బెంగాల్ నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. శనివారం కూచ్‌బెహార్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసుల నుంచి స్థానికులు తుపాకులు లాక్కొనేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ఓట్లు వేయడానికి వచ్చిన వారిపై కొందరు రాళ్లు రువ్వారని, భద్రత బలగాలతో ఘర్షణకు దిగారని, తప్పని పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాక కూచ్‌బెహార్ జిల్లాలోని మరో నియెజక వర్గంలో ఓటు వేయడానికి వచ్చిన ఆనంద బర్మా అనే వ్యక్తిని కాల్చి చంపారు. ఇక్కడ తృణమూల్, బీజేపి మధ్య ఘర్షణ జరగడంతో, కాల్పులు జరిపినట్లు తెలుస్తొంది.
తృణమూల్ కుట్రలకు పాల్పడుతోంది :
టీఎంసీ పార్టీ బెంగాల్‌ను హింసాత్మకంగా మారుస్తోంది. ఓటమి భయంతోనే మమతా ప్రజలను రెచ్చగొట్టి కేంద్ర బలగాలపైకి ఉసిగొల్పుతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బెంగాల్‌లోని నాడియా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో నెగ్గడానికి, తృణమూల్ రిగ్గింగ్, కుట్రలకు పాల్పడుతోంది. కూచ్‌బెహార్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బెంగాల్‌లో బీజేపికి ఉన్న ప్రజాదరణను చూసి దీదీ భరించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర బలగాలపై టీఎంసీ గుండాల దాడిని ఖడించారు. దీదీ ఆటలు ఇక సాగవని, ఆమె గద్దె దిగక తప్పదని మోదీ హెచ్చరించారు.