తెలంగాణ రాజకీయ నేతల్లో టికెట్ల టెన్షన్..టెన్షన్..!

బొజ్జ రాజశేఖర్ ( సీనియర్ జర్నలిస్ట్): తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. దీంతో టికెట్ల ఆశిస్తున్న ఆశావాహుల్లో టెన్షన్‌ మొదలయ్యింది.పార్టీ  టికెట్‌ వస్తుందా ..?రాదా..? అన్న  టెన్షన్ అధికార పార్టీ సిట్టింగ్‌ల్లో కలవరానికి గురిచేస్తోంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో  నెలకొన్న టికెట్ల పోటీ ఆశావాహులను ఉత్కంఠ నడుమ  నిలబెట్టింది. బీజేపీలో అవసరమైన చోట్ల అభ్యర్థులు లేరు. ఉన్న చోట ఆశావాహుల్లో పోటీ ఉంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల నుంచి టికెట్లు రానివారు బీజేపీలోకి ఎప్పుడెప్పుడు వస్తారా..? అని ఎదురు చూస్తున్నారు. మిగిలిన పార్టీలు అనుకూల ప్రాంతాల్లో పోటీ చేసే అభ్యర్థుల వేటలో ఉన్నారు. మూడు నాలుగు నెలల్లో వెలువడనున్న ఎన్నికల నోటిఫికేషన్‌ లోపే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు అలోచిస్తున్నాయి.

 

టికెట్ల కేటాయింపు ..ఒత్తిడిలో అధికార పార్టీ..

తెలంగాణలో రెండుమార్లు అధికారంలో కొనసాగుతన్న బీఆర్‌ఎస్‌ హ్యట్రిక్‌ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై కొద్దిపాటి వ్యతిరేకత ప్రజల్లో  చోటు చేసుకుంది. 119 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్‌లుగా కొనసాగుతున్న వారిలో వందమంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిలో 30 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అవినీతి, భూ కబ్జాలు, పనుల్లో కమీషన్లు, రౌడీల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  వీరికి టికెట్లు ఇవ్వడానికి బదులు కొత్తవారికి టికెట్లు ఇవ్వాలనే అలోచనల్లో బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులకు బదులు ఇతర పార్టీల్లో బలమైన అభ్యర్థులను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి విడుతలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనపై బీఆర్‌ఎస్‌ నాయకులతోపాటు ఇతర పార్టీలు ఎదురు చూశాయి. అభ్యర్థులను ఫైనల్‌ చేయడానికి కేటీఆర్‌ విదేశాల పర్యటన వాయిదా వేసుకున్నారు. అంటే అభ్యర్థుల ప్రకటన అధికార పార్టీకి కష్టంగా మారింది. 80 మంది అభ్యర్థులను ప్రకటించాలని భావించింది. శ్రావణమాసం ప్రారంభం రోజు 17న అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తారని అందరు భావించారు. కాని అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అభ్యర్థుల లిస్టు ప్రకటన అలస్యమైమయ్యే పరిస్థితి నెలకొంది. ప్రకటించే అభ్యర్థుల జాబితాల్లో సిట్టింగ్‌లు ఎంత మంది ఉంటారనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. మొదటి జాబితాల్లో కొత్తమోహాలు ఉండే అవకాశాలు తక్కువేనని భావించవచ్చు. ఇప్పటికే అధికార పార్టీ జనగామ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్టు ఇవ్వొద్దని, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావుకు ఇవ్వాలని హైదరబాద్‌లోని హరితలో సమావేశం ఏర్పాటు అధికార పార్టీలో కలకలం రేపింది. మంథని నియోజకవర్గం నుంచి పుట్టమధుకు టికెట్‌ ఇవ్వొద్దని ముత్తారంలో అధికార పార్టీ నాయకులు ధర్నా చేయడం కూడ అధికార పార్టీకి తల నొప్పిగా మారింది. సిట్టింగులకు టికెట్లు కేటాయించవద్దనే డిమాండ్‌ చాల నియోజకవర్గాల నుంచి వినిపించే  అవకాశాలు మెండుగా ఉన్నాయి.  క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనే అలోచనల్లో అధికార పార్టీ..?, టికెట్‌ రాకుంటే ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయాలని సిట్టింగ్‌లు సమాలోచనలు చేస్తున్నట్లు  ప్రచారంగా జరుగుతుంది. ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ కన్న.. ఆశావాహుల మధ్య ఎక్కువ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఎవ్వరి చేతుల్లో టికెట్లు..?

కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల కోసం  చాల మంది ఆశావాహులు ఉన్నారు. ఒకటి ,రెండు స్థానాల్లో మినహా అన్ని నియోజకవర్గాల్లో టికెట్‌ నాకంటే నాకు అనే వారి సంఖ్యఅధికంగా ఉంది. టికెట్ల కేటాయింపు అంశం ఢీల్లీ చేతిలో ఉంది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ ఈ నెల 18 నుంచి 25 వరకు టికెట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు ఇవ్వడానికి రుసుం పెట్టాలని భావిస్తున్నారు. దరఖాస్తుల కోసం స్క్రూటీ కమిటీని ఏర్పాటు చేశారు. మరో పక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్లతోపాటు జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గె.. ఇతర నాయకులతో బహిరంగ సభలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నెల చివరి నాటికి అభ్యర్థుల ప్రకటన చేయాలని హస్తం పార్టీ భావిస్తోంది.

అన్నింటా వెనకే.. 

తెలంగాణలో కాశాయం ఊపు తగ్గిందా..? అంటే నిజమనే అన్పిస్తోంది. తెలంగాణలో అన్ని పార్టీలను ఊరుకులు పరుగులు పెట్టించిన బీజేపీ డీలా పడింది అనే వారే అధికంగా ఉన్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా..? అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పార్టీ అదిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. పోటీ చేసే స్థానాల్లోని అభ్యర్థుల ఎంపికకు గెలుపు గుర్రాలు లేరు. ఉన్నవారిని ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. ఢీల్లీ అధినేత రూట్‌ మ్యాప్‌లో భాగంగా తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని సీనియర్‌ నాయకులు అంటున్నారు. అధికార బీఆర్‌ఎస్‌పై గెలువడం కన్నా.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగేఅసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో  బీజేపీలో అభ్యర్థుల జాబితా ఇప్పటికి లేనట్టే అని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గేలిస్తే.. నిలుస్తారు…

తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. వీటితోపాటు రాబోయే అసెంబ్లీలో ఎంఐఎం, బీఎస్‌పీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌ సీపీ షర్మిల పార్టీ, కోదండరాం పార్టీ, జన సేన లాంటి పార్టీలు తమ అభ్యర్థులను పోటీలోకి దించనున్నాయి. ఎంఐఎం పార్టీ వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల మినహ మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన గెలిచి అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇదే తీరులో మిగిలిన పార్టీల పరిస్థితి ఉంటుంది. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే  ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపు  రాజకీయ పార్టీల భవితవ్యాలను మార్చగలవు. గెలుపు గుర్రాల పై ప్రధాన పార్టీలు  ప్రత్యేక దృష్టి సారించకపోతే  పరిస్థితి తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదు.

You May Have Missed

Optimized by Optimole