Modi: మే 8న వేములాడకు ప్రధాని మోదీ రాక?

Pmmodi: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెల 8న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర కార్యాలయానికి సమాచారం పంపింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు… 8 వ  తేదీ ఉదయం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో పర్యటిస్తారు. ప్రధాని రాక సమాచారాన్ని అందుకున్న జిల్లా నాయకత్వం సభాస్థలి, ఏర్పాట్లపై ద్రుష్టి సారించింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి వేములవాడ రానున్న నేపథ్యంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఎములాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 10 గంటలకు రాజన్న దర్శనాంతరం ఎములాడలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు హాజరై మోదీ ప్రసంగించేలా షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు. ప్రధాని పర్యటన పూర్తి షెడ్యూల్ రెండు, మూడు రోజుల్లో అధికారికంగా వెల్లడయ్యే అవకాశముంది.
మరోవైపు సోమవారం ఎంపీ కార్యాలయంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ శక్తి కేంద్ర ఇంఛార్జీల సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ తోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జిల్లా ఇంఛార్జీ మీసాల చంద్రయ్య, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, కార్పొరేటర్లు అనూప్, కాసర్ల ఆనంద్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రధాని మోదీ ఈనెల 8న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో వేములవాడలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని, సభను దిగ్విజయవంతం చేసేలా ప్రతి ఒక్క కార్యకర్త క్రుషి చేయాలని కోరారు.
అందులో భాగంగా ప్రధాని ఎన్నికల ప్రచార బహిరంగ సభాస్థలిని ఎంపిక చేసేందుకు రేపు మధ్యాహ్నం వేములవాడ వెళ్లనున్నారు. సభాస్థలి ఎంపిక అనంతరం జిల్లా, నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమై మోదీ సభ ఏర్పాట్లపై చర్చించనున్నారు.

బీజేపీలో కొనసాగుతున్న చేరికలు..

భారతీయ జనతా పార్టీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నుండి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేసిన పత్తిపాక సురేష్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వీరందరికీ బండి సంజయ్ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన పిస్క వెంకటేశ్, బుదారం సదానంద్, బీమని నగేశ్, కొంపల్లి మురళి, గుడ్ల సురేష్ కుమార్, శ్రీధర్, దాసరి వెంకటేశ్, ఆడెపు లక్ష్మణ్, సత్యవికాస్, బలుసాని అనిల్, తుపాకుల రమేశ్, శివపురం శ్రీనివాస్, బోగ కనకయ్య, శ్రీరాం విష్ణు, బూర పవన్, పల్లె ప్రశాంత్ తదితరులు బీజేపీలో చేరారు.

అట్లాగే కరీంనగర్ లోని లక్ష్మీ నగర్ 31వ డివిజన్ కు చెందిన మాజీ కాంగ్రెస్ నేత వి.కిశోర్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు ఈరోజు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వీరిలో వి.నర్సింహరాజు, బి.నవీన్, కె.నాగరాజు, జి.సాయికిరణ్, జి.మణిదీప్, జి.సాయి క్రిష్ణ, జి.సాయి కుమార్, జి.శివ, పి.అంజి, పి.శ్రీనివాస్, ఎండీ.హస్సన్ అన్సార్, టి.నిరంజన్, ఏ.అరుణ్, మీనార్ ఖాన్, వి.రాకేశ్ తదితరులు బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు…

ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుు నారాయణసహా పలువురు నాయకులు సైతం ఎంపీ కార్యాలయానికి వచ్చి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.