆయన భారతమాత ముద్దుబిడ్డ అనే రీతిలో వైశ్య ప్రముఖులు ఈ సందర్భంగా చెబుతున్నారు. నాంపల్లి స్టేషన్ దగ్గరున్న ఈ యూనివర్సిటీకి ఆయన పేరు కొనసాగించాలని ఏపీ, తెలంగాణ వైశ్యులేగాక దేశవ్యాప్తంగా ఉన్న వైశ్యులు కోరుతున్నారని కూడా ఈ సంఘీయులు వాదిస్తున్నారు. తెలుగుదేశం స్థాపక ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు హయాంలో 1985 డిసెంబర్ 2న నాటి ఉమ్మడి ఏపీ అసెంబ్లీ భవనాలకు అతి సమీపంలో తెలుగు యూనివర్సిటీ ప్రారంభించగా, పొట్టి శ్రీరాములు అనే మాటలను 1998లో నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఈ యూనివర్సిటీ పేరు ముందు చేర్చారు. అయితే, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మొదట్లో రాజీవ్‌గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ అని పేరు పెట్టినా షంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌గానే అది ప్రాచుర్యంలో ఉన్నట్టే ఈ భాషా విశ్వవిద్యాలయం కూడా తెలుగు యూనివర్సిటీగానే ప్రచారంలో ఉంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పిలిచేవారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.
వ్యవసాయవర్సిటీకి ముందు రంగా పేరు తగిలించడంతో మళ్లీ పేరు మార్చారు!
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో 1960ల మధ్యలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఏపీఏయూ) పేరును తెలుగు వర్సిటీ ఫక్కీలోనే 1996లో చంద్రబాబు హయాంలో ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీగా (ఏఎన్‌జీఆర్‌ఏయూ) పేరు మార్చారు. వాస్తవానికి ప్రొఫెసర్ రంగా కులాలు, ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతమైన గొప్ప వ్యక్తి. ఇంగ్లండ్‌లోని ప్రసిద్ధ యూనివర్సిటీలో ఏడాదికి మూడు నెలలు అగ్రికల్చరల్ ఇకనామిక్స్ బోధిస్తూ ఇండియాలో స్వతంత్ర పార్టీ అనే జాతీయ పార్టీ అధ్యక్షుడిగా రంగా గారు ఉన్నారు. ఆయన అంతటి సచ్చీలుడైన పాతతరం నేత తెలుగునాట ఎవరూ లేరంటారు. అయితే, 2014లో ఏపీ విభజన తర్వాత రంగా పేరుతో ఉన్న యూనివర్సిటీని గుంటూరు సమీపంలో ఏఎన్‌జీఆర్‌ఏయూ పేరుతోనే అవశేషాంధ్ర ప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. దీంతో హైదరాబాద్‌లోని అసలు సిసలు వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు గడించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (స్వర్ణకార కుటుంబంలో పుట్టిన వరంగల్ జిల్లాకు చెందిన ఈయన కాకతీయ మాజీ వీసీగా కూడా పనిచేశారు)పేరుతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం గా మార్చారు. రంగా గారి పేరుతో అమరావతి సమీపంలోని లామ్ వద్ద వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు కారణంగా ఎవరూ ఈ మార్పును తప్పుపట్టలేదు, ఎన్జీ రంగా పేరు కొనసాగించాలని కోరలేదు. ఆంధ్రావారు లేదా కమ్మ సంఘాలు కాని గొడవ చేయలేదు.
ప్రతాపరెడ్డి పేరు ఉస్మానియా వర్సిటీకి పెట్టకోవచ్చని సూచిస్తున్న వైశ్య సంఘాలు!
………………………………………………………………………
మళ్లీ నాంపల్లి తెలుగు వర్సిటీ పేరు వివాదం విషయానికి వస్తే…పొట్టి శ్రీరాములు గారి పేరు కొనసాగించాలని గట్టిగా పోరాడుతున్న తెలంగాణ వైశ్య సంఘాలు, వైశ్య పెద్దలూ…‘ సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును అంతగా కావాలనుకుంటే తెలంగాణలో అన్నింటి కన్నా ముందర పెట్టిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పెట్టుకోవచ్చని’ సలహా ఇస్తున్నారు. అయితే, ఉస్మానియా అనే పదంలోనే ఉస్మాన్ అలీ ఖాన్ పేరు ఉంది కాబట్టి దానికి ప్రతాపరెడ్డి గారి పేరు జోడించడం కుదిరే పనేనా? అనే అంశాన్ని సురవరం సొంత జిల్లాగా పరిగణించే మహబూబ్‌నగర్ జిల్లాలో పునాదులున్న తెలంగాణ రెండో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తే మంచిదని కొందరు తెలంగాణ విద్యావేత్తలు భావిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమకాలంలో ‘అమరజీవి’ విగ్రహాలు కూల్చితే వైశ్యసంఘాల నిరసన
2008–2013 మధ్య తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో సిద్దిపేట తదితర తెలంగాణ వాణిజ్య కేంద్రాలైన పట్టణాల్లో ఎప్పుడో నెలకొల్పిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలను కొందరు ఆందోళనకారులు నేలమట్టం చేశారు. దీంతో, మిర్యాలగూడ, సూర్యాపేట, నల్లగొండ, జడ్చర్ల, సిద్దిపేటలోని వైశ్య సంఘాలు ప్రశాంతంగా తమ నిరసన తెలిపాయి. తెలంగాణకు ఆంధ్రోళ్లు అన్యాయం చేయడంలో ఎలాంటి పాత్ర లేని అమరజీవి శ్రీరాములు గారి బొమ్మలు పగలుగొట్టడం అనాలోచిత చర్య అని వైశ్య సంఘాల నేతలు తప్పుపట్టారు. పరిస్థితిని వెంటనే గమనించిన నాటి టీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇక ముందు పొట్టి శ్రీరాములు గారి విగ్రహాల జోలికి పోవద్దని, వాటిపై ఈగ కూడా వాలకుండా చూడాలని తెలంగాణ ఉద్యమకారులు, కార్యకర్తలను ఆదేశించారు. దాంతో శ్రీరాములు గారి విగ్రహాల విధ్వంసం ఆగిపోయింది. ‘‘ పొట్టి శ్రీరాములు తెలుగోళ్లకు సొంత రాష్ట్రం కోసం కొట్లాడిన మహనీయుడు. మన తెలంగాణా వారికి కూడా ఆరాధించదగిన గొప్ప మనిషి. ఆయన అంతటి మహా గొప్ప వైశ్య ప్రముఖుడు (వైశ్య ఐకన్) మన తెలంగాణ వైశ్యులకు లేడు.అదీగాక, అన్ని తెలంగాణ పట్టణాల్లోని వైశ్య సంఘాలు తెలంగాణ ఉద్యమానికి ఆర్థికంగానే గాక అన్ని విధాలా ఆసరాగా నిలబడుతున్నాయి. ఇలాంటి పొరపాటు మళ్లీ చేయకండి. వైశ్యులను మానసిక క్షోభకు గురిచేయకండి, ’’ అని కేసీఆర్ తన కార్యకర్తలు, ఉద్యమకారులకు గట్టి మెసేజ్ పంపగలిగారు.
ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాలతో పోల్చితే అన్ని తెలంగాణ నగరాలు, పట్టణాల్లో వైశ్యులు హోల్‌సేల్, రిటెయిల్, ఆటో డీలర్‌షిప్పులు వంటి వ్యాపార రంగాల్లోనేగాక అనేక తయారీ పరిశ్రమలు వైశ్య అంట్రప్రెన్యూర్లు నడుపుతున్నారు. నల్లగొండ, నిజామాబాద్‌లో రాజకీయంగా బలమైన వైశ్య నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగించడం వల్ల తెలంగాణ సెంటిమెంటుకు వచ్చే ముప్పు ఏమీ లేదని కొందరు తెలంగాణ బుద్ధిజీవులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక, తెలంగాణ తెలుగు టార్చ్‌బేరర్‌గా ప్రసిద్ధికెక్కిన సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును అంత కన్నా పెద్ద ప్రభుత్వ చరిత్ర, విద్యా పరిశోధనా సంస్థకు పెట్టవచ్చని కూడా ఎందరో భావిస్తున్నారు. పొట్టి శ్రీరాములు గారి పేరు కొనసాగించాలన్న వైశ్య సంఘాల డిమాండును తెలంగాణ సాహిత్య సంఘాలు లేదా రెడ్డి మహాజన సంఘాలు బాహాటంగా వ్యతిరేకించే సాహసం కూడా ప్రస్తుతానికి చేయడం లేదు. ఈ చిన్న వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం మంచిది. అనుబంధ కళాశాలలు లేని తెలుగు వర్సిటీ వంటి ఒక చిన్న విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి వంటి మహనీయుడు పేరు పెట్టడం మినహా ఆయన దారిలో నడవడానికి మరో మార్గం లేదని ఆలోచించడం భావ్యం కాదనేది వైశ్యుల ప్రముఖుల అభిప్రాయంగా కనిపిస్తోంది.