Maharashtraelection2024:
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ‘మహా’సంగ్రామం రసవత్తరంగా సాగుతున్న వేళ ఆ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలు కూడా ఎన్నికల్లో కీలకాంశంగా మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘మహా వికాస్ అఘాడీ’ కూటములు పోటాపోటీగా తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పక్క రాష్ట్రాల గ్యారెంటీలు, పథకాలు, హామీలతో ఇతర అంశాలు కూడా ప్రచార అస్త్రాలవుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా సరిహద్దులుగా ఉన్న మహారాష్ట్రలో ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఏదో ఒక విషయంలో, ఏదో ఒక అంశంలో సరిహద్దు రాష్ట్రాలు పతాక శీర్షికలవుతున్నాయి.
మహాయుతి, ఎమ్వీఏ కూటముల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పక్క రాష్ట్రాలను ప్రచారంలో వాడుకుంటున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ, దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లోని బలాలు, బలహీనతలు మహారాష్ట్రలో రెండు కూటముల విమర్శలకు వేదికలవుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రజాకర్షణ పథకాలను ఒకవైపు ప్రకటిస్తూనే, మరోవైపు పక్క రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీలు అమలు చేస్తున్న పథకాల వైఫల్యాలను ఎత్తి చూపుతుండడంతో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థి పార్టీల పథకాలపై విమర్శలు చేస్తూనే దాదాపు అవేరకమైన హామీలతో పథకాలను గుప్పిస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ‘మహాయుతి’లో శివసేన (ఏక్నాథ్ శిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహా వికాస్ అఘాడీ (ఎమ్వీఏ)లో శివసేన (ఉద్దవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు తమ కూటమి మేనిఫెస్టోకు అదనంగా ఎవరికి వారే తమ పార్టీల ప్రత్యేక మానిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలు పోటీపడి ఉచిత పథకాలు ప్రకటించడంలో సర్వసాధారణమైన తరుణంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ హామీల్లోని లోటుపాట్లు కూడా ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కే.శివకుమార్ ఆ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం, మరోవైపు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆర్థికాంశాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికల హామీలను రూపొందించాలని చెప్పడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీన్ని అదునుగా తీసుకొని ప్రధాని మోదీ మెదలుకొని బీజేపీ నేతలంతా కాంగ్రెస్ అచరణ సాధ్యంకాని హామీలిస్తుందని విమర్శలు ప్రారంభించారు. కాంగ్రెస్ హామీలపై మోదీ గతంలో హర్యానా ఎన్నికల సమయంలో కూడా ఇటువంటి విమర్శలే చేశారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న హామీ పథకాల వివరాలను ప్రకటించారు. అంతేకాక ఆయన మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ తరఫున మహారాష్ట్రలోని ప్రధాన పత్రికలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి విడుదల చేసిన వాణిజ్య ప్రకటన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మరింత వేడిని రాజేసింది.
కాంగ్రెస్ను గెలిపించమని రేవంత్రెడ్డి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంతో ప్రతిగా బీజేపీ కూడా కాంగ్రెస్ మోసం చేస్తుందంటూ కర్ణాటకలో, తెలంగాణలో మహిళలకు ప్రతి నెల ఇస్తామని చెప్పిన ఆర్థిక సాయం, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని చెబుతూ, సదరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపుతూ పత్రికా ప్రకటలను జారీ చేసింది. పత్రికా ప్రకటనలో తెలిపినట్టు కాంగ్రెస్ తెలంగాణలో మహిళలకు హామీ ఇచ్చినట్టు డబ్బులివ్వడం లేదు కానీ, మహారాష్ట్రలో మాత్రం ‘మహాయుతి’ ప్రభుత్వం ‘మాజీ లడ్కీ బహిన్ యోజన’ కింద ఇప్పటికే రాష్ట్ర మహిళలకు నెలకు రూ.1500 అందజేసిందని ఆ కూటమి పెద్దఎత్తున ప్రచారం చేస్తుంది. మహిళలకు ఆర్థిక సాయం అంశం మహాయుతికి కొంత ఆశాజనకంగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కులగణన అంశాలతో సానుకూల ప్రచారం చేసుకుంటుంది. ఈ పథాలకు సంబంధించి పార్టీలు తమకు అనుకూలమైన అంశాలను సంఖ్యాపరంగా ఉటంకిస్తున్నాయి. గతంలో రాష్ట్ర సరిహద్దులైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా ఇవే రకమైన హామీలిచ్చినా అక్కడి ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించారని, ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ హామీలను పట్టించుకోరనే భరోసాతో బీజేపీ ఉండగా, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను తెలంగాణ, కర్ణాటక ప్రజలు ఆదరించినట్టే మహారాష్ట్ర ఓటర్లు కూడా ఆదరించి అధికారం ఇస్తారనే విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఉంది.
సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన పథకాల విషయాలే కాకుండా ఇతర రాజకీయ అంశాలు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో వేడిని పుట్టిస్తున్నాయి. మహారాష్ట్రలో హిందువుల ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ కర్ణాటకలో వక్ఫ్ బోర్డు భూ వివాదాలను ఎన్నికల అంశాలుగా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై కర్ణాటక సీఎం సిద్దిరామయ్య స్పందిస్తూ రాష్ట్రంలో ఉప ఎన్నికలను, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కర్ణాటకలో వక్ఫ్ బోర్డు అంశాలపై బీజేపీతో పాటు దాని అనుబంధ సంస్థలు దష్పృచారం చేస్తున్నాయని విమర్శించారు.మరోవైపు మరాఠా రిజర్వేషన్ల ఉద్యమంతో లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో దెబ్బతిన్న మహాయుతి సరిహద్దు రాష్ట్రాల ఓబీసీలపై దృష్టి పెట్టింది. రాష్ట్ర సరిహద్దులో 70కిపైగా అసెంబ్లీ సెగ్మంట్లుండడంతో అక్కడ అధికంగా ఉండే మున్నార్ కాపు, తెలంగి, సూర్యవంశీ గుజార్, దంగారీ వంటి సామాజికవర్గాలను అధికార బీజేపీ ఓబీసీ జాబితాలో చేర్చింది.
కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలే కాకుండా, బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో కీలకంగా మారింది. ఒకప్పడు మహారాష్ట్రలో భాగమైన గుజరాత్కు లబ్ది చేకూర్చేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఎమ్వీఏ కూటమి ప్రధానంగా ఎన్సీపీ నేత శదర్ పవార్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆర్థిక రాజధాని ముంబాయి కేంద్రకంగా ఉన్న మహారాష్ట్రని బలహీనపర్చి సొంత రాష్ట్రం గుజరాత్ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని ‘ఎమ్వీఏ’ ఎన్నికల్లో ప్రచారం చేస్తుంది. 2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో శరద్పవార్ కృషితో మహారాష్ట్రలో టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, ఎయిర్ బస్ ప్రాజెక్టు ఏర్పాటుకు మంజూరు లభించగా, అనంతరం ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు గుజరాత్కు తరలిపోయిందని ఎమ్వీఏ పెద్దఎత్తున ప్రచారం చేపట్టింది. రాష్ట్రంలోని పలు పరిశ్రమలు గుజరాత్కు వెళ్లిపోవడంతో మహారాష్ట్ర దగాపడుతుందనే ఎమ్వీఏ విమర్శలు మహాయుతికి కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయి.
ఒకే దశలో నవంబర్ 20వ తేదీన జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను అధ్యయనం చేయడానికి ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండగా, తెలంగాణలో పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో మహారాష్ట్రలో వచ్చిన వాణిజ్య ప్రకటనపై ఆ రాష్ట్ర ప్రజలు చర్చించుకోవడం కనిపించింది.
ఒక పార్టీకి మించి మరో పార్టీ పోటాపోటీగా హామీలు, పథకాలు ప్రకటించడాన్ని ఓటర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కులో భాగమని, తర్వాత ఎవరూ పట్టించుకోరనే ధోరణితో కొందరు మా బృందంతో చెప్పారు. మరోవైపు ఆర్థిక భారమైన భారీ పథకాల కంటే స్థానికంగా ఉండే సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక నుండి అక్రమంగా మహారాష్ట్రకు డబ్బు, మద్యం తరలిస్తుందని, ఆ రాష్ట్రాల సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టాలని శివసేన శిండే వర్గం ఎలక్షన్ కమిషన్ను కోరగా, దీనికి ప్రతిగా దేశంలోనే అధిక నిధులతో ధనవంత పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీయే ఇతర రాష్ట్రాల నుండి నగదు, మద్యం తరలిస్తుందని ఎమ్వీఏ ప్రతి విమర్శ చేసింది.
ఆర డజను రాష్ట్రాలతో సరిహద్దు కలిగున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రధానంగా తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల ప్రభావం కనిపిస్తోంది.
తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడిన ఆ పార్టీ గ్యారెంటీలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ రెండు రాష్ట్రాల్లో విజయవంతంగా గ్యారెంటీలను అమలు చేశామని, గెలుపు అనంతరం మహారాష్ట్రాలో కూడా అమలు చేస్తామని ఎమ్వీఏ కూటమి చెబుతుండగా, ఆ రెండు రాష్ట్రాల్లో పథకాల వైఫల్యాలను మహాయుతి కూటమి ఎత్తిచూపుతోంది. మరోవైపు మహారాష్ట్రకు దక్కాల్సిన పరిశ్రమలు ప్రధాని నరేంద్ర మోదీ స్వస్థలమైన గుజరాత్కు తరలిపోతున్నాయనే ఎమ్వీఏ ఆరోపణలు ఎన్నికల్లో సెంటిమెంట్ను రగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రాల గ్యారెంటీల గడబిడ ప్రభావంతో రాష్ట్రంలోని ప్రధాన ఎన్నికల సమస్యలు పక్కదారి పడుతున్నాయా..? లేదా స్థానిక సమస్యలకే మహారాష్ట్రీయులు ప్రాధ్యానతిస్తారా..? అనేది నవంబర్ 23న వెలువడే ‘మహా’సంగ్రామం ఫలితాల్లో తేలనుంది.