విశీ:
2022 జులై. తన వాట్సాప్‌కి ఏదో మెసేజ్ వచ్చిందని గమనించింది శ్రుతి. ఓపెన్ చేసి చూసింది. షాక్… అందులో తన తమ్ముడు సుధీర్ న్యూడ్ ఫొటో ఉంది. ఆమెకు ఆందోళన కలిగింది. ఆ ఫొటో ఎవరు పంపారో, ఎందుకు పంపారో అర్థం కాలేదు. వెంటనే ఆ నెంబర్‌కి ఫోన్ చేసింది. స్విఛాఫ్. ఆ తర్వాత తన తమ్ముడికి ఫోన్ చేసింది. అతను కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసింది. స్విఛాఫ్. ఇంతకీ ఏం జరిగింది?
అన్నమయ్య జిల్లా రాజంపేటలోకి విద్యుత్‌నగర్‌కు చెందిన పైడి సుబ్రహ్మణ్యం, లక్ష్మమ్మ దంపతులకు శ్రుతి, సుధీర్ పిల్లలు. శ్రుతికి పెళ్లయింది. సుధీర్ బెంగళూరులో బీటెక్ పూర్తి చేసి, అక్కడే టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
శ్రుతి ఫోన్‌కి తన తమ్ముడి న్యూడ్ ఫొటో వచ్చిన తర్వాత చాలాసార్లు అతని ఫోన్‌కి ట్రై చేసింది. కానీ స్విఛాఫ్. ఏదో ప్రమాదం జరిగిందని అర్థమైంది. ‘తమ్ముడూ.. నువ్వు భయపడొద్దు’ అని అతనికి మెసేజ్ పెట్టింది. కానీ అతణ్నుంచి రిప్లై రాలేదు. వెంటనే తండ్రితో కలిసి బెంగళూరు వెళ్లింది. అక్కడ సుధీర్ లేడు. హాస్టల్‌లో చివరిసారిగా ఫోన్ మాట్లాడి బయటకు వెళ్లాడని, తిరిగి రాలేదని చెప్పారు రూమ్‌మేట్స్.
పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది న్యూడ్ వీడియో కాల్ ట్రాప్ అయి ఉంటుందని వాళ్లు గుర్తించారు. కొత్త నెంబర్ల ద్వారా పరిచయమైన అమ్మాయిలు అతణ్ని ట్రాప్ చేసి, న్యూడ్ వీడియోకి ప్రోత్సహించి, అనంతరం దాన్ని ఇంట్లోవాళ్లకు పంపుతామని బెదిరించి ఉండొచ్చని భావించారు. ఆ విషయం తట్టుకోలేక అతను ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్లిపోయి ఉంటాడని అన్నారు.
ఆ తర్వాత ఎన్నో ప్రాంతాలు వెతికారు. ప్రకటనలు చేశారు. కానీ సుధీర్ మాత్రం కనిపించలేదు. రెండేళ్లు గడిచిపోయాయి. ఇంకా సుధీర్ రాలేదు. అతని కోసం తల్లిదండ్రులు, అక్క ఎదురుచూస్తున్నారు. ఏ ఫోన్ వచ్చినా అది అతని నుంచే అని ఆశతో ఉంటున్నారు. ఏదైనా సమాచారం దొరికిందా అని పోలీసులను అడుగుతున్నారు. కొడుకు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో తెలియక వేదన చెందుతున్నారు. ఎప్పటికైనా అతను తిరిగి వస్తాడనే ఆశతోనే బతుకుతున్నారు.
నిత్యం మన చుట్టూ ఉన్న అనేకమంది న్యూడ్ వీడియోకాల్ బారిన పడుతున్నారు. వారు అడిగినంత డబ్బు ఇవ్వలేక అప్పులపాలవుతున్నారు. కొందరు డిప్రెషన్‌లోకి వెళ్తుండగా, మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదంతా ట్రాప్ అని వారికి తెలియదు. ఈ విషయం బయటపడితే పరువు పోతుందని, అందరూ తమను నేరస్తుడిగా చూస్తారని, తమను కామాంధుడిగా భావిస్తారని, తమ శరీరం నగ్నంగా అందరి కళ్లల్లో పడుతుందనే భయంతో కొందరు ఊరు, ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. అలాంటివారికి అందరం అండగా నిలిచి, ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది.
SOURCE: గతనెల సాక్షి పత్రికలో కథనం..!