Telangana: మోట కొండూరులో సేవ్ దామగుండం పేరిట నిరసన..

Telangananews:  వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ అనంతగిరి దామగుండ రక్షిత అడవులలో నౌకాదళ రాడార్ కేంద్ర ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మోట కొండూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర వివిధ సంఘాల నాయకులు, ప్రకృతి ప్రేమికులు నిరసన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల అడవిలో జీవిస్తున్న స్థానికులకు, జీవరాసులకు, నగరవాసులకు ముప్పు పొంచి ఉందని,మూసి నది ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని రచయిత పి.చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి,అటవీ శాఖకు సంబంధించిన భూములు కావని,ఇవి రామలింగేశ్వర ఆలయానికి సంబంధించిన భూములని వీటిని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. హైద్రాబాద్ నగరంలో వాతావరణ కాలుష్యం లేకుండా చూడాలని పిలుపునిచ్చారు.

రాడార్ టవర్లు భారీ ఎత్తున నిర్మించడం వల్ల రేడియేషన్ ప్రభావంతో స్థానికులకు శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్.ఎం.పి డాక్టర్ రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.12 లక్షల వృక్షాలను నరకడంతో భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ సిలిండర్లు కొనిచ్చే పరిస్థితి వస్తుందని యూత్ కాంగ్రెస్ నాయకులు శేఖర్ రెడ్డి అన్నారు.ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ నాయకులు కర్రె ప్రవీణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్,మొగులయ్య, ప్రవీణ్,నితిన్, ఉదయ్,మహేష్, ప్రదీప్, మనోజ్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.