POLITICALWAR:
అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ నిత్యం నెత్తురు చిందే ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. వేధింపులు, కక్షలు, దాడులు, దాష్టీకాలతో ఉడికిపోతోంది. హత్యలకూ వెనుకాడడం లేదు. బీహార్, బెంగాల్ తరహా హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది. రక్తపు మడుగుల వార్తలు పత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయి. రాష్ట్రం అభివృద్ధిలో పయనించాలంటే శాంతిభద్రతలు కీలకమనే మౌలిక సూత్రాన్ని గత పాలకులు, ప్రస్తుత పాలకులు విస్మరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై అసంతృప్తితో ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని మట్టికిరిపిస్తే వారి ఓటమి నుండి గుణపాఠం నేర్వని చంద్రబాబు నాయుడు సర్కార్ అదే బాటలో నడుస్తోంది.
వైఎస్ఆర్సీపీ పాలనలో శాంతిభద్రతల వైఫల్యంతో విసిగిపోయిన ప్రజలు టీడీపీకి పట్టంకడితే మేమేమీ తక్కువ తినలేదంటూ కూటమి ప్రభుత్వం కూడా హింసను ప్రేరేపించడం లేదా ఉపేక్షించడంతో శాంతిభద్రతలను నెలకొల్పడంలో పూర్తిగా విఫలమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత హింసకు పాలక, ప్రతిపక్ష పార్టీల కక్షసాధింపులే ప్రధాన కారణం. హింసపై ఈ పార్టీలు చేసుకుంటున్న విమర్శలు చూస్తుంటే ‘గురివింద’ సామెత గుర్తుకొస్తుంది. పరస్పర నిందలు, ఆరోపణల పర్వం ముగించి ఈ దాష్టికాలకు ఎప్పుడు ముగింపు పలుకుతారని సగటు పౌరుడు ప్రశ్నిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే జరుగుతున్న ఈ ఘటనలపై జనం ఆశ్చర్యపోతున్నారు. ‘‘వినాశకాలే విపరీత బుద్ధి’’ అనుకుందామన్నా ఇంత త్వరలోనే అంత పాడుకాలమా అన్నది వారి ఆశ్చర్యానికి కారణం.
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారంటే వారు అవలంబించిన పద్ధతులు నచ్చకే. అందులోనూ శాంతిభద్రతల వైఫల్యం ప్రధాన కారణం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క చాన్స్ అంటూ గెలిపించాలని కోరిన జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ఆర్ వలే రాజన్న రాజ్యం తెస్తారని ప్రజలు ఆశిస్తే అవి అడియాసలయ్యాయి. గెలిపించినందుకు తప్పదని ఐదేళ్లు భరించిన ప్రజలు 2024లో ఆయన్ని దించి చంద్రబాబును అందలమెక్కిస్తే అదే తరహా కక్షలు, దాడులు, హత్యలతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే భావన ప్రజల్లో రోజురోజుకు బలపడుతోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రూల్ ఆఫ్ లా అవలంబిస్తుందని ప్రజలు ఆశించగా, 45 రోజుల పాలన తర్వాత ప్రజలకు ఆ నమ్మకం సన్నగిల్లేలా పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి ఎన్ని ప్రణాళికలు, పథకాలను రూపకల్పనలు చేసినా శాంతిభద్రతల విషయంలో వైఫల్యం చెందడంతో అప్పటి ఇప్పటి ప్రభుత్వాల మధ్య మార్పు కనిపించడం లేదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అందబాటులోకి తెచ్చినా దౌర్జన్యాలు, దాష్టికాలతో ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంది. వినుకొండలో హత్య, తిరువూరు, పుంగునూరులో రెండు పార్టీల మధ్య ఘర్షణ వంటి ఘటనలతో పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, పగలు తీర్చుకోవడం, హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడడం చూస్తుంటే ఈ రెండు ప్రభుత్వాల మధ్య పెద్ద తేడా లేదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.
2014 -19 మధ్య చంద్రబాబు పాలనలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు, దాడులు, హత్యలు జరిగాయని ఆరోపించిన వైసీపీ నేతలు, 2019లో అధికారంలోకి వచ్చాక వాళ్లూ అదే ధోరణితో పరిపాలించారు. 2019 -24 మధ్య జగన్ హయాంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని వేధింపులు, దాడులు చేశారని విమర్శించిన టీడీపీ వారు 2024లో అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోపే అవే ఘటనలను పునరావృతం చేస్తున్నారు.
ఒకరిపై ఒకరు లెక్కలతో సహా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం తప్ప భిన్నంగా ఉండేందుకు ఏ పక్షం కూడా ప్రయత్నించకపోవడంతో రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. గతంలో వైసీపీ దాడులను ఖండిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసిన టీడీపీ ఢిల్లీలో ధర్నా నిర్వహించి, మానవ హక్కుల సంఘాన్ని సంప్రదించింది. ఇప్పుడు జగన్ కూడా అదే అడుగుజాడలో నడుస్తూ ప్రధానికి దాడులపై లేఖ రాసి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విధానాలు నచ్చకనే ప్రజలు ఏకపక్షంగా కూటమికి మద్దతిచ్చారనే విషయాన్ని మరిచిన టీడీపీ నేతలు.. మీ హయాంలో మాపై దాడులు జరగలేదాని ప్రశ్నించడం హాస్యాస్పదమే కాకుండా బాధ్యతారాహిత్యమే.
ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన అఘాయితాల్యపై టీడీపీతో పాటు వారి అనుకూల పత్రికలు గణాంకాలతో సహా ప్రచారం చేశాయి. జగన్ నాలుగేళ్ల పాలనపై టీడీపీ ‘ప్రజా చార్జ్ షీట్’ విడుదల చేస్తూ.. అందులో 73 మంది టీడీపీ కార్యకర్తలను కిరాతకంగా హత్య చేశారని, వేలాది మంది నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారని పేర్కొన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో చంద్రబాబుపై 22 కేసులు, లోకేశ్ పై 23 కేసులు, కొల్లు రవీంద్రపై 25 కేసులు, అచ్చెంనాయుడిపై 21 కేసులు, పులివర్తి నానిపై 28 కేసులు, తంగిరాల సౌమ్యపై 23 కేసులు నమోదు చేసినట్టు, 365 మంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి కస్టోడియల్ టార్చర్ చేశారని, వంద మందికిపైగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై సీఐడీ పోలీసులు 150కు పైగా కేసులు నమోదు చేశారని చెబుతున్న టీడీపీ ఇప్పుడు అవే లెక్కలతో వైసీపీకి సమాధానం చెప్పాలన్నట్టు వ్యవహరిస్తుందా అనేలా ఉన్నాయి ప్రస్తుత సంఘటనలు.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారని, 300 మందికిపైగా వ్యక్తులపై దాడులు జరిగాయని జగన్ ప్రధానికి లేఖ రాయడంతో టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన దమనకాండపై విరుచుకుపడుతోంది. ప్రతిగా వైఎస్ఆర్సీపీ నేతలు, వారి అనుకూల మీడియా చంద్రబాబు నాయుడి గత ఐదేళ్ల పాలనలో 400కు పైగా హ్యతలు జరిగాయని, వేల సంఖ్యలో దాడులు జరిగాయని ప్రచారం చేస్తోంది. మరోవైపు జగన్ పాలనలో అక్రమాలను ప్రశ్నించిన 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు జరగగా, కొందరు మృతి చెందారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన ప్రధానాంశం ఏంటంటే? ఎవరి లెక్కలను వారు ఆధారాలతో సహా బయటపెడుతున్నా ప్రజలు ఈ దాడులను హర్షించక రెండు ప్రభుత్వాలను గద్దె దింపారనే అవగాహన లేకుండా వైసిపి – టీడీపీ పార్టీలు వ్యవహరించడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరం.
జగన్ హయాంలో విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత, మాస్క్ల విషయంలో ప్రశ్నించిన డా.సుధాకర్ పై అమానవియంగా దాడులు చేయడం.. అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామ రాజును వేధించి దాడులు చేసి, ఆయనను కస్టోడియల్ టార్చర్ గురిచేయడం, టీడీపీ నేతలు పట్టాభి, బొండా ఉమ, గౌతు శిరీషలను వేధించడంతోపాటు గన్నవరం, గుడివాడ, పుంగునూరు వంటి ప్రాంతాల్లో నిత్యం రెండు పార్టీల మధ్య ఘర్షణలు సంచలనమే. చంద్రబాబు, పవన్, లోకేశ్ పర్యటనలను అడ్డుకోవడం వంటివి నిత్యం వార్తల్లో నిలిచాయి. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యస్వామిని హత్య చేసి, శవాన్ని ఎమ్మెల్సీ అనంత బాబు డోర్ డెలివరీ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఇది చాలదన్నట్లు ప్రత్యర్థులపై అక్రమ కేసులకు కొదవే లేదు.
కక్షసాధింపు ధోరణికి సంబంధించి జగన్, చంద్రబాబు ప్రభుత్వాల మధ్య అనేక సారుప్యాలున్నాయి. దాడులు, అక్రమ కేసులే కాకుండా జగన్ అధికారం చేపట్టిన వెంటనే టీడీపీ ప్రజావేదిక కూల్చివేస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని అక్రమ నిర్మాణం అంటూ తొలగించారు. అంతేకాక రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ కార్యాలయాలను టీడీపీ ప్రభుత్వం కూల్చివేసిన ఘటనలున్నాయి. రెండు ప్రభుత్వాల్లోనూ అధికారులు, మంత్రులు ఘటనల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో అయితే దాడులపై ఒక పోలీస్ అధికారి స్పందిస్తూ ప్రజల్లో కోపం ఈ ఘటనలకు కారణమన్నారు.
ప్రస్తుత ఘటనలపై విలేకరి అడిగిన ప్రశ్నకు హోం మంత్రి అనిత స్పందిస్తూ.. ‘ నేను లాఠీ పట్టుకొని తిరగాలా ‘ అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో హోం మంత్రులుగా ఉన్న సుచరిత, తానేటి వనిత, ప్రస్తుత హోంమంత్రి వలే ఆశించినంత క్రియాశీలకంగా లేరన్నది వాస్తవం.కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యర్థులపై, అధికారులపై ఆయన విరుచుకుపడుతున్నారు. దమ్ముంటే నన్ను అరెస్టు చేయండంటూ పోలీస్ అధికారులకే ఆయన సవాలు విసురుతున్నారంటే టీడీపీ అధినాయకత్వం కిందస్థాయి నాయకులు, కార్యకర్తలపై పట్టు కోల్పోతుందని రుజువవుతోంది. ఇటీవల పీపుల్స్ పల్స్ బృందం రాష్ట్రంలో పర్యటించినప్పుడు క్షేత్రస్థాయిలో దాడులపై టీడీపీ నేతలతో ప్రస్తావించగా ‘‘వైసీపీ పాలనలో మాపై కేసులు నమోదు చేశారు, దాడులు చేశారు. పార్టీ అధినేతలకు మా బాధలేమి తెలుసు’’ అని ఆగ్రహంగా స్పందించారు. దీన్ని పరిశీలిస్తే పార్టీ అధినాయకత్వానికి కిందస్థాయి వారికి సర్ది చెప్పడం సులభతరం కాదని అర్థమవుతోంది.
ఈ రెండు పార్టీలు రాష్ట్రాభివృద్ధి కంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడానికే ప్రాధాన్యతిస్తున్నాయి. గతంలో జగన్ పాలనను ‘రాజారెడ్డి రాజ్యాంగం’, ‘పులివెందుల రాజ్యాంగం’ అని టీడీపీ విమర్శించగా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ‘రెడ్ డైరీ’ పాలన అని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. నారా లోకేశ్ ‘రెడ్ డైరీ’ని టీడీపీ శ్రేణులు స్ఫూర్తిగా తీసుకొని రెచ్చిపోయే అవకాశాలున్నాయి. ‘రెడ్ డైరీ’పై రాష్ట్రంలో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేయడమే దీనికి తార్కాణం. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకుండా కుట్రలు చేస్తూ రాష్ట్రాన్ని అభాసుపాలు చేసేలా వ్యవహరిస్తున్నారని ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నారు కానీ, రాష్ట్రాభివృద్ధిపై ఇరు పక్షాలకు ఆసక్తి లేదని ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రతీది రాజకీయ కోణంలో చూసే వీరి తీరుతో చివరికి ప్రజలే నష్టపోతారు.
2019లో 23 స్థానాలు గెలిచిన టీడీపీపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టి 2024లో 11 స్థానాలకే పరిమితమైందని కూటమి గమనించాలి. చంద్రబాబును అరెస్టు చేసి కూటమి ఏర్పాటుకు బాటలు వేసిన జగన్ తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఇటీవలి వినుకొండ ఘటన తర్వాత అక్కడికి పరామర్శకు వచ్చిన జగన్ కి వచ్చిన ప్రజాదారణ ఒక హెచ్చరికలాంటిదని కూటమి ప్రభుత్వం గమనించాలి. ఈ కక్షసాధింపు దాడులకు ఎక్కడో ఒక చోట పులిస్టాప్ పడకపోతే రాష్ట్రం నిత్యం రావణకాష్టంలా తగలబడుతూనే ఉంటుంది. ఇప్పుడు తమ వారిపైన జరుగుతున్న దాడులపై గళమెత్తుతున్న జగన్ తన పాలనలో జరిగిన దాడులపై గొంత్తెతి ఉంటే బాగుండేదనేది సగటు ప్రజాభిప్రాయం. తన హయాంలో వాటిని కంట్రోల్ చేసుంటే ఇప్పుడాయనకి మాట్లాడే హక్కు ఉండేది. ప్రస్తుత ఘటలనపై చంద్రబాబు నాయుడు ఉక్కుపాదం మోపకపోతే భవిష్యత్తులో ఆయన కూడా ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోతారు. అంతకన్న ముందు ప్రజాదరణ కోల్పోతారు.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న దురదృష్టకర దాడులను చూస్తుంటే ఘటనలు పాతవే. నెత్తుటి చారికలవే. పాత్రదారులు మాత్రమే మారారు. జాతీయ పార్టీలని కాదని ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రంలో ఆదరణ లభించడానికి ప్రధాన కారణం రాష్ట్రాభివృద్ధికి ఈ పార్టీలు కృషి చేస్తాయని. అయితే వ్యక్తిగత కక్షలు, పగలతో పాలన సాగిస్తే ప్రజలకు ఏహ్యభావం ఏర్పడి తిరిగి వారు జాతీయ పార్టీలే మేలు అనుకోవచ్చు. కక్షసాధింపు చర్యలు పార్టీ శ్రేణుల్లో తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా ప్రజలు వీటిని అసహ్యించుకుంటారని, దీర్ఘకాలికంగా నష్టం తప్పదని అన్ని పార్టీలు గమనించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకునే బదులు ముందస్తుగానే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కష్టమైనా సొంత పార్టీ నేతలను, కార్యకర్తలను హెచ్చరిస్తూ తగిన చర్యలు తీసుకుంటే ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు వెళ్తాయి. లేకపోతే భవిష్యత్తులో నష్టం తప్పదు. రాష్ట్రంలో ప్రముఖ మీడియా సంస్థలు కూడా పార్టీలకు కొమ్ముకాస్తూ హింసాత్మక ఘటనలపై పక్షపాత వైఖరితో వార్తలను వండి వార్చడం విచారకరం.
అధికారంలో ఉన్నప్పుడు తమది దాడికి ప్రతిదాడి మాత్రమే అంటూ కక్షసాధింపు చర్యలకు ప్రాధాన్యతిస్తే ప్రజలు సమయం వచ్చినప్పుడు ఈ దాష్టికాలపై తగిన విధంగా స్పందించి గుణపాఠం, బుద్ధి చెబుతారని గత చరిత్రలు చెబుతున్నాయి. కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీ పార్టీలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లి వీటిని ఉక్కుపాదంతో అరికట్టాలని సూచించకపోతే అందరూ నిండా మునగడం ఖాయం. శాంతిభద్రతలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందా..? లేక ధృతరాష్ట్రుడి వైఖరి అవలంబిస్తుందా..? అన్నది వారి విజ్ఞతకే వదిలేసి, తగిన సమయంలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం.
=================
– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.