2024లో మళ్లీ మోదీయే అంటున్న అరవింద్‌ పానగడియా..

2024లో మళ్లీ మోదీయే అంటున్న అరవింద్‌ పానగడియా..

Nancharaiah merugumala:(senior journalist)

“2024లో మళ్లీ మోదీయే అంటున్న అరవింద్‌ పానగడియా.. కాంగ్రెస్‌ రాయపుర్‌ ప్లీనరీ హామీలు చూస్తే..ఓట్లన్నీ చేతి గుర్తుకే పడాలి “

‘‘ 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీయే మూడోసారి కూడా విజయం సాధిస్తారు. పాలకపక్షంపై ఉండే వ్యతిరేకత మోదీపై ప్రజల్లో లేదు. మోదీకి ప్రజాదరణ పెరిగింది. ప్రతిపక్షాలు మరింత చీలిపోయి ఉన్నట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన మరుగుదొడ్లు, జన్‌ ధన్‌ బ్యాంకు ఖాతాలు, మంచి నీటి కుళాయిల కనెక్షన్లు–ఈ మూడు అంశాలూ మోదీ మరో విజయానికి దారితీస్తాయి. 2014 నుంచీ స్వచ్ఛ భారత్‌ పేరుతో మొదలెట్టిన కార్యక్రమం కింద అవసరమైన కుటుంబాల కోసం ఇప్పటి వరకూ 62 లక్షల 81 వేల మరుగుదొడ్లు కట్టారని, ఆరు లక్షలకు పైగా సామూహిక టాయలెట్లు నిర్మించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వంద కోట్ల మొబైల్‌ ఫోన్లు ఉన్న నేపథ్యంలో ఆధార్‌ నంబర్లతో జన్‌ ధన్‌ యోజనా కింద ఖాతాలు లేని ప్రజల కోసం తెరచిన దాదాపు 48 కోట్ల బ్యాంకు అకౌంట్లు అవినీతిని తగ్గించి పేదలకు ప్రయోజనం కల్పిస్తున్నాయి. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు దోహదం చేసే మూడో కారణం ప్రభుత్వ నిర్వహణలోని నల్‌ సే జల్‌ (పైపుల ద్వారా మంచి నీరు సరఫరా) పథకం. దేశంలో ఇప్పటికి ఈ స్కీము కింద మూడు కోట్లకు పైగా మంచి నీటి కొళాయి కనెక్షన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చారు. మంచి నీటి కనెక్షన్లు లేని మిగిలిన ఇళ్లకు కూడా 2024 ఎన్నికల నాటికి వాటిని ఇవ్వాలనే పట్టుదలతో కేంద్ర సర్కారు పనిచేస్తోంది. ఈ మూడు పథకాల వల్ల నేరుగా లబ్ధి పొందుతున్నది మహిళలే. పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి అలవాటు పడిన స్త్రీలే రేపటి ఎన్నికల్లో ఇంట్లోని అన్ని ఓట్లు ఏ పార్టీకి వేయాలో నిర్ణయిస్తారు.’’


ఈ అభిప్రాయాలు ప్రఖ్యాత భారత–అమెరికన్‌ అర్థికవేత్త, ప్రపంచ ప్రసిద్ధ కొలంబియా యూనివర్సిటీ (న్యూయార్క్‌) ప్రొఫెసర్‌ అరవింద్‌ పానగడియావి. బ్రిటిష్‌ వారి పాలనలో నల్లమందు వ్యాపారం చేసిన రాజస్థాన్‌ వైశ్య కుటుంబంలో జన్మించిన పానగడియా కొన్నేళ్ల క్రితం నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2014, 2019 భారత పార్లమెంటు ఎన్నికల ముందు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తందని పానగడియా అంచనా వేశారు.
కాంగ్రెస్‌ రాయపూర్‌ పీనరీ నిర్ణయాలు చూస్తేనేమో…….
హిందూ బడుగు వర్గాలు, మైనారిటీల ఓట్లు అత్యధిక శాతం హస్తానికే పడాలి!

మోన్నీమధ్య ఛత్తీస్‌ గఢ్‌ రాజధాని నవ రాయపుర్‌ లో జరిగిన కాంగ్రెస్‌ 85వ ప్లీనరీ మహాసభల నిర్ణయాలు చూస్తే–మనలాంటి సామాన్య ప్రజానీకానికి గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ (జీఓపీ) గెలుపు ఖాయమేమోననే అనుమానంతో కూడిన భయం వేస్తుంది. ఎందకంటే ‘సామాజిక న్యాయం’ విషయంలో ఈ ప్లీనరీ చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంది. పార్టీ దళిత అధ్యక్షుడు ఎం.మల్లికార్జున ఖర్గే నెహ్రూ–గాంధీ కుటుంబానికి అత్యంత విధేయత గల సేవకుడిగా మరోసారి ప్లీనరీ వేదికపై నిరూపించుకున్నారు. బవిరి గడ్డంతో మెరిసిపోతున్న పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత జోడో యాత్ర కాంగ్రెస్‌ పార్టీకి మార్గదర్శనం చేసిందని మల్లన్న వెల్లడించారు. ఇక పార్టీ నిర్ణయాల విషయానికి వస్తే–కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ..ప్రత్యేకంగా వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కోసం ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జాతీయ సామాజిక న్యాయ మండలి ఏర్పాటు, వార్షిక కేంద్ర బజట్‌ సమర్పణకు ముందు వచ్చే జాతీయ ఆర్థిక సర్వే మాదిరిగా ‘సామాజిక న్యాయ పరిస్థితి’పై వార్షిక సర్వే నివేదిక ప్రచురణ, ఉన్నత న్యాయస్థానాల్లో (సుప్రీంకోర్టు, హైకోర్టులు) ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లు, బడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల రక్షణ కోసం రోహిత్‌ వేముల చట్టం చేయడం వంటి హామీలు నిజంగా చాలా గొప్పగా కనిపిస్తున్నాయి.

సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాడ్రా, మల్లికార్జున ఖర్గేలకు జనంలో విశ్వసనీయత ఉంటే పైన చెప్పిన హామీలను దేశంలోని బహుజనులు నమ్మి తీరాలి. అదే జరిగితే 18వ లోక్‌ సభ ఎన్నికల్లో అంటే 2024లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునే స్థితికి చేరుకోవాలి. 2019 ఎన్నికల్లో కూడా–అవసరమైన ప్రజలకు కనిష్ఠ ఆదాయం సమకూర్చే ‘న్యాయ్‌’ అనే నగదు బదిలీ పథకం ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి కాంగ్రెస్, రాహుల్‌ బృందం బోర్లాపడ్డాయి. మరి ఈసారి జనం రాయపుర్‌ డిక్లరేషన్‌ నమ్ముతారా? కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్‌ చెప్పినట్టు మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠమెక్కించి జవాహర్‌ లాల్‌ నెహ్రూ రికార్డును పగలగొట్టే అవకాశం ఇస్తారా? అనేది తేలిపోడానికి ఇంకా 14–15 నెలల సమయం ఉంది.