National: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..

National:

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారిని పార్టీ శాసనసభా పక్షం అధికారికంగా ఎన్నుకుంది. కోల్‌కతాలోని విశ్వబంధు కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ సువేందు అధికారి పేరును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించగా, శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది.

బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీకి ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగిన సువేందు అధికారి, నందిగ్రామ్ ఉద్యమం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత పార్టీ బలపర్చడంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆయనకు సీఎం పదవి దక్కింది.

ఇక కొత్త ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులను నియమించాలని కూడా బీజేపీ నిర్ణయించింది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. డిప్యూటీ సీఎంల పేర్లపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

 కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు.

బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సువేందు అధికారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది.

Optimized by Optimole