ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్):
తెలుగు రాజకీయ చరిత్రకు కింజరాపు ఎర్రన్నాయుడు చేసిన గొప్ప కాంట్రిబూషన్…. తనయుడు రాంమోహన్ నాయుడును, వారసుడిగా తన పరోక్షంలో అందించడం. తండ్రి సద్గుణాలన్నీ పుణికి పుచ్చుకున్న రాంమోహన్ నాయుడు రాజకీయంగా తనను తాను రూపుదిద్దుకుంటున్న తీరు, పొందిన పరిణతి, అలవర్చుకున్న సంస్కృతి, చిన్న వయసులోనే సాధించిన, సాధిస్తున్న ఘన విజయాలు చూడలేకపోవడం ఎర్రన్న (ఆత్మీయులు ఆయన్నలా పిలుచుకునేది) దురదృష్టం! కానీ, రామ్మోహన్ వంటి ప్రయోజకుడైన కొడుకును కని, పెంచి, పెద్ద చేసిన ఎర్రన్నాయుడు తండ్రిగా ఎంతో అదృష్టవంతుడు. జన్మ సాఫల్యత పొందినవాడు. సచ్చి ఏ లోకంలో ఉన్నాడో కాని, ఆయన ప్రతి క్షణం సంతోషం-సంతృప్తితో గర్వించదగిన రాజకీయ విలువల వారసత్వాన్ని మన తెలుగువారికి ఆయన అందించి వెళ్లారు.
తండ్రి పేరు నిలుపడమే కాదు, తన పేరు భారత రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోగల లక్షణాలు, సద్గుణాలు పుష్కలంగా వున్నవాడు రామ్మోహన్ నాయుడు. 37 ఏళ్ల వయసులోనే… ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు అత్యున్నత విధాన నిర్ణాయక వేదిక లోక్ సభకు మూడో సారి ప్రాతినిధ్యం వహించడమే కాక క్యాబినెట్ మంత్రిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దాదాపు దశాబ్ద కాలంగా ఆయన్ని నే గమనిస్తున్నాను. పొలిటికల్ రిపోర్టింగ్ లో సుదీర్ఘకాలంగా ఉండటం వల్లనేమో.. కాస్త క్రిటికల్ ఇవాల్యుయేషనే చేస్తుంటా ఎవరినైనా. అలా లెక్కేసినా రామ్మోహన్ లో నేనెన్నో పాజిటివ్ అంశాలు చూశాను. ఎంత ఎదిగినా మారని ఆ అణకువ-నిలకడ నాకు నచ్చాయి. ముఖ్యంగా సద్యోచన (positive thinking) అపారం.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల భాషా నైపుణ్యం, భావ స్పష్టత, విషయ పరిజ్ఞానం…. అరుదైన మేళవింపు ఆయన సొంతం. ఢిల్లీకి-గల్లీకి ఓ రాజకీయ అనుసంధాన నమూనా ఆయన అనిపిస్తుంది. ఏ స్థాయి వారైనా, మనుషులకు స్పందించే తీరు, తనను కలవడానికి వచ్చే వారిని రిసీవ్ చేసుకునే రామ్మోహన్ పద్దతి కూడా ఎంతో ఆదర్శప్రాయం.
లోక్ సభ ఒక టర్మ్ (2019-24)లో … జాతీయ సగటు (84%) కంటే ఎక్కువ (90%) హాజరీతో, జాతీయ సగటు (49) కంటే ఎక్కువ (69) ప్రశ్నలడుగుతూ, జాతీయ సగటు (14.5) కంటే ఎంతో ఎక్కువగా పార్లమెంటరీ చర్చల్లో (34) పాల్గొన్న ఉత్సాహం-నిబద్దత ఆయనది. అదే ఉత్సాహం…. పార్టీ కార్యకలాపాల్లో, నియోజకవర్గ వ్యవహారాల్లో, జనం మధ్యలో ఉన్నపుడూ గమనించా. మొదటి సారి ఆయన్ని కలిసినపుడు, అప్పటికే నా దృష్టికి వచ్చిన చాలా చాలా విషయాలని సందేహాలకతీతంగా దృవీకరించుకోగలిగాను.
2012, ఓ రోడ్డు ప్రమాద దుర్ఘటన క్రమంలో ఎర్రన్న తనువు చాలించడంతో రామ్మోహన్ రాజకీయాల్లోకి వచ్చారు. పలుకుబడి, ప్రజాదరణే కాక సంపద్వంతమైన
రాజకీయ కుటుంబ నేపథ్యం…. నేటి మెజారిటీ రాజకీయ యువతరాన్నిచెరచినట్టు, తప్పుడు మార్గాన నడిచేలా చేయకపోవడమే ఆయనకు కలిసొచ్చిన వరం/ఎదుగుదలకు ఓ ముఖ్య కారణం.
వారసత్వం ఒక శుభారంభాన్ని ఇచ్చినంత మాత్రాన… స్వయంగా ఎదిగి, తమదైన స్థానాన్ని సుస్థిరపరచుకోలేక చతికిలపడ్డ, కనుమరుగైన వారెందరు లేరు? ఎర్రన్నాయుడు ఎంతో పద్దతి, క్రమశిక్షణ, శ్రమించే తత్వం కలిగిన వారు. ‘ఈనాడు’ ఢిల్లీ బ్యూరో చీఫ్ గా పార్లమెంటుకు వెళ్తూ అతి సమీపంగా నేనాయన పనితీరును చూశాను. తండ్రి ఎర్రన్న సాత్విక గుణం, ప్రజలతో మమేకం, విలువల జీవన శైలి ప్రభావితం చేశాయేమో… రామ్మోహన్ ఉన్నత చదువులు ఆయనలో వినయం, విధేయత, అణకువ, శ్రమతత్వం వంటి మంచి లక్షణాలనే పెంచాయి. దారితప్పుతున్న భారత రాజకీయ గమనానికి ఆయన పంథా, యువతరం పరంగా ఓ ఆశావహ దశ-దిశ!
శ్రీకాకుళంలో ప్రాధమిక విద్య తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదువు, అనంతరం అమెరికా వెళ్లి రెండు వేర్వేరు యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్, బిజినెస్ డిగ్రీ-మాస్టరీ లు చదివారు. సింగపూర్ లో ఓ యేడాది ఉద్యోగం చేశారు. ఇక…వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ గా ప్రజాక్షేత్రం నుంచి ఎన్నికై వచ్చిన ఎర్రన్నాయుడు రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఆయన తమ్ముడు, రామ్మోహన్ కి బాబాయ్ అయిన అచ్చెన్నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మంత్రి. నిన్నటి వరకు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడాయన. రామ్మోహన్ సొంత అక్క భవాని, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలే కాకుండా తానూ స్వయంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే (2019-24)గా వున్నారు. అదే నియోజకవర్గానికి ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్యే. రామ్మోహన్ సతీమణి బండారు శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణ మూర్తి ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేసి, ప్రస్తుతం మాడుగుల ఎమ్మెల్యేగా వున్నారు. ఇంతటి బీరకాయ పీచు రాజకీయ నెట్వర్క్ వుండీ… అన్ని స్థాయిలవారితో మర్యాదగా నడచుకోవడం రామ్మోహన్ నేర్చుకొని, అలవర్చుకున్న సంస్కృతి. ఇప్పుడాయన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్ సభలో పార్టీ నాయకుడు, కేంద్ర ఎన్డీయే ప్రభుత్వంలో పౌరవిమానయాన శాఖ మంత్రి. ఐక్యరాజ్యసమితి (యూఎన్) జనరల్ అసెంబ్లీకి హాజరై, భారత్ ప్రతినిధిగా 72 వ సెషన్ (22వ భేటీ)లో “నిరాయుధీకరణ”పై ప్రసంగించి వచ్చినవాడు. ఏ స్థాయికి ఎదిగినా శ్రీకాకుళం, టెక్కలి, స్వగ్రామం, తన వాళ్లు అనే మూలాలు మరవని వాడు. ప్రభుత్వ అధినేత ప్రధాని మోదీ, పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు లకు ఎంత మర్యాద ఇస్తారో, నియోజకవర్గ సాధారణ పౌరుడికీ అంతే మర్యాద ఇచ్చే సద్గుణం ఆయనలో వుందని ఆ జిల్లాకు చెందిన నా మితృడు, సీనియర్ జర్నలిస్టొకరు చెప్పినపుడు నాకు రోమాలు నిక్కుపొడిచాయి, ఆయనంటే అభిమానం ఇంకొంచెం పెరిగింది.
ఇదంతా చదువుతున్న వారికి, నేనేదో రామ్మోహన్ నాయుడిని అసాధారణంగా పొగిడేస్తున్నట్టు అనిపించవచ్చు. కానీ, ఇవన్నీ వాస్తవాలు. లోపాలను పట్టుకొని విమర్శించడం కన్నా సద్గుణాలను తీసుకొని పొగటానికే… ఒకటికి రెండుసార్లు ఆలోచించే వాడిన్నేను. రామ్మోహన్ నాయుడిలో ఇంకా వున్నవేవైనా, నాకు తెలియక, రాయలేదేమో…. కానీ, రాసినవేవీ అబద్దాలు కావు, ఆయనలో లేనివేవీ నేను ఇక్కడ రాయలేదు. వారసులుగానో, స్వయంగా ఎదిగో… యువతరం కొత్తగా రాజకీయాల్లోకి పెద్ద సంఖ్యలో వస్తున్న కాలమిది. రామ్మోహన్ని చూసి నేర్చుకోవాలె!
సమాజం పట్ల అవగాహన, రాజ్యాంగం పట్ల నిబద్దత, విషయాలు గ్రహించగల తెలివి తేటలు, పౌరుల పట్ల శ్రద్ద మర్యాద, ఓపిక, శ్రమించే తత్వం, కొంచెం విలువలు, ఇంకొంచెం పద్దతులు…. ఇవి వుంటే, చాలు మీ మీద మాకు గౌరవం అమాంతం పెరిగిపోతుంది. ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టి, సమాజం బాగుపడుతుందనే ఆశ మాలో బలపడుతుంది. ఆ దారిలో రామ్మోహన్ నాయుడు ఓ వెలుగు కిరణం.