పేదోళ్ల కష్టాలు, బాధలు తెలుసుకోవడానికే పాదయాత్ర: బండి సంజయ్

బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లా కోరుట్లలో జోరుగా కొనసాగుతోంది. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. యాత్రలో భాగంగా సంజయ్.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సభకు వచ్చిన ఇతర రాష్ట్రాల నేతలంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ గాళ్లని.. ఆవిర్భావ కార్యక్రమం టీఆర్ఎస్ సంతాప సభలా ఉందని ఎద్దేవా చేశారు. లక్ష కోట్ల దొంగ సారా దందా చేసిన సీఎం బిడ్డను చూసి దేశమంతా నవ్వుకుంటోందన్నారు. కవిత వైఖరితో తెలంగాణ ఆడబిడ్డలు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బిడ్డను అరెస్ట్ చేస్తారనే భయంతోనే.. కేసిఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారని సంజయ్ మండిపడ్డారు.

కాగా ఐలాపూర్ గ్రామస్తులు చాలా చైతన్యవంతులని సంజయ్ కొనియాడారు.ఇక్కడి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయాని?..ఐలాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాడాని ప్రశ్నించారు సంజయ్. తెలంగాణా బాగు కోసం సంవత్సరం నుంచి  పాదయాత్ర చేస్తున్నట్లు.. పేదోళ్ల కష్టాలు, బాధలు తెలుసుకోవడమే  పాదయాత్ర లక్ష్యమని సంజయ్ స్పష్టం చేశారు.కోతల రాయుడుగా పేరుగాంచిన కేసిఆర్… జగిత్యాల సభలో అన్ని కోతలే కోసిండని దుయ్యబట్టారు. పాదయాత్రలో తెలుసుకున్న అంశాలను బీజేపీ మేనిఫెస్టో పెడతామని సంజయ్ తేల్చిచెప్పారు.

ఇక ఇంతవరకు కొండగట్టుకు  పోనీ కేసీఆర్.. అక్కడే కుర్చీ వేసుకుని 100 కోట్ల పనులు చేయిస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో వేములవాడకు 100 కోట్లు..బాసరకు 120 కోట్లు అని ప్రకటించిన కేసీఆర్… ఒక్క రూపాయి అయినా విడుదల చేశాడాని..  ఎనిమిదేళ్లలో నష్టపోయిన ఏ ఒక్క రైతుకైనా నష్టపరిహారం ఇచ్చాడని సంజయ్ ప్రశ్నించారు. 

ఇదిలా ఉంటే..పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లలేదని.. సీఎం చేష్టలతో రాష్ట్రం పరువు పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు సంజయ్. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసి పెట్టాడని.. ప్రతి ఒక్కరి నెత్తిపై 1,20,000 అప్పు ఉందన్నారు.రైతుబంధు పేరుతో రైతులకు అన్ని సబ్సిడీలను కట్ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని సంజయ్ మండిపడ్డారు.

 

 

Optimized by Optimole