Nconvention: ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె..!

Nancharaiah merugumala senior journalist:

నాడు అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఎన్టీఆర్‌ నోటీసులతో ఏఎన్నార్‌కు గుండెపోటు..నేడు ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె!

కొన్న స్థలం నుంచి ప్రజల సంపదలో భాగమైన చెరువులోకి చొరబడి నిర్మాణం చేశారనే కారణంపై హైదరాబాద్‌ ఐటీ కేంద్రం మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ అనే కొన్నెకరాల విస్తీర్ణంలో కట్టిన భవనాలను తెలంగాణ సర్కారు శనివారం కూల్చేస్తోందనే వార్తలు వేగంగా వచ్చిపడుతున్నాయి. దీని యజమాని దివంగత తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావు చిన్నకొడుకు నాగార్జున అనే విషయం రహస్యమేమీ కాదు. 2014లో అధికారంలోకి వచ్చన తొలి తెలంగాణ సర్కారు మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ వంటి కోస్తా, రాయలసీమ జిల్లాలోళ్లు ఎక్కువ మంది ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లను, భవనాలను కూల్చేసింది. కాని ఎందుకనో ఎన్‌ కన్వెన్షన్‌కు నోటీసులతోనే సరిపెట్టింది. తర్వాత హఠాత్తుగా మాదాపూర్‌ కూల్చివేతలు ఆగిపోయాయి. మరి ఇప్పుడు తెలంగాణ రెండో సీఎం, అక్కినేని కుటుంబానికి చాలా ఇష్టమైన పార్టీ కాంగ్రెస్‌కు చెందిన నేత ఎనుముల రేవంత్‌ రెడ్డి సర్కారు ‘హైడ్రా’ అనే పదునైన ప్రభుత్వాంగంతో ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొట్టడం చారిత్రక పరిణామం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అల్లుడు ఇంట్లో ఉన్నాగాని చట్టాలను ఉల్లంఘించే కోస్తా సంపన్నులను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చూసీచూడనట్టు వదిలేయకపోవడం కూడా అంతే గొప్ప పరిణామం.

1985లోఎన్టీఆర్‌ సర్కారు ‘అన్నపూర్ణ’కు నోటీసిస్తేనే ఏఎన్నార్‌కు ‘గుండెపోటు’..

ఆరు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కారు చౌకగా బంజారాహిల్స్‌లో సినిమా స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన స్థలంలోని మూడు ఎకరాల్లో నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు తన చిరకాల సినీ మిత్రుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డితో కలిసి 1980ల్లో టింబర్‌ డిపో (మా కృష్ణా జిల్లా యాసలో పుల్లల అడితి) ప్రారంభించాడు. రాష్ట్ర సర్కారు నుంచి భారీ రాయితీ ధరపై భూమి కేటాయింపు పొందినప్పుడు దాన్ని ఏ పని కోసం కొన్నారో ఆ వ్యాపార కార్యకలాపమే సాగించాలనే నిబంధనకు ఇది విరుద్దం. ఈ విషయం ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు గారికి రాష్ట్ర ఉన్నత అధికారులు చెప్పగా, ఆయన ఏఎన్నార్‌ తన వంటి సినీ హీరో, తన జిల్లాకే చెందిన కమ్మ ప్రముఖుడు అని చూడకుండా ఈ టింబర్‌ డిపో వ్యాపారం చేయడానిక స్థలం ఇచ్చినందుకు అన్నపూర్ణా స్టూడియోస్‌ యాజమాన్యానికి 1985లో నోటీసులు జారీచేయించారు. నోటీసులు అందుకున్న వెంటనే నాగేశ్వరరావు గారికి గుండెనొప్పి వచ్చింది. ఓ హైదరాబాద్‌ ఆస్పత్రిలో చేరిన ఏఎన్నార్‌ను సీఎం హోదాలో ఎన్టీఆర్‌ వెళ్లి పరామర్శించారు. ‘‘ ఏం బ్రదర్‌! నిబంధనల ఉల్లంఘన కింద నోటీసులు వస్తేనే మీకు గుండె తడబడుతోంది. మద్రాసులో మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిన మీ గుండె తెలుగు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఇంతగా బలహీనమైతే ఎలా?’’ అనే రీతిలో రామారావు మాట్లాడారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడేమో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఈస్టర్న్‌ మిషిగన్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ (బీఎస్‌) చదవబట్టే నాగార్జున తన ఎన్‌ కన్వెన్షన్‌ నేలమట్టమవుతున్నా ధైర్నం సడలకుండా ఉన్నాడు. మరి కనీసం స్కూలు ఫైనలు కూడా చదవని ఆయన తండ్రి వెర్రి నాగన్న సర్కారు నోటీసులకే గుండెలు బాదుకుంటూ బావురుమన్నాడు. అందుకే ఎంత ఖర్చయినా, అప్పుచేసైనా నేడు తెలుగువాళ్లు తమ పిల్లల్ని అమెరికా పంపి చదివిస్తున్నారు. ఇది అత్యంత శుభ పరిణామం.

Optimized by Optimole