అట్టహాసంగా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ..

Revanthreddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రులుగా మరో 11 మందితో గవర్నర్ తమిళి సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎల్బీ స్టేడియంలో అతిరధ మహారధులు సమక్షంలో రేవంత్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఏఐసీసీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హిమాచల్ ప్రదేశ్ సిఎం , తదితరులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేసిందన్నారు.దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని..ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని రేవంత్ స్పష్టం చేశారు.అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనిందన్నారు.ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని తెలిపారు. ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.