Bandisanjay: మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే: బండి సంజయ్

Bandisanjay: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీల అమలు, రుణమాఫీ, 6 గ్యారంటీలపై తెలంగాణలో ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పించి సభ్య సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. ఆనాడు నక్సలైట్లను కాంగ్రెస్ నాయకులను కూడా దారుణంగా చంపిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

కరీంనగర్ లోని మమతా థియేటర్ లో బీజేపీ కార్యకర్తలు, ఏబీవీపీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘జితేందర్ రెడ్డి’ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా తనను కలిసిన సినిమా హీరో రాకేశ్ వర్రె, దర్శక, నిర్మాతలు, సినిమా యూనిట్ సభ్యులను అభినందించారు. అనంతరం వారితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

టైగర్ జితేందర్ రెడ్డి మూవీని చూసే అవకాశం కలిగింది. నేను చిన్నప్పుడు చదువుకునే సమయంలో దేశం కోసం బలిదానాలు చేసిన ఏబీవీపీ విద్యార్థుల చరిత్రను తెలుసుకున్న. వాళ్ల త్యాగాలు వ్రుధా కాకుండా దేశం కోసం పనిచేయాలని నేను కూడా ఏబీవీపీలో పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన. ఆనాడు ఒక్క కార్యకర్త బలిదానమైతే… వందల మంది కార్యకర్తలు పుట్టుకొచ్చారు. జితేందర్ రెడ్డి బలిదానంతో వేలాది మంది పుట్టుకొచ్చారు. నక్సలైట్లు చంపుతారని తెలిసినా ఏనాడూ ఏ కార్యకర్త భయపడలేదు. నమ్మిన సిద్ధాంతం, ధర్మం కోసం పోరాడిన చరిత్ర ఏబీవీపీదేనని కేంద్ర మంత్రి వివరించారు.

దేశంలో ఏ నాయకులు జాతీయ జెండా కోసం బలిదానం కాలేదు… జాతీయ జెండా కోసం బలిదానమైన వ్యక్తులు మిలటరీ సైనికులు. ఏబీవీపీ కార్యకర్తలు మాత్రమేనని బండి స్పష్టం చేశారు. జితేందర్ రెడ్డి బాడీలో బుల్లెట్లు దిగిన తరువాత ‘భారత్ మాతాకీ జై’ నినాదం చేశారని…అంత గొప్ప వ్యక్తి చరిత్రను సినిమాగా నిర్మించడం గొప్ప విషయమన్నారు. జితేందర్ రెడ్డి డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేస్తే రక్తం కంటే బుల్లెట్లే ఎక్కువ బయటపడ్డాయని ఆనాడు డాక్టర్లు చెప్పారంటే… అర్ధం చేసుకోవాలని అన్నారు. ఆనాడు జితేందర్ రెడ్డి, సామ జగన్ మోహన్ రెడ్డి, మధుసూదన్ గౌడ్, జయానంద్ మాదిరిగా వేలాది మంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని.. రవీందర్ రెడ్డి చొరవ, మంచి ఆలోచనవల్ల ఇయాళ జితేందర్ రెడ్డి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపడం అద్రుష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనేక కార్యకర్తలకు, ప్రజలకు స్పూర్తినిచ్చే సినిమా అని… ప్రతి ఒక్కరూ జితేందర్ రెడ్డి మాదిరిగా దేశం కోసం, ధర్మం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జితేందర్ రెడ్డి స్పూర్తితోనే మాలాంటి ఎందరో కార్యకర్తలుగా మారి పోరాటాలు చేస్తున్నారని  సంజయ్ వెల్లడించారు.