బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది మాతో టచ్ లో ఉన్నారు : బండి సంజయ్

BJPTelangana: ‘‘కేసీఆర్ ఫ్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై మేం పోరాడుతుంటే…. బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు . బీజేపీ కార్పొరేటర్లు మాతో టచ్ లో ఉన్నారంటూ కేసీఆర్ కొడుకు అంటున్నడు… ఆయనకు తెల్వదేమో… మాతో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని’’ హెచ్చరించారు. బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని ఆయన తెచ్చి చెప్పారు. ధరణి మంచి పోర్టల్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే.. ఆ కుటుంబం లాక్కున్న భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికే ధరణి తెచ్చారు. ఆ పోర్టల్ బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు’’అంటూ సంజయ్  ఎద్దేవా చేశారు.

కాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ కార్యాలయాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం మహజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు.  ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, చేసిన అభివ్రుద్ధి, పేదలకు అందించిన సంక్షేమ పథకాలపై వాస్తవాలను తెలియజేసేందుకు మహజన్ సంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీల నేతలు కమీషన్లు దండుకునేందుకు, భూ దందాలకు నియోజకవర్గాల కార్యాలయాలను ఉపయోగిస్తున్నారని మండి పడ్డారు. బీజేపీ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల తరపున పోరాటాలకు ఉపయోగిస్తున్నామని సంజయ్ స్పష్టం చేశారు.

 

Optimized by Optimole