Tollywood: Background Artistsని సరిగా గమనించకపోతే మొత్తం సన్నివేశాన్ని చెడగొడతారు..

విశీ( సాయి వంశీ) : 

ఇటీవల రాజమౌళి & సందీప్‌రెడ్డి వంగ ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో Background Artists గురించి మాట్లాడారు. నాకు ఆ టాపిక్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. మలయాళ సినిమాలో Background Artists గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారని, ఒక సన్నివేశంలో ప్రధాన తారాగణంతో పాటు వెనకాల ఉండే జూనియర్ ఆర్టిస్టులు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయంలోనూ బాగా శ్రద్ధ చూపుతున్నారని మాట్లాడుకున్నారు. బహుశా ఎక్కడా చర్చకు రాని అంశాన్ని వాళ్లు చర్చలోకి తెచ్చారు.

 Background Artists అనగానే నాకు ‘స్వాతికిరణం’ సినిమాలో ‘ఆనతినీయరా హరా’ పాట చిత్రీకరణ అంతా గుర్తొచ్చింది. మహదేవన్ గారి సంగీతం, వాణీ జయరాం గారి గానం అద్భుతం. ఎటొచ్చీ చిత్రీకరణ విషయంలో అతి పెద్ద పొరపాటు కనిపిస్తూ ఉంటుంది. అది ఎవరైనా గుర్తించారో, లేదో తెలియదు. Background Artistలను సరిగ్గా డైరెక్ట్ చేయకపోవడం వల్ల జరిగిన పొరపాటు అది. చాలా చిన్నదే అయినా, చూస్తే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

మంజునాథ్ పాట పాడుతూ ఉంటూ, చుట్టూ ఉన్న వాయిద్య బృందం తమ తమ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్లు ఎలా కనిపించాలి? వయోలిన్ శబ్దం వచ్చినప్పుడు మాత్రమే వయోలిన్ వాయించే వ్యక్తి వాయించాలి. ఫ్లూట్ శబ్దం వినిపించినప్ఫుడు మాత్రమే అతను దాన్ని నోటి దగ్గర పెట్టుకోవాలి. కానీ మీరు పాట వింటూ వాళ్ల వంక చూడండి. ఫ్లూట్ వాయించే వ్యక్తి మొత్తం పాటంతా దాన్ని నోటి దగ్గిరే పెట్టుకొని వాయిస్తున్నట్టు నటించాడు. వయొలిన్ వాయించే వ్యక్తి ఆ శబ్దం రాని టైంలో కూడా వాయిస్తున్నట్టే కనిపిస్తాడు. ఒక కచేరీలో మొత్తం ‌సేపు అలా నోటి దగ్గరే ఫ్లూట్ పెట్టుకొని, వయోలిన్ వాయిస్తూ ఎవరూ ఉండరు. తమ అవసరం లేనప్పుడు ఖాళీగా ఉంటారు. ఈ పాటలో అలా ఉండదు. మొత్తం పాటంతా అందరూ వాయిస్తున్నట్టే ఉంటుంది. చాలా సూక్ష్మంగా చూస్తే అర్థమయ్యే విషయం ఇది. Background Artists ఏం చేస్తున్నారో చూసుకోకపోతే జరిగే పొరపాటు.

సినీ రచయిత డి.వి.నరసరాజు గారు తన ‘అదృష్టవంతుని ఆత్మకథ’ పుస్తకంలో ఒక సంఘటన వివరించారు. ఒక లాయర్ గారికి నాటకాలంటే విపరీతమైన ఇష్టం. తన ఊరికి ఏ పెద్ద రంగస్థల నటుడు వచ్చినా వారి ప్రదర్శన ఏర్పాటు చేసి, తనూ ఆ నాటకంలో ఏదో ఒక పాత్ర పోషించేవారు. ఒకసారి ఒక పెద్ద నటుడు ఆ ఊరికి వస్తే ఆయన నాటకం ఏర్పాటు చేశారు. అందులో ఈ లాయర్ ఒక పనివాడి పాత్ర పోషించారు. ఈ లాయర్‌కి చర్మవ్యాధి. మాటిమాటికీ తొడలు గోక్కోవడం అలవాటు. స్టేజీ మీద ఆ నటుడు నటిస్తూ ఉంటే, పక్కనే పనివాడి పాత్రలో ఉన్న లాయర్ మాటిమాటికీ తొడలు గోక్కుంటూ ఉన్నారు. ఇది చూసి జనం నవ్వుతూ ఉన్నారు. ఆ నటుడికి విషయం అర్థమైంది. తర్వాత సన్నివేశంలో కావాలని ఆ లాయర్ రెండు చేతుల్లో రెండు కొవ్వొత్తులు పట్టుకునేలా చేశాడు. అలా అయితే గోక్కునేందుకు అవకాశం ఉండదని అనుకున్నాడు. ఆ లాయర్ గారు కాసేపు ఓపిగ్గా భరించి, ఆ తర్వాత ఇక భరించలేక కొవ్వొత్తులు పక్కన పెట్టి తనివితీరా గోక్కున్నారు. జనం అంతా తెగ నవ్వుకున్నారు.

 Background Artistsని సరిగా గమనించకపోతే మొత్తం సన్నివేశాన్ని చెడగొడతారు అనేందుకు ఓ ఉదాహరణ ఇది.