Vijayawada: మా అమ్మ చెప్పిన మాట నిజమేనని నిరూపిస్తున్న బెజవాడ వరదలు!

Nancharaiah merugumala senior journalist: 

‘ఐదుగురు అప్పాచెల్లెళ్లలో కళ్లులేనిది బుడమేరు’ అని ఎప్పుడో మా అమ్మ చెప్పిన మాట నిజమేనని నిరూపిస్తున్న బెజవాడ వరదలు..!

బెజవాడ నగరంలో సమాంతరంగా కనిపించే రెండే రెండు పెద్ద రోడ్లు ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు ప్రాంతాలు ప్రస్తుత వరదల నుంచి సురక్షితంగా ఉన్నాయని తెలుగు టీవీ చానళ్లు చెబుతున్నాయి. ఇది చాలా గొప్ప శుభవార్తే. మరి నిన్నమొన్నటి వానలతో ఈ మధ్యస్థ–మిడీవల్‌ సిటీకి ఉత్తరమో లేదా ఈశాన్యమో తెలియదుగాని ఊరు చివరి అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం వీటి చుట్టుపక్కల ప్రాంతాలు బుడమేరు వరద నీట్లో మునిగే ఉన్నాయి. పూర్వపు కృష్ణాజిల్లా మైలవరం దగ్గర ఖమ్మం జిల్లా కొండల్లో పుట్టిందని చెబుతున్న ఈ ఏరు (Rivulet) నేను పుట్టిన పునాదిపాడుకు, నేను పెరిగిన గుడివాడ టౌనుకు పదిపన్నెండు కిలోమీటర్ల దూరంలో సమాంతరంగా ముందుకు ప్రవహిస్తూ పూర్వపు పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద సరస్సు కొల్లేరులో కలుస్తుంది. భారీ వర్షాల సమయంలో ఈ బుడమేరు పుట్టగుంట గ్రామం దగ్గర మా గుడివాడ నుంచి ఏలూరు లేదా హనుమాన్‌ జంక్షన్‌ పోయే రోడ్డు మీద నుంచి కాస్త దూకుతూ ప్రవహిస్తుంది. అప్పుడు ఈ రహదారిపై రాకపోకలు బందవుతాయి. 1970–72 మధ్య మేం హైస్కూల్లో చదివే రోజుల్లో– ఉప్పొంగిన బుడమేరు రోడ్డుపై నుంచి (ఇప్పుడు ఈ గుడివాడ–ఏలూరు రోడ్డు జాతీయ రహదారి– 216..కత్తిపూడి–ఒంగోలు..అయింది) అతి వేగంగా దూకుతూ పోవడం చూడ్డానికి సైకిళ్లేసుకుని అక్కడకు వెళ్లేవాళ్లం. గతంలో ఈస్ట్‌ కృష్ణాగా పిలిచే ఈ ప్రాంతానికి బుడమేరు అందరికీ బాగా తెలిసిన ఏరు. ఏలూరు పట్టణానికి తమ్మిలేరు ఎలాగో ఈ ఏరియాకు బుడమేరు అలాంటి దుందుడుకు ప్రవాహం. అలాగే ఇది డ్రెయిన్‌ కూడా. విజయవాడ–గుడివాడ రైల్వేలైను మధ్య వచ్చే తరిగొప్పుల స్టేషన్‌ దగ్గరలోని వేంపాడు అనే మా రెండో పిన్నిగారి ఊరు, పక్కనున్న దేవినేని నెహ్రూ అత్తగారూరు వెల్దిపాడు పక్కనుంచి పోయే బుడమేరు వరద నీటిలో అక్కడి పొలాలు మునిగిపోయేవి అప్పట్లో. ఈ మునక ముప్పు నుంచి అక్కడి పొలాలను కాపాడడానికి ఆ ప్రాంతంలో బుడమేరుకు 40 ఏళ్ల క్రితమే కరకట్ట నిర్మాణం పెద్ద వార్త. వైఎస్సార్పీ హయాంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కట్టించాడని చెబుతున్న బెజవాడ కృష్ణా నది రిటెయినింగ్‌ వాల్‌ (ఐదారు కి.మీ పొడవున?) ఇప్పుడు ఎంతటి చర్చనీయాంశం అయిందో అప్పట్లో బుడమేరు కరకట్ట కట్టడం గురించి అంతగా ఆ ఊళ్ల జనం చెప్పుకునేవారు. గుడివాడ నుంచి బెజవాడ వెళుతుంటే పాత సత్యనారాయణపురం స్టేషన్‌ దాటాక విజయవాడ జంక్షన్‌ స్టేషన్‌ రావడానికి ముందు బుడమేరు రైలు వంతెన కింద నుంచి పోయేదని గుర్తు. (ఇప్పుడు సత్యనారాయణపురం రైల్వే లైను లేదు) అలాగే, అప్పట్లో ఒకవేళ ప్లాట్‌ఫాములు ఖాళీ లేకపోతే రామవరప్పాడు నుంచి ఏలూరు నుంచి వచ్చే రైళ్ల మార్గంలో (‘బైపాస్‌’) మా రైలు సింగ్‌నగర్, పాయకాపురం మీదుగా బెజవాడ పెద్ద స్టేషన్‌ చేరేది. ఈ రూట్లో కూడా బుడమేరు వచ్చేది. ఇంతగా ఈ ఏరు ఇష్టమొచ్చిన రీతిలో వంపులు తిరుగుతూ పోతుంది. అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, న్యూరాజరాజేశ్వరీపేట పక్క నుంచి బుడమేరు ప్రవహిస్తుంది. బుడమేరు వరద నీటితో ఉప్పొంగితే –ఈ ప్రాంతాలన్నీ నీట మునగడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. మిగిలిన అన్ని పెద్ద వాగులు లేదా ఏరుల మాదిరిగానే బుడమేరు కూడా ఎన్నెన్నో వంకర్లు తిరుగుతూ తన గమ్య స్థానం కొల్లేరు చేరుతుంది.

ఐదుగురు అప్పాచెల్లెళ్లలో చూపులేనిది బుడమేరుకే!

దాదాపు 162 కిలోమీటర్ల ప్రయాణం ఈ ఏరుది. మైలవరం ప్రాంతంలోని వెలగలేరు వద్ద బుడమేరుపై అడ్డుకట్ట వేసి బుడమేరు డైవర్షన్‌ కాలవ (బీడీసీ) తవ్వారు. దాని నీటిని ఇలా సాగు అవసరాలకు వాడడం కొన్నేళ్ల క్రితమే మొదలైందని, ఈ కాలవను తర్వాత గోదావరి నుంచి నీరు తీసుకొచ్చి కృష్ణా నదిలో కలిపే కాలవతో అనుసంధానం చేశారని మొన్ననే చదివాను. పదేళ్ల క్రితం ఇప్పటిలాగానే బుడమేరు వరదలతో బెజవాడ ఊరు చివరి ప్రాంతాలు నీటమునిగినప్పుడు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వంటి ఇంగ్లిష్‌ పత్రికలు కాస్త పెద్దగానే ఆ వార్తలు వేశాయి. గూగుల్‌లో వెతికితే ఈ వార్తలు కనిపించాయి. ఈ ఆంగ్లపత్రికలు రాసినట్టు బుడమేరుకు ‘బెజవాడ దుఃఖదాయిని’ (Sorrow of Vijayawada) అనే పేరుందని నాకు ఈ పత్రికల వార్తలు చదివే దాకా తెలీదు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూలు సోషల్‌ స్టడీస్‌ పాఠాల్లో ‘హోయాంగ్‌ హో నదిని చైనా దుఃఖదాయిని (Sorrow of China) అంటారని చదువుకున్న విషయం వెంటనే గుర్తుకొచ్చింది. అన్నింటికీ మించి ఈ వంకరు టింకరు బుడమేరు ప్రవాహం లేదా ప్రయాణం గురించి నాకు పదిపన్నెండేళ్ల వయసులో బుడమేరు సమీప గ్రామం పునాదిపాడులో పద్నాలుగేళ్లు పెరిగిన మా అమ్మ పిన్నిబోయిన సంపూర్ణాన్ని అడిగాను. అప్పుడామె, ‘‘ బుడమేరు చూపు లేని మనిషిలా ఎనక్కీ ముందుకీ వకర్లు తిరుగుతూ పోతుంది. చివరికి కొల్లేరులో కలిసే దాకా ఎక్కడా రెండు ఫర్లాంగులు సక్కంగా పోదు. తమ్మిలేరు సహా ఐదుగురు అప్పాచెల్లెళ్లలో ఒకటి బుడమేరు. ఈ ఐదుగురిలో కళ్లు లేనిది బుడమేరు. అందుకే అడ్డదిడ్డంగా ఇది పారుతుంది. నాకీ విషయం బుడమేరుకు దగ్గర్లోని ఉప్పలూరులో పుట్టిన మా అయ్యమ్మలు (నాయనమ్మలు) నా చిన్నప్పుడే చెప్పారయ్యా,’’ అని చిన్న కత లాగా చెప్పింది. అవును, ప్రభుత్వాలకు మొదట్నించీ ముందుచూపు తక్కువ ఉన్నట్టే బుడమేరుకు పుట్టినప్పటి నుంచీ అసలు చూపే లేదని, కళ్లు లేవని– ఇప్పటి దాని దూకుడు, బీభత్సం చూస్తే నాకు అర్ధమవుతోంది.

(ఫోటోలు: బెజవాడ ‘ శివారు ‘ ప్రాంతాల్లో బుడమేరు ప్రవాహం)

Related Articles

Latest Articles

Optimized by Optimole