Karthikamasam: కార్తీక మాసంలో వనభోజనాలు ప్రత్యేకం. హైందవ సంప్రదాయం ప్రకారం పవిత్రంగా పూజించే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలని శాస్త్ర వచనం. అందుకే ఉసిరి చెట్టు లేదా దానికి కొమ్మనైన వెంట తీసుకొని వెళ్లి వనభోజనం చేస్తుంటారు.శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. అంతేకాక ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి సతీసమేతంగా కొలువై ఉంటారని విష్ణుపురాణం చెబుతుంది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెబుతుంటారు. సూతమహర్షి సైతం మునులందరితో కలిసి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో చెప్పబడింది. ఈ మాసంలో ఉసిరి చెట్టు మీద నారాయణుడు ఉంటాడని.. అందుచేత ఆ చెట్టును ధాత్రీ నారాయణుడుగా భావించి పూజిస్తే మహాపాతకాలు తొలగిపోతాయని నమ్మకంగా భావిస్తారు.
కార్తీకమాసంలో వనభోజనాల ఉసిరిని భూమాతగా కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడడంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం సారాంశం. ఇది మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరి చేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చరకసంహిత చెబుతుంది. ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఐదు ఉసిరి మొక్కలను నాటాలని పండితులు చెబుతుంటారు.
వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరిచెట్టు వద్ద విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఆ తర్వాత చెట్టుకి ఎనిమిది వైపుల దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి. ఉసిరి పత్రితో విష్ణువును పూజించాలి. అనంతరం బంధుమిత్రులతో కలిసి వనభోజనాలు చేయాలి. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడుతో పాటు గోప బాలకులతో కలిసి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేశాడని భాగవతంలో చెప్పబడింది.శ్రీమహావిష్ణువుకు ఉసిరికాయలతో దీపారాధన చేసే వారిని చూడటానికి యమునికి కూడా శక్తి చాలదని పురాణాల్లో వివరించబడింది.