Mirchi: అలరించిన మిర్చి తెలుగు మాట…!

Mirchi: తెలుగు భాష దినోత్సవం సందర్భంగా 98.3 రేడియో మిర్చి, ‘‘మిర్చి తెలుగు మాట’’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలుగు భాష దినోత్సవం ఆగస్టు 29న మొదలై వరుసగా నాలుగు రోజుల పాటు తలపెట్టిన ‘‘మిర్చి తెలుగు మాట’’ కార్యక్రమంలో తెలుగుకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియయజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రేడియో మిర్చి స్టేషన్లలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యమ్రం, ఖండతారాలు దాటిన తెలుగు ఖ్యాతిని ఆవిష్కరించింది. తెలుగును అమితంగా ప్రేమించే కవులు, రచయితలతో ముచ్చటించింది. విదేశీయులు అయ్యుండి.. తెలుగును ఇష్టంగా నేర్చుకున్న వారిని పలకరించింది.

తెలుగులో సుప్రసిద్ధ నటులు రచయిత డాక్టర్ తనికెళ్ల భరణితో మిర్చి భార్గవి ముచ్చటించి, తెలుగు మాట, భాష, సినిమాలు, పుస్తకాల గురించి శ్రోతలకు విలువైన సమాచారం అందించారు. తెలుగులో వెయ్యిన్నొక్క నవలలు రాసి, సామాజిక చైతన్యాన్ని జనాల్లోకి తీసుకెళ్ళిన కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారి గురించి, ఆయన ఎదుర్కొన్న సవాళ్ల గురించి, ఆయన తనయులు, కొవ్వలి లక్ష్మీ నారాయణ ఎన్నో విషయాలు శ్రోతలకు తెలియజేశారు. రేడియోతో ఓనమాలు దిద్ది ఎందరో మహానుభావులని ఇంటర్వ్యూ చేసిన ఓలేటి పార్వతీశంని మిర్చి అమృత ఇంటర్వ్యూ చేశారు. తెలుగు ఎంత బాగా వస్తే ఇంగ్లీష్ అంత బాగా వస్తుందని, ఇంగ్లీష్ కు తెలుగు భాష అడ్డు కాదని నిరూపిస్తూ వేలాది మంది పేద విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పుతున్న ఇంగ్లీష్ ట్రైనర్ రామేశ్వర్ గౌడ్ గారిని కూడా ఆర్జే అమృత ఇంటర్వ్యూ చేశారు.

పుట్టింది అమెరికాలో అయినా… తెలుగును ఇష్టంగా నేర్చుకుని, మాట్లాడుతూ, రాస్తూ, చదువుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అన్నాను, తన తెలుగుతో ఫిదా చేస్తున్న ఫిన్లాండ్ యువతి రైటాను మిర్చి స్వాతి తెలుగు శ్రోతలకు పరిచయం చేశారు. అంతేకాదు, తన కథలతో తెలుగువారి మనసు గెలుచుకుని, 2024 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన యువ రచయిత రమేశ్ కార్తీక్ నాయక్ తో కూడా మిర్చి స్వాతి మాట్లాటి, తెలుగు సాహిత్య భవిష్యత్తుపై అనేక ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.

తెలుగు భాష, సంస్కృతీ సాంప్రదాయాల గురించి సీతారామయ్యగారి మనవరాలు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలతో, అచ్చమైన తెలుగింటి బామ్మగా సుపరిచితమైన రోహిణీ హట్టంగడి మాటలను మనసుకు హత్తుకునేలా మిర్చి కావ్య ఇంటర్వ్యూ చేశారు. మరాఠీవారైనా, మన మనసు దోచేలా తెలుగు మాట్లాడే నటులు- అతుల్ కులకర్ణి… తెలుగు భాష గురించి, తెలుగు సాంప్రదాయాల గురించి మిర్చి కావ్యతో పంచుకున్న విశేషాలు ఆకట్టుకున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న తెలుగు ఆచార్యులు కాంచనపల్లి గోవర్థన రాజుతో మిర్చి ఎక్స్ ట్రా క్లాస్, మిర్చి సరన్ బయటకు వెళ్లి తెలుగుపై యూత్ కి ఉన్న అవగాహన గురించి చేసిన పబ్లిక్ బైట్స్, తెలుగు భాష మీద అభిమానంతో అచ్చంగా తెలుగు పేరిట ఫేస్ బుక్ పేజీ నడుపుతున్న భావరాజు పద్మిని ఇలా అనేక మంది అతిథులు రేడియో మిర్చిలో సందడి చేశారు.


‘‘ఒక తెలుగు స్టేషన్ గా తెలుగు దినోత్సవం రోజు, ప్రత్యేక కార్యక్రమం చేయాలనుకున్నాం. వివిధ రంగాలలో తెలుగు కోసం కృషి చేస్తున్న వారిని, తెలుగు మీద అభిమానం చూపుతున్న వారిని మా మిర్చి స్టూడియోకి ఆహ్వానించి, ఆసక్తికరమైన విశేషాలు తెలియజెప్పే ప్రయత్నం చేశాం. ఇది మా టీమంతా కలిసి సాధించిన విజయమని చెప్తాను. మా టీంలో తేజ, పూర్ణిమా, ఐశ్వర్య, కార్తీక్, మోహన్, హర్ష, గణేశ్ ఇలా ప్రతి ఒక్కరూ అవిశ్రాంతంగా చేసిన కృషి వల్లనే తెలుగు భాష దినోత్సవం రోజు ఇంతమంచి విశేషాలు తెలుగు శ్రోతలకు తెలియజేయగలిగాం.’’ అని మిర్చి తెలుగు కంటెంట్ లీడర్ వాణీ మాధవి అవసరాల పేర్కొన్నారు.

తెలుగు కావ్యం, తెలుగు పద్యం గొప్పదనాన్ని మరోసారి నిత్యనూతనంగా పరిచయం చేసే ప్రయత్నం చేసింది. తెలుగు సినిమా వెలుగులను, తెలుగువారి పద్దతులను, తెలుగువారి వంటలను, తెలుగు చరిత్రను, తెలుగువారు సాధించిన విజయాలు, ప్రపంచం గుర్తించిన తెలుగు మహానుబావులను ‘‘మిర్చి తెలుగు మాట’’ ద్వారా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేసింది. తెలుగు గొప్పదనాన్ని రెండు రాష్ట్రాల తెలుగువారితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి ముంగిళ్లకు తీసుకురావడానికి చేసిన మిర్చి తెలుగు మాట కార్యక్రమం పట్ల శ్రోతలు ఫోన్ చేసి, తమ అభిమానాన్ని చాటుకోవడం కొసమెరుపు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole