Nancharaiah merugumala senior journalist:
జీఎన్ సాయిబాబా మార్క్సిస్టు, కోనసీమ కాపు కాబట్టే జైళ్లలో కులవ్యవస్థ గురించి వెల్లడించిన ఏకైక తెలుగు మేధావిగా గుర్తింపు పొందగలిగారు!
‘‘ఉత్తరాది జైళ్లలో కులవ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తోంది. ఖైదీల కులాన్ని బట్టి అక్కడ పని ఇవ్వాలని జైలు మాన్యువల్‌లో బహిరంగంగా రాసి ఉంది. నాగపుర్ జైల్లో కులవ్యవస్థ సర్వత్రా వ్యాపించి ఉంది. జైలు మాన్యువల్‌లో వివరించిన కులవ్యవస్థ ప్రకారం ఖైదీలను కులాలవారీగా ఏమేమి చేయవచ్చో వర్ణించారు,’’ ఈ మాటలు అన్యాయంగా భారత జైళ్లలో అనేక సంవత్పరాలు గడిపిన ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా శుక్రవారం చెప్పినవి. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఓసీ కాపు కుటుంబంలో పుట్టడమేగాక, మార్క్సిస్టు, మావోయిస్టు సిద్ధాంతాలు వంటపట్టించుకుని, ఆదర్శప్రాయమైన జీవితానికి కట్టుబడిన వ్యక్తి ఈ గోకరకొండ నాగ సాయిబాబా. ఆయన ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా కన్నా ఆదివాసీల కోసం పోరాడిన నేతగా ఎక్కువ పేరు సంపాదించారు. 1966 తర్వాత కోస్తా కాపు కుటుంబంలో ఇంతటి గొప్ప వ్యక్తి పుట్టడం ఎలా సాధ్యమైంది? అని లక్షలాది మంది తెలుగు జనం ఆశ్చర్యపోయే రీతిలో సాయిబాబా నిరంకుశ ప్రభుత్వాలను ఎదుర్కొని న్యాయపోరాటం చేశారు. చివరికి విజయం సాధించారు. ఆయన నమ్మిన మార్క్సిజం, పిడితవర్గ పక్షపాతమే సాయిబాబాను అంత ఎత్తుకు తీసుకెళ్లాయి.
సాయిబాబా వంటి వ్యక్తి తెలుగునాట పుట్టారని చెబితే భవిష్యత్తు తరాలు నమ్మకపోయే ప్రమాదం ఉంది. ఆయన పోరాట పటిమ, ఓర్పు, శారీరక హింసను తట్టుకునే స్వభావం అలాంటివి. అత్యధిక శాతం శారీరక వైకల్యం ఉన్నా రాజ్యహింసను, జైల్లో చిత్రహింసలను తట్టుకుని, ప్రతిఘటించి ఆయన నిలబడ్డాడు. ఇతర శ్రామికవర్గ కులాలు, జనంతోపాటు కోస్తా కాపు కులస్తులు కూడా సగర్వంగా ‘మావాడు’ అని చెప్పుకోదగిన సాయిబాబా ఎన్నడూ కాపు కులం ప్రస్తావన తీసుకురారు గాని ఆయనకు గోదావరి జిల్లాల కాపుల తీరుతెన్నులపై సమగ్ర అవగాహన ఉందని చెబుతారు. తొమ్మిది సంవత్సరాలు దిల్లీ, మహారాష్ట్ర జైళ్లలో గడిపిన సాయిబాబా 1967లో పుట్టారు. ఆయన దిల్లీ విశ్వవిద్యాలయం కాలేజీలో అధ్యాపకుడిగా ఇంకా పదేళ్లకు పైగా పనిచేసే అవకాశం ఉంది. అలాగే లెక్చరర్‌గా ఇక ముందు కూడా కొనసాగుతానని సాయిబాబా చెప్పారు.
ఏదేమైనా అమలాపురం ప్రాంతంలోని కాపు కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించిన ఏకైక ప్రముఖుడు జీఎన్ సాయిబాబా అంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, కాపు జనసమూహాలు తమవాడని భావించే కొణిదెల పవన్ కల్యాణ్ కూడా తూర్పుగోదావరి పిఠాపురాన్ని తన కార్యక్షేత్రంగా చేసుకున్న కారణంగా సాయిబాబా గురించి తెలుసుకుని, కాపుల్లోని వైవిధ్యభరిత స్వభావం గురించి కార్యకర్తలకు చెబితే తెలుగు సమాజానికి ఎనలేని మేలు జరుగుతుంది.