Bandisanjay: శ్రీరాముడి ఆక్షింతలను కించపర్చే స్థాయికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దిగజారారు: బండి సంజయ్

Bandisanjay: ‘‘త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో మనమే నెంబర్ వన్. బ్యాలెట్ పేపర్ లో కూడా 1వ స్థానం మనదే. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ఎండలను లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ, ఊరూవాడా కదిలి వచ్చి బ్యాలెట్ పేపర్ లోని 1వ నెంబర్ పక్కనున్న పువ్వు గుర్తుపై బటన్ నొక్కి ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించండి’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధుల చరిత్రను బేరీజు వేసి మీకు ఎవరు మేలు చేస్తారో ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తనదైన శైలిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపై సెటైర్లు వేశారు.

‘‘కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి రాజేందర్ రావు… బీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ రావు. రాజేందర్ రావు ఎవరో కాంగ్రెస్ కార్యకర్తలకే తెలవదు. నాన్ లోకల్ వినోద్ రావు ఎన్నికలప్పుడు తప్ప ఎన్నడూ ప్రజలకు కన్పించరు. ఈ ఇద్దరు రావులకు పొరపాటున ఓటేస్తే…. మీకు ఏమీ రావు….రావు’’అని అన్నారు. దేశమంతా నరేంద్రమోదీ గాలి వీస్తుంటే అక్కసుతో సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే రిజర్వేషన్లపై పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేయడం దుర్మార్గమన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తాలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు వచ్చారు. ఈ సందర్ఢబంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి సంజయ్ ప్రసంగించారు. 

శ్రీరాముడి ఆక్షింతలను కూడా కించపర్చే స్థాయికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దిగజారారని సంజయ్ మండిపడ్డారు. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట విషయాన్ని ప్రజలు మర్చిపోవాలని మోదీపై ఆ పార్టీల నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. నరేంద్రమోదీ చేసిన పాపమేంది? 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించి ప్రాణాలు కాపాడినందుకు తిడుతున్నారా? 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందిస్తున్నందుకు తిడుతున్నారా? 30 కోట్ల టాయిలెట్లు కట్టించినందుకు తిడుతున్నారా? 11 కోట్లకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించినందుకు తిడుతున్నారా? దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నందుకు తిడుతున్నారా? అని సంజయ్ ప్రశ్నించారు.