Balagopal: స్మరిస్తేనే రోమాలు నిక్కపొడుస్తాయ్.. కారణజన్ముడికి నివాళి..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్):

ఎవరితోనూ పోల్చలేని వ్యక్తి బాలగోపాల్.
నలుగురికి ఉపయోగపడే పనికి ప్రతిరూపం ఆయన.సమస్యను సమ్యక్ దృష్టితో చూడ్టం, అర్థంచేసుకోపడం, అందరికీ అవగాహన కలిగించడం, సమాధానాలు-పరిష్కారాల కోసం ఉద్యమీకరించడం… ఇలా తాను ఆచరిస్తూ, ఉదాత్త నేతృత్వంతో హక్కులకై పోరాడే ఒక తరాన్నే తయారుచేసిన కర్మయోగి!
ఆయన ఆలోచనల బలం,
తాత్విక దృష్టి విశాలత్వం,
ఆచరణలోని నిబద్దత…
ఎందరెందరినో ప్రభావితం చేసి, అభిమానులుగా, హక్కుల కార్యకర్తలుగా జేసింది. అణచివేత, నిర్బంధం, పీడన, హక్కుల భంగం, హింస….. ఎక్కడ, ఎప్పుడు, ఎవరివల్ల, ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించి, నిశితంగా ఖండించి, నిరసించి, గొంతెత్తి, పోరాడి, ఉద్యమించిన పోరాట యోధుడాయన! కల్లోల కశ్మీర్ పై సమగ్ర నివేదిక రూపొందించినా, ఉపాధి కోల్పోయిన కార్మికుల గురించి కరపత్రం రాసినా…. అదే నిష్ట! మూలం హక్కుల స్పృహ!

మా ‘పీపుల్స్ పల్స్’ ఆఫీస్ లో ఓ ఇరవైకి పైగా బాలగోపాల్ రాసిన పుస్తకాలుంటాయి. మూడు దశాబ్దాలకు పైబడిన కాలపు వివిధ సందర్భాల కరపత్రాలు, ప్రకటనలు, వ్యాసాలు, ప్రసంగాలు, నివేదికలు, తదితరాల సంకలనాలు ఆ పుస్తకాలు. సంస్థలోనియువ జర్నలిస్టులు, రిసర్చర్లకు నేను చెబుతుంటాను, “అందులో ఏ పుస్తకమైనా…. తెరచి, ఏ పేజీ నుంచయినా, మరే పేజీ వరకైనా చదవండి కాల పరీక్షకు నిలువగల వాస్తవాలు, ఆలోచనలు, ప్రతిపాదనలు, వాదనలు, సమస్యలు, పరిష్కారాలు….. స్వేచ్ఛ, హక్కుల వాసనలతో ఉంటాయి” అని, వారి అవగాహనా స్థాయిని పెంచడానికి. ఇంకో మాట అంటుంటాను, అందులోంచి ఒక పదం తొలగించడమైనా-చేర్చడమైనా, ఎంత ఎడిటింగ్ నైపుణ్యం ఉన్నవారికైనా దుస్సాధ్యమే! అభివ్యక్తి అంత నిక్కచ్చిగా ఉండటానికి కారణం…. Clarity of thought leads to a clarity of expression అవడమే కావచ్చు.

విప్లవోద్యమాల, రాజకీయ సిద్దాంతాల చట్రం నుంచి విడదీసి, దాని సంపూర్ణ వైశాల్యతతోనే మానవ హక్కుల దృక్పథాన్ని బలోపేతం చేయాలన్న ఆయన ప్రతిపాదనను అర్థం చేసుకోవడంలో కమ్యూనిస్టులతో సహా పలువురు మొదట్లో విఫలమయ్యారు.
ఎవరికీ వెరవకుండా, అపారమైన దైర్యసాహసాలతో జీవితాన్ని ఉద్యమం చేశారాయన. ‘….రాజ్యం తలచుకుంటే ఎక్కడైనా, ఎప్పుడైనా చంపుతుంది. స్వేచ్ఛను ప్రకటించి చావడమా? లేక, భయపడుతూ చావడమా? అనేది మనం తేల్చుకోవాలి’ అనే దృడాభిప్రాయంతో కడదాకా వున్నవాడు.
‘స్వంత’ను అత్యంత కనీసానికి కుదించి, ‘పర’కోసమే పరితపించి, ఒక జీవిత కాలాన్ని త్యజించిన వాడు.

ఇన్ని పోరాటాలు చేసిన ధీరుడు…ఇంత సింపుల్ గా, వినమ్రంగా, ఏ కీర్తికాంక్షాలేని అతి సాధారణ వ్యక్తిగా సామాన్యుల్లో ఒకడై ఉండటం పట్ల ఎంత మంది ఆశ్చర్యపోయేదో! హక్కుల రూపంలో మానవ విలువల్ని ఆలోచించి, ప్రసంగించి, ఉద్బోధించి, ఆచరించి, అటువంటి సమాజం నిర్మాణం కోసం నిరంతరం స్వప్నించి, శ్రమించి, మరణించిన మహామేధావి బాలగోపాల్.
నేను చూసిన, నాకు తెలిసిన ఒకే ఒక, త్రికరణ శుద్ది గల సంపూర్ణ మానవతావాది బాలగోపాల్ సర్!