ManojBajpai: బాలీవుడ్ అంటే ఖాన్‌, కపూరులే కాదు.. మనోజ్ లాంటి విలక్షణ నటులూ ఉన్నారు..!

Bollywood :  ‘The Family Man’ వెబ్ సిరీస్ గురించి సాయి వంశీ విశ్లేషణ .

కథ, కథనం.. వీటన్నింటినీ మించి మనోజ్ బాజ్‌పేయి నటన చూస్తే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 58 ఏళ్లు ఆయనకు. శ్రీకాంత్ తివారీ అనే పాత్రలో ఎంత బాగా నటించారంటే, తెరపై ఆయన ఉన్న ప్రతి సన్నివేశం చూసినకొద్దీ చూడాలని అనిపిస్తుంది.

బిహార్‌లో బేల్వా అనే మారుమూల గ్రామంలో పుట్టి, National School of Dramaలో చేరడానికి మూడు సార్లు ప్రయత్నించి, అక్కడ రిజెక్ట్ కాబడి, ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఆ తర్వాత మనసు మార్చుకుని మరోచోట తన ప్రతిభ చూపారు. 29 ఏళ్లకు ‘బండీత్ క్వీన్’ సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చిన ఆయన సాధించిన విజయం ఏమిటంటే, ఆ తర్వాత అదే National School of Drama తమ విద్యార్థులకు ఆయన్ని శిక్షకుడిగా ఉండమని కోరింది. వజ్రాన్ని నేలపైకి విసిరేస్తే మాత్రం విలువ తగ్గుతుందా?

27 ఏళ్ల సినీ కెరీర్‌లో మూడు జాతీయ పురస్కారాలు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు. హిందీ సినిమా రంగంలో ఓంపురి, నసీరుద్దీన్, నానా పటేకర్ లాంటి విలక్షణ నటుల తర్వాత ఆ స్థానాన్ని అందుకుని, తన నటనతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వ్యక్తి. ఆయన నటించిన ‘సత్య’ చూడాలి. ఆయన కోసం చూడాలి. ‘పింజర్’ సినిమా చూడాలి. దేశ విభజన సమయంలో ఒక హిందూ మహిళను ఎత్తుకొచ్చి వివాహం చేసుకుని, ఆపైన ఆమె మీద అంతులేని ప్రేమ పెంచుకున్న ఓ ముస్లిం పడే మానసిక ఆవేదన ఆయన నటనలో చూడాలి.

‘గ్యాంగ్ ఆఫ్ వాసిపూర్’ సినిమా కోసం నాలుగు కిలోల బరువు తగ్గి, సినిమా కోసం గుండు చేయించుకున్నారాయన. 2016లో వచ్చిన ‘అలీగఢ్’ సినిమాలో Homosexual ప్రొఫెసర్‌గా నటించారు. 2019లో ‘భోస్లే’ సినిమాలో నటించి జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు.

Bollywood అంటే ఖాన్‌త్రయం, కపూర్‌ల రాజసం మాత్రమే కాదు, ఇలాంటి విలక్షణ నటులూ ఉన్నారు.