ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్):
ఆమె జ్యోతక్క..
అది కాంగ్రెస్..
ఇదే అసెంబ్లీ భవనం. రెండో నెంబర్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించగానే, కుడివైపు మూలన మెట్లు, ప్రత్యేక ద్వారంతో రెండు గదులు (ఓటి పెద్దది హాలు లాగా, మరోటి చిన్నది చాంబర్ లాగా) అప్పట్లో కాంగ్రెస్ శాసనసభా పక్షానికి (CLP) ఆఫీస్ గా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ సంఖ్య 26 మంది శాసనసభ్యులకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైన గడ్డుకాలమది. చరిత్ర పురుషుడు ఎన్టీయార్ తెలుగునాట రాజకీయాల్లో కొట్టిన రెండోదెబ్బ. దివంగత ‘లేబర్’ లీడర్ పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) సీఎల్పీ నేతగా ఉన్నారు. అంత తక్కువ సంఖ్యాబలంతో కూడా… మీడియా చంకలో గట్టి బంధంతో కూర్చున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై రాజీలేని పోరాటం చేశాడు. బెదిరింపులకే కాదు లాలూచీ బేరాలకూ లొంగని స్థిరచిత్తుడాయన. చాలామంది మంచోళ్ల లాగే తొరగా పోయాడు.
1998 లోకసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీహెచ్ విద్యాసాగరరావు కరీంనగర్ లోకసభకు ఎన్నికవడంతో మెట్ పల్లి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలొచ్చాయి. న్యాయవాది కొమిరెడ్డి రాములు అనే కాంగ్రెస్ నాయకుడి సతీమణి, అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి జడ్పీటీసీగా ఉన్న కొమిరెడ్డి జ్యోతి అలియాస్ జ్యోతక్క కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. స్వయంగా ఆమె న్యాయవాది కూడా! గెలిచి, కొంత క్రియాశీలంగా ఉంటూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దృష్టినాకర్శించారు. ఆమె ప్రాపకంతో…అఖిల భారత కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేల అసోసియేషన్ లో జ్యోతక్క ముఖ్య భూమిక కూడా పోషించారు. సగటు గృహిణి, లాయర్ కనుక అప్యాయతతో అందరినీ ప్రేమగా పలుకరించే ఆమె మీడియాతోనూ చనువుగా ఉండేవారు. అన్నా, అన్నా అంటూ…. నేతలతో ఎలా నడచుకోవాలి? ప్రజా క్షేత్రంలో ఎలా ఉండాలి? సామాన్యుల సమస్యల్ని ఎలా పరిష్కరించాలి? ఇలాంటి అంశాలు తరచూ ముచ్చటించేవారు.
ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వచ్చినపుడు, ఆమె గెలుపు వార్తను ఒక పత్రిక ‘ఫలించిన కాంగ్రెస్ వ్యూహం’ అనే శీర్షికతో ఇచ్చింది. ఆ రోజు సీఎల్పీలో నలుగురయిదుగురం జర్నలిస్టులం కూర్చొని పత్రికలు తిరగేస్తున్నాం. ఆ శీర్షిక చదివి, ఒక సీనియర్ జర్నలిస్ట్ మితృడన్నాడు ‘వీడో పోటుగాడు, వీర హెడింగ్ పెట్టాడు. ఫలించిన కాంగ్రెస్ వ్యూహమట! అసలు కాంగ్రెస్ కు వ్యూహం ఎక్కడుంటుందిరా ……… (రాయలేని బూతుపదం)! ప్రజలు కోరుకున్నపుడు కాంగ్రెస్ వాళ్లు గెలుస్తుంటారు. వాళ్ల దురాగతాలు, దుష్టపాలన, గ్రూపు తగాదాలను ప్రజలు ఈసడించుకున్నపుడు ఓడిపోతుంటారు, సింపుల్. దట్సాల్!’ అని. పాతికేళ్లు దాటింది, ఇవాల్టికీ కాంగ్రెస్ ది అదే పరిస్థితి! అఖిల భారత స్థాయిలో కూడా ఇదే రివాజు కొనసాగుతోంది. నిన్నటి హర్యానా ఫలితమైనా, రేపటి మహారాష్ట్ర అంచనాలయినా అందుకు ఉదాహరణలు మాత్రమే, తప్ప తేడా ఏమీ లేదు.
ప్చ్ కాంగ్రెస్!
జ్యోతి @ జ్యోతక్క బెంగళూరులో చికిత్స పొందుతూ మరణించారనే సమాచారం నాకెంతో బాధ కలిగించింది.
ఆత్మకు శాంతి చేకూరాలి.
కన్నీటి నివాళి